ప్రజాపక్షం/హైదరాబాద్:డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. నకిలీ పత్రాలతో వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న పశ్చిమగోదావరి జిల్లా నివాసులు వెలిశెట్టి వెంకట సత్య కృష్ణ వరా ప్రసాద్ (43), అదురి మురళి కృష్ణ మూర్తి (72), పాలకొల్లు శ్రీనివాస్‌రావు (45), కె.శ్రీనివాస్ (53), మహబూబ్‌నగర్ జిల్లా నివాసి, కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న ఎలా లక్ష్మి (46), సూరారం కాలనీలో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లా నివాసి నాగల్ల కృష్ణారావు (37) ఒక ముఠాగా ఏర్పడ్డారు. పరిచయస్తులు, బంధువులు, స్నేహితులకు తాము తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయిస్తామని నమ్మించారు. ఈ మేరకు ఒక్కక్కరినుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నారు. ఇలా ఈ ముఠా 169 మంది నుంచి సుమారు రూ.2,25,95,000 వసూలు చేశారు. తమకు సచివాలయంలో మంత్రులతో పరిచయం ఉన్నాయని నమ్మించారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించిన వారికి నకిలీ మంజూరు పత్రాలను సైతం తయారు చేసి ఇచ్చారు.అయితే బాధితులకు ఇచ్చిన డబుల్ బెడ్ ఇళ్ల మంజూరి పత్రాలు నకిలీవని గుర్తించారు. దీంతో ఒక్కొక్క బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా పదిహేను రోజుల్లో సుమారు 50 మందికిపైగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దృష్టి సారించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ దుండిగల్ పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో పైన పేర్కొన్న ఆరుగురు నిందితులని తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం వారందర్ని అరెస్టు చేసి విచారించగా చేసిన తప్పులను అంగీకరించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసగించామని నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఎవరైనా డబుల్ బెడ్ ఇళ్లన ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూమోసం
RELATED ARTICLES