HomeNewsBreaking Newsట్రెండ్‌ సెట్టింగ్‌! గడిచిన దశాబ్దంలో ప్రపంచాన్ని మార్చేసిన కొత్త ధోరణులు

ట్రెండ్‌ సెట్టింగ్‌! గడిచిన దశాబ్దంలో ప్రపంచాన్ని మార్చేసిన కొత్త ధోరణులు

ట్రెండ్‌ సెట్టింగ్‌ అంటేనే ఒక కొత్త ధోరణిని సృష్టించడం. మనం 2020వ సంవత్సరంలోకి అడుగుపెట్టడమే కాకుండా, సరికొత్త దశాబ్దంలోకి కూడా ప్రవేశిస్తున్నాం. ఈ తరుణంలో గడిచిన ఏడాది ఏం జరిగిందన్న అంశం కంటే గడిచిన దశాబ్దం ఏం ఒరిగిందనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2010-2019 దశాబ్దకాలం మానవజాతి పరిణామ క్రమంలో అత్యంత కీలకమని, మనిషిని అనూహ్యమైన మార్పులకు లోనుచేసిందని విశ్లేషకులు చెపుతున్నారు. అందుకే ఈ దశాబ్దం ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిందన్నది అందరి భావన. పదేళ్లలో ఎన్నో ట్రెండ్స్‌ మనిషిని తీవ్రమైన ప్రభావితం చేశాయి. అవేంటో తెలుసుకుందాం!
1. స్మార్ట్‌ఫోన్‌
ప్రస్తుతం జనం వద్ద రెండే రెండు రకాల ఫోన్లు వున్నాయి. ఒకటి ఐఫోన్‌. రెండోది ఆండ్రాయిడ్‌. ఐఫోన్‌ 2007లోనూ, ఆండ్రాయిడ్‌ 2008లోనూ మార్కెట్‌లోకి వచ్చింది. అయితే మూడేళ్లు పూర్తికాకుండా ఈ రెండు వెర్షన్లు స్మార్ట్‌ఫోన్లుగా ప్రజల చేతుల్లోకి వచ్చాయి. తొలిసారిగా 2010లో ఐఫోన్‌ ఏకంగా బ్లాక్‌బెర్రీ అమ్మకాలను వెనక్కినెట్టేయగా, ఎన్నో కంపెనీలు ఆండ్రాయిడ్‌ వెర్షన్లతో మార్కెట్‌ను ఫోన్ల కుప్పగా మార్చేశాయి. ఫోటో ఆల్బమ్‌, ఎంపి2ప్లేయర్‌, వాలెట్‌, క్రెడిట్‌కార్డు, ఫ్లాష్‌లైట్‌, మ్యాప్‌లతోపాటు ప్రతిరోజూ వ్యక్తికి అవసరమయ్యే ప్రతి విషయమూ స్మార్ట్‌ఫోన్‌తోనే ముడిపడిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ లేకుండా నగదు లావాదేవీలు సైతం జరగని పరిస్థితి నెలకొన్నది.
3. వైరల్‌ కావడం
వైరల్‌ అనే పదానికి అసలుసిసలు అర్థం చెప్పిన దశాబ్దం ఇదే. వైరల్‌ కావడమంటే ఒక విషయం ఆ నోట ఈనోట పాకుతూ, చివరకు అందరికీ చేరడమే. గడిచిన పదేళ్లలో లెక్కలేనన్ని వీడియోలు, సందేశాలు వైరల్‌ అవుతూ ఎన్నో ఉద్యమాలకు, ఇంకెన్నో మార్పులకు, ఎన్నెన్నో పరిణామాలకు దారితీశాయి. సామాజిక అంశాలే ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌ వంటి సవాళ్లు సైతం వైరల్‌ అవుతూ ఆకట్టుకున్నాయి. సమాజ సేవకు దూరంగా ఉండే ఎంతోమంది వ్యక్తులు వైరల్‌ న్యూస్‌తో స్పందించి, ముందుకు కదిలిన సందర్భాలకు గడిచిన దశాబ్దం సాక్షీభూతంగా నిలిచింది. అందుకే వైరల్‌ కావడమనేది ఈ పదేళ్లలో పుట్టుకొచ్చిన గొప్ప కాన్సెప్ట్‌ అని చెప్పవచ్చు.
4. హరిత నాదం!
