రష్యాతో మధ్యశ్రేణి అణు మిస్సిలీల ఒడంబడిక (ఐఎన్ వైదొలుగుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధృవీకరించి కొత్తగా ఆయుధ పోటీకి తెరతీశారు. 1987లో నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ సంతకాలు చేసిన ఆ ఒడంబడిక కాలపరిమితి మరో మూడేళ్లలో ముగియనుంది. 500 -5000 కిలోమీటర్లదూరం ప్రయాణించగల స్వల్ప, మధ్యశ్రేణి మిస్సిలీలు అభివృద్ధి చేయటాన్ని, పరీక్షించటాన్ని, కలిగి ఉండటాన్ని అది నిషేధించింది. ముఖ్యంగా అమెరికా యూరప్ మిత్రరాజ్యాల భయాలను తొలగించటానికి అది ఉద్దేశించింది. రష్యా దాన్ని ఉల్లంఘించి 9ఎం729 మిస్సిలీ(ఎస్ అని కూడా పిలుస్తారు)అభివృద్ధి చేయగా అది తమ చేతులు కట్టిపడేసిందని ట్రంప్ ఆరోపించారు. ఆ ఒడంబడిక రద్దు ప్రయత్నం పట్ల జర్మనీ విచారం వ్యక్తం చేయగా, బ్రిటన్ ట్రంప్ కొమ్ముగాసింది.
గతంలో అమెరికా సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బ్లాక్ చేయటం ట్రంప్ విదేశాంగ విధానంలో భాగం. అందుకు సమర్థనగా ఒప్పంద భాగస్వాములను నిందించటాన్ని ఒక విధానంగా పాటిస్తున్నాడు. నాటో కూటమి రద్దు చేస్తానంటూ బెదిరించి దాని వ్యయంలో తమ వాటా పెంచేటట్లు యూరప్ దేశాలను ఒప్పించాడు. యూరప్ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి తూట్లు పొడిచాడు. చైనా సహా పలు దేశాలనుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు పెంచి, ఆ తర్వాత ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనాతో వాణిజ్య యుద్ధాన్ని విస్తరించి దాన్ని లొంగదీయజూస్తున్నాడు. ఇరాన్ ఐరాస పర్యవేక్షణలో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్న ట్రంప్ దానిపై ఆర్థిక ఆంక్షలు విధించాడు. అంతర్జాతీయ తపాలా ఒప్పందంనుంచి నిష్క్రమించాడు. అంతర్జాతీయ పర్యావరణ (పారిస్) ఒప్పందంనుంచి కూడా వైదొలిగాడు. ఇటువంటి బరితెగించిన నిర్ణయాల ద్వారా, తన పూర్వ అధ్యక్షులు అమెరికా ప్రయోజనాలను పట్టించుకోలేదని, అమెరికా ఆధిపత్యం నెలకొల్పేందుకు తానొక్కడినే కృషిచేస్తున్నట్లు అమెరికన్ ఒక భ్రమపూరిత భావన సృష్టించటానికి ప్రయత్నిస్తున్నాడు. చైనాను ఆర్థికరంగంలో, రష్యాను సైనికరంగంలో దెబ్బకొడితే తమ అగ్రరాజ్య ఆధిపత్యానికి తిరుగుండదని వాటితో కయ్యం పెట్టుకుంటున్నాడు.
ఇరాన్, సిరియా, ఉక్రేన్ వివాదాల్లో అమెరికా దుందుడుకుతనానికి రష్యా ఎదురునిలబడటం ట్రంప్ కంటగింపుగా ఉంది. అంతకుముందు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యతిరేకంగా రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణ ఉంది. అందుకు తొలుత ట్రంప్ సంతోషించినా ఆ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తు ఆయన మెడకు తగులుకునేలా తయారైంది. రక్షణ, విదేశాంగమంత్రులుగా యుద్ధోన్మాదుల్ని నియమించుకున్నాక వారు రష్యాను సైనికంగా దెబ్బతీసే వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఆ పర్యవసానమే రష్యాతో మిస్సిలీ ఒప్పందం రద్దు ప్రకటన. దీనివల్ల ఏమి జరుగుతుంది? ఆయుధ పోటీ తిరిగి మొదలవుతుంది. అమెరికన్ సైనిక పారిశ్రామిక పెట్టుబడిదారులకు కొత్త ఆయుధాల అభివృద్ధికి ఆర్డర్లు వస్తాయి. ఆయుధ పోటీలో గత సోవియట్ యూనియన్ రష్యా చిక్కుకుంటే అసలే అస్తుబిస్తుగా ఉన్న దాని ఆర్థికవ్యవస్థ మరింత క్షీణిస్తుంది. అప్పుడు రష్యా దారిలోకి వస్తుంది. ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా స్థిరపడుతుంది. ప్రపంచశాంతి ఉద్యమం దశాబ్దాలపాటు పోరాడి సాధించు కున్న అణ్వాయుధ నియంత్రణ, శాంతి, ఉద్రిక్తోపశమన వృధా అవుతాయి. అందువల్ల శాంతిశక్తులు ప్రపంచవ్యాప్తంగా మరోమారు క్రియాశీలంగా గళమెత్తాల్సిన తరుణం ఆసన్నమైంది.
ట్రంప్ ‘మిస్సిలీ’ పేచీ
RELATED ARTICLES