అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో హైడ్రామా
ప్రజాపక్షం / మంథని / వెల్దుర్తి
ఇండ్లు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించి ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం కొంత మంది రాజకీయ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీలో జాప్యం జరుగుతున్నదని, కొన్ని ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ పార్టీ అనుయాయులకు ఇస్తున్నారని, మరికొన్ని చోట్ల నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఇండ్ల కేటాయింపు కోసం అందోళనలు చేపడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఆక్రమణకు గురయ్యాయని, అధికార పార్టీ నాయకులకు కేటాయించారని పోచమ్మవాడకు చెందినస్థానిక మహిళలు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. మంథని పట్టణంలో 2018లో 92 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కాగా కొంత మంది ఇండ్లు తమకే కేటాయించారని వాటికి వేసిన తాళాలను తీసి గృహ ప్రవేశం చేశారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు, స్థానిక తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇల్లు ఉన్నవారికే డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించారని, అధికార పార్టీ నాయకులకు చెప్పిన వారికి, అనర్హులకు కేటాయించడం వల్ల తమకు అన్యాయం జరిగిందని అధికారులను నిలదీశారు. తాము ఎవరికీ ఇల్లు కేటాయింపు జరపలేదని, గుత్తేదారు, సంబంధిత శాఖల నుండి తాము ఇండ్లను స్వాధీనం చేసుకోలేదని తహసీల్దార్ బండి ప్రకాష్ స్పష్టం చేశారు. ఇళ్లను ఆక్రమించుకున్న వారిని వెంటనే ఖాళీ చేయిస్తామని, నిరుపేదలకు అర్హులైన వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తహసీల్దార్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉన్న వారిని బయటకు పంపి, సామాను బయట పడేసి తాళాలు వేశారు. వేసిన తాళాలను బద్దలుకొట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నివాసం ఉంటున్న వారికి బయటకు పంపి తాళాలు వేశారు. ఇళ్లను ఎవరికి కేటాయించకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి కానీ, ఆ ఇంటి తాళాలు మున్సిపల్ చైర్ పర్సన్ పుట్టశైలజ టిఆర్‌ఎస్ నాయకులకు ఇవ్వడం వల్లనే వారు గృహప్రవేశం చేశారని బిజెపి పట్టణశాఖ అధ్యక్షుడు ఎడ్ల సదాశివ్ అధికారులను నిలదీశారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఎసిపి గిరిప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. ఆందోళనకారులను, డబుల్‌బెడ్‌రూమ్‌లు ఆక్రమించుకున్న వారిని బయటకు పంపి ఇళ్లకు తాళాలు వేశారు. రెండు నెలల్లోగా అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి గృహాలను కేటాయిస్తామని తహసీల్దార్ బండి ప్రకాష్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమనిగింది.
-వెల్దుర్తి నెరవేరని సిఎం హామీ
మెదక్ జిల్లా వెల్దుర్తిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో స్వయంగా సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. వెల్దుర్తిలో గత 2017లో వంద డబుల్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 36 సింగిల్, జి ప్లస్ వన్ పద్దతిలో 64 ఇండ్లను నిర్మించారు. ఎంతో విలువైన ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన తమకు డబుల్ ఇండ్లు వస్తాయని ఆశతో ఉన్న రోడ్డు వెడల్పు బాధితులకు ఏండ్లు గడుస్తున్న ఇండ్లు పంపణీ చేయకపోవడంతో ఇండ్లు ఇస్తారా, ఇవ్వరా అని అందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇండ్లు పంపిణీ చేసి ఆదుకోవాలని కోరుతూ ఎన్నోమార్లు స్థానిక ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డిని కలిసి విన్నవించినా, శ్రావణ మాసంలో, మంచిరోజులు వచ్చిన తరువాత అని, దసరాకు అంటూ కాలయాపన చేస్తున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడువులతో విసిగిపోయిన రోడ్డు వెడల్పు బాధితులు గత కొద్ది నెలల కింద డబుల్ ఇండ్ల తాళాలు పగులగొట్టి ఇండ్లను శుభ్రం చేసి, వంటావార్పు నిర్వహించి ఇండ్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపిపి స్వరూప నరేందర్‌రెడ్డి, జెడ్‌పిటిసి రమేష్‌గౌడ్‌లు బాధితుల వద్దకు వచ్చి ఆందోళణ చేయవద్దని, ఎంఎల్‌ఎ దృష్టికి బాధితుల సమస్యలను తీసుకెళ్లి త్వరలోనే ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతలో నాయకులపై బాధితులు మండిపడుతున్నారు. తాము పూర్తిస్థాయిలో ఇండ్లను, దుకాణాలను కోల్పోయి ఏండ్ల నుండి ఇతరుల ఇండ్లలో అద్దెకు ఉంటున్నామని, తమ అద్దెను ఎవరు చెల్లిస్తారని, వ్యవసాయం, కూలీ పనులు చేసుకునే తమ కుటుంబ పోషణ భారంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డు వెడల్పు బాధితులతో పాటు ఇండ్లు లేని నిరుపేద బాధితులకు డబుల్‌ఇండ్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
‘డబుల్ బెడ్ల’ రచ్చ
RELATED ARTICLES