ఎన్నో ఏళ్లుగా మానవాళి చేసిన తప్పులే చివరకు మనిషి మనుగడకే ముప్పుగా పరిణమించాయి. గాలి కాలుష్యం, నీటికాలుష్యం, ప్లాస్టిక్‌ వాడకం, కలుషిత ఆహారం, మనిషి నిర్లక్ష్యం, అత్యధిక రసాయనాల వాడకం వంటి ఎన్నో చర్యల మూలంగా వాతావరణం ప్రమాదంలో పడింది. ఎన్నో కారణాలు గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీసింది. చివరకు భూమండలానికే ముప్పువాటిల్లింది. ఈ ముప్పు నుంచి మనిషిని తప్పించాలంటే మనిషే ఏదో ఒకటి చేయాలి. అదెక్కడ మొదలైనా, ఎవరు ప్రారంభించినా, అందరిలోనూ ఆ భావన ఏర్పడాలి. పర్యావరణ పరిరక్షణ అనేదే ఆ కొత్త భావన. నిజానికి ఇదేమీ కొత్త పదం కాదు. అయినప్పటికీ, కనీసం 40 శాతం మంది ప్రజలు ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, తెలిసొచ్చిన ప్రతి వ్యక్తీ ‘గోయింగ్‌ గ్రీన్‌’ కాన్సెప్ట్‌ను తమ భుజానకెత్తుకున్నారు. హరితనాదాన్ని పూరించారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ వాడకంపై అవగాహన కల్పించడం, వీలైనంత మేరకు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్న భావన విపరీతంగా పెరిగింది ఈ దశాబ్దంలోనే. హైబ్రిడ్‌ కార్ల వాడకం, సోలార్‌ ప్యానెళ్ల వినియోగానికి బాటలు వేసింది ఈ దశాబ్దమే. ఒక్క అమెరికాలోనే కేవలం మూడేళ్లలో 485 శాతం సోలార్‌ ప్యానళ్లను ఇన్‌స్టాల్‌ చేశారంటే ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఊపందుకుందో ఊహించవచ్చు.
5. ఇన్‌స్టాగ్రామ్‌ అవతరణ
పదేళ్ల క్రితం అంటే ఈ దశాబ్దం కాకుండా అంతకుముందు దశాబ్దం (2000-2009)లో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌మీడియా వెబ్‌సైట్లు ఆవిర్భవించి, ప్రపంచాన్ని ఎలా మార్చాయో, గడిచిన దశాబ్దంలో ఇదే కోవకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక కూడా అలాగే సంచలనం సృష్టించింది. 2010 అక్టోబరులో చిన్న ఫోటోలను షేర్‌ చేసుకునే యాప్‌గా రంగంలోకి దిగిన ఇన్‌స్టాగ్రామ్‌ ఈనాడు స్టోరీలు, వీడియోలు, మేసేజ్‌లు, వీడియో కాలింగ్‌, ఇన్‌యాప్‌ షేరింగ్‌ వంటి ఎన్నో ఫీచర్లతో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ల కన్నా క్రేజీ సబ్జెక్ట్‌గా మారిపోయింది. ఇంకెన్నో యాప్‌లకు ఇది తలుపులు తెరిచింది.
6. సూపర్‌హీరో మూవీస్‌
సినిమా అనేది మనిషిలో ఒక భాగమైపోయింది. ఎన్నో ట్రెండ్స్‌తో సినిమారంగంలోనూ కొత్త పరిణామాలు వస్తూవుంటాయి. ఈ పదేళ్ల కాలంలో సూపర్‌హీరోల శకం నడిచిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. హాలీవుడ్‌లో మార్వల్‌ సిరీస్‌, స్టార్‌ట్రెక్‌ సిరీస్‌ హవా నడిచింది. కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాయి. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినా, సూపర్‌హీరోల మూవీలు మాత్రం కోట్ల డాలర్లు కొల్లగొట్టాయి. స్పైడర్‌మ్యాన్‌, ఎవెంజెర్స్‌, బ్లాక్‌పాంథర్‌, వండర్‌వుమన్‌ వంటి మూవీ సిరీస్‌లు సినీ ప్రేమికుల మనసులు దోచుకున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీ పెరగడంతో తెరపై మాయాజాలం సృష్టించారు. మన తెలుగు డైరెక్టర్‌ రాజమౌళి కూడా బాహుబలి సినిమాలతో ఒక అద్భుతాన్ని సృష్టించారు. డిజిటల్‌ మాయ ఈ దశాబ్దపు సాంకేతిక శిఖరం.
7. పొలిటికల్‌ ట్విటర్‌
రాజకీయ నాయకులు చట్టసభల్లో మాట్లాడుకుంటారు, ఎన్నికల సభల్లో పోట్లాడుకుంటారు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాల్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ వుంటారు. కానీ వీరంతా తొలిసారిగా ట్విటర్‌ వేదికగా కొట్టుకుంటున్నారు. ఇదే పొలిటికల్‌ ట్విటర్‌. ప్రపంచవ్యాప్తంగా ట్వీట్‌లు చేయడం సెలబ్రిటీలకే పరిమితంగా వుండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ట్వీట్‌లలో ఆరితేరారు. అవే ప్రెస్‌నోట్‌లుగా, ప్రకటనలు, అభిప్రాయాలుగా, పత్రికల వార్తలుగా మారిపోయాయి. పైగా ట్వీట్‌లకు తిరుగులేని సాధికారత వుండటంతో పొలిటికల్‌ ట్విటర్‌ ఖాతాల ఫాలోవర్లు పెరిగిపోయారు. భారత్‌లో ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీలతోపాటు దాదాపు జాతీయ నాయకులంతా ట్వీట్‌లతో పోటీపడుతున్నారు. 2012, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 2014, 2019 భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్‌ల ప్రభావం తీవ్రంగా పడింది.
