HomeNewsBreaking Newsడబుల్‌ ఇండ్లలో జిల్లెల్లు నిలిచిన నిర్మాణాలు

డబుల్‌ ఇండ్లలో జిల్లెల్లు నిలిచిన నిర్మాణాలు

బిల్లులు రాకనే అంటున్న గుత్తేదారులు
పేదల కల నెరవేరేదెప్పుడు…?
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో :
తలదాచుకునేందుకు ఆదరువు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు రెండు పడక గదులు నిర్మించి ఇస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం, బిడ్డా అల్లుడు, బంధువు వచ్చినా ఇబ్బంది లేకుండా, బర్రె, గొర్రె, కోడి మొదలైన వాటిని సాకేందుకు ఇబ్బంది లేకుండా ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన శైలిలో చెబుతుంటే తెలంగాణ ప్రజల కండ్లలో మెరుపులు కన్పించాయి. తరతరాల ఇబ్బందికి తెరపడుతుందనుకున్నారు. పథకం ప్రకటించిన మొదట్లో అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించారు. మొదటి ఏడాది చకచకా నిర్మాణాలు పూర్తి చేసుకున్న తర్వాత నుంచి డబుల్‌ నిర్మాణాల్లో ట్రబుల్‌ మొదలైంది. ప్రతి ఇంటికి రూ. 5.20 లక్షలు కేటాయించింది. డబుల్‌ నిర్మాణాల కాంట్రాక్టులను కొందరు గుత్తేదారులకు బలవంతంగా అంటగట్టారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్‌ సరిపోదని గుత్తేదారులు చేతులు ఎత్తేస్తే మరికొందరు ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని నిర్మాణాల గురించి పట్టించుకోవడం లేదు. ఒక గ్రామంలోనూ, ఒక నియోజక వర్గంలోనూ కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. నాణ్యతా లేమితో ఇండ్లు నిర్మించడంతో పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. బడ్జెట్‌ తక్కువగా ఉండడంతో దానికి తగినట్లుగానే నిర్మిస్తున్నామని గుత్తేదారులు అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది మంది మినహా మిగిలిన ఇంజనీరింగ్‌ వ్యవస్థ అవినీతి మత్తులో జోగుతుండడంతో నాణ్యత గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రజల పరుష పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో జిల్లెల్లు పుట్టా అంటారు. జిల్లెల్లు మొలవడాన్ని తప్పిదంగా భావిస్తారు. అటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రారంభించిన డబుల్‌ ఇండ్లలో కర తుమ్మలు, జిల్లెల్లు మొలిచాయి. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయితే తమ సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో ఉన్న నిరుపేదల ఆశలు నిరాశలవుతున్నాయి. కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా పూర్తిగా నిర్మాణ వ్యయం బిల్లులు రాలేదని గుత్తేదారులు ఇండ్లను ప్రభుత్వానికి స్వాధీనపర్చలేదు. వీటి గురించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. పేదలకు అప్పగించిన ఇండ్ల లబ్దిదారులది మరో దయనీయ పరిస్థితి. గోడలు నెర్రెలువారుతుండగా శ్లాబు పెచ్చులు ఊడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు అప్రతిష్ట పాలు కావడమే కాకుండా రాష్ట్రంలోని ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడమే గాక కొత్తగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments