పెరుగుతున్న వ్యతిరేకత
క్యాపిటోల్‌పై దాడి బాధ్యులకు తీవ్ర పరిణామాలు తప్పవు : అటార్నీ జనరల్ హెచ్చరిక
ట్రంప్‌ను గద్దె దించేందుకు 25వ సవరణ చట్టం ప్రయోగించాలి : డెమోక్రాట్స్
వాషింగ్టన్ : స్వయం కృతాపరాధానికి పాల్పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెడకు, పదవీకాలం చివరిరోజుల్లో ఉచ్చు బిగుసుకుంటోందా? అమెరికాలో పెల్లుబుకుతున్న ఆగ్రహజ్వాల, ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పతాకస్థాయికి చేరిన ట్రంప్ వ్యతిరేకత ఔననే చెబుతున్నాయి. క్యాపిటోల్‌పై దాడి చేసిన వారు, హింసాత్మక ఘటనలకు బాధ్యులైనవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఈ నేపథ్యంలో తాత్కాలిక అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 68 మందిని అరెస్టు చేశారు. దొరికినవారిపై కేసులు నమోదు చేశారు. న్యాయశాఖ చట్టాలకు అనుగుణంగా దాడికి బాధ్యులైన వారంతా పూర్తిస్థాయిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని జెఫ్రీ రోజెన్ అన్నారు. స్పెషల్ ఏజంట్లు, అమెరికా క్యాపిటోల్ పోలీస్ ఇన్వెస్టిగేటర్లు, ఎఫ్‌బిఐ, ఎటిఎఫ్, మెట్రో పాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ కేసుపై రాత్రంతా భారీ కసరత్తు చేశామన్నారు. క్యాపిటోల్ వద్ద గుమిగూడిన ప్రజల నుండి సమాచారం సేకరించి, బాధ్యులను గుర్తిస్తామని అన్నారు. అమెరికా క్యాపిటోల్‌లో హింస, ఆస్తుల విధ్వంసం ఘటనల్ని గమనిస్తే, ప్రభుత్వ వ్యవస్థలపట్ల, ప్రజాస్వామ్య ప్రక్రియపట్ల వారికి ఏ మాత్రం గౌరవ మర్యాదలు లేవని చాలా స్పష్టంగా అర్థమవుతోందని ఎఫ్‌బిఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే అన్నారు. జనవరి 6వ తేదీ ఘటనలపై ఎఫ్‌బిఐ తన పూర్తిస్తాయి దర్యాప్తు యంత్రాంగాన్ని, వనరులను రంగంలోకి దింపిందని, ఈ విషయంలో నిశ్చింతగా ఉండాలని అమెరికా ప్రజలకు భరోసా ఇచ్చారు. బుధవారం జరిగిన ఘటనలు విషాదకరమైనవి, వ్యవస్థను బలహీనపరచేవని తాత్కాలిక దేశీయ భద్రతా కార్యదర్శి ఛాడ్ ఉల్ఫ్ అన్నారు. తామెప్పుడూ రెండువైపులా జరిగే రాజకీయ హింసను ఒకే పద్ధతిలో ఖండిస్తామని,అధ్యక్షుడి మద్దతుదార్లు కొందరు రాజకీయ ప్రయోజనాలు సాధించడం కోసం హింసకు పాల్పడ్డారని తాము గుర్తించామని, ఇది ఎంతమాత్రం సమ్మతింప రానిదని ఛాడ్ ఉల్ఫ్ అన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ మద్దతుదార్లు పోలీసులతో బాహాబాహీకి దిగిన ఘర్షణల్లో మద్దతుదార్ల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పోలీసు అధికారి శుక్రవారంనాడు మరణించారు. అల్లర్లలో మహిళపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారకుడైన పోలీసు అధికారిని మరోవైపు సస్పెండ్ చేశారు.
