కొన్ని ఎన్నికల గుర్తులతో టిఆర్‌ఎస్ ఓట్లకు గండి
ట్రక్కు, ఆటో, రోడ్‌రోలర్, టోపీ, కెమెరా గుర్తులు వద్దు
ఇసిని కలవనున్న కెసిఆర్
ప్రజాపక్షం/ హైదరాబాద్ : కొన్ని ఎన్నికల గుర్తులు టిఆర్‌ఎస్ ఓట్లకు గండికొడుతున్నాయి. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న ట్రక్కు, ఆటో, రోడ్ రోలర్, టోపీ, కెమెరా గుర్తులు టిఆర్‌ఎస్ ఎన్నికల గుర్తును పోలి ఉంటున్నాయి. దీంతో ఆ పార్టీ ఓట్లకు కొన్ని గండిపడుతూ, పలు చోట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను కూడా శాసిస్తున్నదని టిఆర్‌ఎస్ భావిస్తుం ది. అందుకే భవిష్యత్తు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈ గుర్తులు ఉండకుండా టిఆర్‌ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఈ గుర్తులను తెలంగాణలో నిషేధించాలని టిఆర్‌ఎస్ కోరగా, తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సైతం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ విషయాన్ని ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ గుర్తులను కేటాయించకుండా టిఆర్‌ఎస్ నేతలు అనేక ప్రయత్నాలు చేసినా ఫలి తం లేకుండా పోయింది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో తగిన ముల్యాన్ని చెల్లించుకోక తప్పలేదని, మరి కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత తక్కువ మెజార్టీతో గెలుపొందామని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కారుకు పొలిన గుర్తులతో టిఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఆపార్టీ నేతలు ముందస్తుగానే ట్రక్కు, ఆటో, రోడ్ రోలర్, కెమెరా, టోపీ గుర్తులను కేటాయించకుండా చూసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను మార్యదపూర్వకంగా కలిసే అవకాశమున్నది. పనిలో పనిగా కొన్ని గుర్తులను తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చూడాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కోరనున్నట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ ఎన్నికల “ కారు ” గుర్తుకు పొలిన గుర్తులను కేటాయించడంతో కొందరు నిరక్షరాస్యులు, వృద్ధులు అయోమయానికి గురవుతున్నారని, తద్వారా తమకు రావాల్సిన ఓట్లు ట్రక్కు, రోడ్ రోలర్, టోపి, ఆటో, కెమెరాలకు పడుతున్నాయని టిఆర్‌ఎస్ చెబుతుంది.