8. జనసందోహం…కాల్పుల కలకలం
సాంకేతిక పరిజ్ఞానం, సోషల్‌మీడియా, సామాజిక చైతన్యం తదితర అంశాల పుణ్యమా అని జనం పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడే ఈ తరహా ధోరణులు కన్పించాయి. సామాజిక సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఉవ్వెత్తున లేచాయి. రోడ్లపై జనసందోహం కనపడటమనేది ఎన్నడూ లేనంతగా గత పదేళ్లలో చూశామని విశ్లేషకులు చెపుతున్నారు. ‘మీటూ’ ఉద్యమం మొదలుకొని, పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనల వరకు ఎన్నో రకాల నిరసనలకు గత దశాబ్దం వేదికయింది. అదే సమయంలో గన్‌కల్చర్‌ కూడా విచ్ఛలవిడిగా పెరిగింది. దీన్నే మాస్‌ షూటింగ్స్‌ అని పిలిచారు. తుపాకులు, రివాల్వర్లతో దుండగులు వీధుల్లోపడి జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలు ఎన్నడూ లేనంతగా గత పదేళ్లలో జరిగాయి. అలాగే పోలీసులు జనంపై జరిపిన కాల్పులు కూడా ఇందులో భాగమే.
9. స్వలింగ సంపర్కం, వైవాహిక జీవితం
స్త్రీపురుషుల మధ్యనే సంపర్కమైనా, వైవాహిక జీవితమైనా ఉండటమనేది పదేళ్ల క్రితం నాటి మాట. గడిచిన దశాబ్దం ఈ సాంప్రదాయాన్ని చిత్తుచిత్తు చేసింది. ఇద్దరు పురుషుల మధ్య, లేదా ఇద్దరు స్త్రీల మధ్య సంపర్కం వుండవచ్చు, సంసారం చేయవచ్చు. నిజానికి స్వలింగ సంపర్కమనేది అనధికారికంగా ఉన్నదే. అయితే చట్టరూపం దాల్చింది 2015 జూన్‌ 27నే. స్వలింగ వైవాహిక జీవితం చట్టబద్ధమేనంటూ అమెరికా సుప్రీంకోర్టు ఆ రోజున తీర్పుచెప్పింది. ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలూ ఈ తీర్పును అనుసరిస్తూ తీర్పులిచ్చాయి. ఇద్దరు స్త్రీల మధ్య, లేదా ఇద్దరు పురుషుల మధ్య పెళ్లి అనేది అధికారికంగా మారింది. వారిక హాయిగా సంసారం కూడా చేసుకోవచ్చు. ఇది ఈ దశాబ్దపు గొప్ప సామాజిక మలుపు.
10. హిప్‌హాప్‌ మ్యూజిక్‌ హవా
హిప్‌హాప్‌, ఆర్‌ అండ్‌ బి మ్యూజికల్‌ సెన్స్‌ గడిచిన పదేళ్లలో ఒక గొప్ప సాంస్కృతిక మార్పు. సంగీతంలోనూ, నృత్యాల్లోనూ మార్పులు సంభవిస్తూ వుంటాయి. సాంప్రదాయ నృత్య రీతులు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేసమయంలో కొత్తకొత్తవి పుట్టుకొస్తూ వుంటాయి. ఒక దశలో వాటి హవా నడుస్తూ వుంటుంది. బ్రేక్‌డ్యాన్స్‌, డిస్కోడ్యాన్స్‌ వంటి పరిణామాలు ఈ తరహాలోనివే. తాజాగా హిప్‌హాప్‌ మ్యూజిక్‌ హవా నడుస్తోంది. ఈ ధోరణి గడిచిన దశాబ్దం అందించిందే. గత దశాబ్దకాలంలో మొత్తం సంగీత, నృత్య ప్రపంచంలో 24.5 శాతం హిప్‌హాప్‌, ఆర్‌ అండ్‌ బి మ్యూజికల్‌ మూవ్‌మెంట్‌ భాగమే. దీన్ని గొప్ప మ్యూజిక్‌ ఛేంజ్‌గా భావిస్తున్నారు. ఇప్పుడు భారత్‌లో కూడా ఈ హవా నడుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments