త్వరలో లోక్‌సభకు బిల్లు
కశ్మీర్‌లో రాష్ట్రపతిపాలన పొడిగింపు
ఆధార్ బిల్లుకు సవరణలు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. గత ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఇది రాజ్యసభలో ఆమోదం కాలేదు. 16వ లోక్‌సభ రద్దవడంతో దీని గడువు ముగిసిపోయింది. జూన్ 17న ప్రారంభమయ్యే 17వ లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ బిల్లులోని కొన్ని అం శాలను విపక్షాలు వ్యతిరేకించడంతో గతంలో రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఆధిక్యం లేకపోవడంమే దానికి కారణం. ట్రిపుల్ తలాక్ పద్దతిని పాటించడం నేరంగా పరిగణిస్తూ, ఆ విధంగా విడాకులు ఇచ్చే భర్తకు జైలు శిక్ష విధించేలా ఉన్న నిబంధనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. కాగా, జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు మాసాల పాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. జూన్ 20 నుంచి ఆరు మాసాలపాటు రాష్ట్రం రాష్ట్రపతిపాలనలో వుంటుంది. అలాగే, ఆధార్ సవరణ బిల్లు కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బ్యాంకు ఖాతాలను తెరవడానికి, మొబైల్ ఫోన్ల కనెక్షన్ల కోసం గుర్తింపు కార్డుగా ఆధార్‌ను స్వచ్ఛందంగా ఉపయోగించుకునే వీలును కల్పిస్తూ ఈ సవరణ చేశారు. ఇప్పటివరకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అయితే దీనిపై విమర్శలతోపాటు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పడంలో బిల్లుకు సవరణ చేస్తూ మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్ 17న ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆధార్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ 2019ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి జవదేకర్ తెలిపారు.