ఉ॥ 8 నుంచే భానుడు ఉగ్రరూపం
44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయట కు రావొద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన ఉష్ణోగ్రతలను ప్రకటించారు. జగిత్యాలలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత, పెద్దపల్లిలో 47.0, మంచిర్యాలలో 46.9, నల్లగొండలో 46.8, పెద్దపల్లిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత, రాజేంద్రనగర్‌లో 42.5, హయత్‌నగర్‌లో 41.8, హకీంపేటలో 42.8, ఇక్రిశాట్ పటాన్‌చెరువులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాచలంలో 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడు ప్రతాపానికి పగలు సైతం కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. ఉదయం 7 గంటల నుంచే వేడెక్కుతున్న వాతావరణం రాత్రి 8 గంటల వరకు చల్లబడడం లేదు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉక్కపోత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 26వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించారు.
ఠారెత్తిస్తున్న ఎండలు
RELATED ARTICLES