ట్రంప్‌పై 25వ సవరణ చట్టాన్ని ప్రయోగించాల్సిందే
జో బైడెన్ ఎన్నికను ధృవీకరించేందుకు ఎలక్టోరల్ కాలేజ్ సమావేశం జరుగుతున్న సమయంలో బుధవారం రాత్రి సాయుధులైన ట్రంప్ మద్దతుదార్లు క్యాపిటోల్ వద్ద అల్లర్లకుపాల్పడి, సమావేశ భవనంలోకి దూసుకుపోయిన ఘటన అమెరికా చరిత్రను మార్చివేసింది. అదొక మాయనిమచ్చగా మిగిలిపోవడంతో, సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతుదార్లను రెచ్చగొట్టిన బాధ్యత ట్రంప్‌దే అని డెమొక్రాట్లు మండిపడుతున్నారు. జనవరి 20వ తేదీ అధికార మార్పిడికి ముందే ట్రంప్‌ను పదవి నుండి తొలగించేందుకు రాజ్యాంగంలోని 25వ సవరణను ఆశ్రయించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లిఖితపూర్వక విజ్ఞాపన చేశారు. దేశాధ్యక్షుణ్ణి పదవినుండి తొలగించి, ఉపాధ్యక్షుణ్ణి అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టేందుకు 25వ సవరణ అనుమతిస్తుంది. దేశాధ్యక్షుడు గనుక ప్రమాదకరంగా, దేశద్రోహపూరితంగా ప్రవర్తిస్తే తక్షణం తొలగించేలా జాన్ ఎఫ్. కెనడీ హత్యానంతరం రాజ్యాంగానికి 25వ సవరణ చేశారు. ఉపాధ్యక్షుడు పెన్స్ నుండి వీలైనంత త్వరగా అనుకూల సమాధానం వస్తుందని తాము ఎదురుచూస్తున్నామన్నారు డెమొక్రటిక్‌పార్టీ నాయకులు. ఇద్దరు డెమొక్రాట్లు శుక్రవారం ఉదయం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ఈ విషయమై ఫోన్‌లో మాట్లాడారు.
అమెరికా దేశానికీ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ట్రంప్ ప్రాణాంతకంగా మారాడని సెనేట్ స్పీకర్ నాన్సీపెలోసీ ధ్వజమెత్తారు. ట్రంప్‌ను సత్వరం పదవి నుండి తొలగించాలని ఆమె కోరుతున్నారు. 25వ సవరణను ప్రయోగించాలంటున్నారు. సెనేట్‌లోని డెమొక్రాట్ నాయకుడు ఛుక్ స్కంబర్‌తో ఈ మేరకు ఆమె ఉమ్మడి ప్రకటన చేశారు. కాగా
నాటోలో అమెరికా రాయబారి కే బైలే హట్చిసన్, నాటో కూటమి భాగస్వాములకు ఒక బహిరంగ లేఖ రాస్తూ, మా అమెరికా క్యాపిటోల్ భవంతిపై దాడిచేసి బీభత్సకాండ సృష్టించినవారిని ఎట్టిపరిస్థితుల్లో సమర్థించేది లేదని పేర్కొన్నారు.
మాట మార్చి..రూటు మార్చి…!
దాడికి ట్రంప్ ఖండన!
సంప్రదాయబద్ధంగా అధికార బదిలీకి భరోసా
ప్రదర్శకులు ప్రజాస్వామాన్ని అపవిత్రం చేశారంటూ తాజా వీడియో
క్యాపిటోల్ భవనంపై సాయుధులు దాడికి దిగడాన్ని, అల్లర్లకు పాల్పడడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. ప్రదర్శకులు క్యాపిటోల్ భవంతిని, అమెరికా ప్రజాస్వామ్య స్థానాన్ని అపవిత్ర చేశారని ట్రంప్ అన్నారు. క్యాపిటోల్ భవంతికి రావాలంటూ ట్విట్టర్‌లో వీడియో పోస్టుచేసి రెచ్చగొట్టిన ట్రంప్ ఆ మరునాడే విడుదల చేసిన తాజా వీడియోలో మాట మార్చారు.
ఈ ఘటన జరిగిన వెంటనే నేషనల్ గార్డ్‌ను తాము రంగంలోకి దించామని ట్రంప్ సమర్థించుకున్నారు. 2020 నవంబరు 3న ఎన్నికల్లో దేశాధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్‌కు జనవరి 20వ తేదీన సజావుగా, సంప్రదాయబద్ధంగా అధికార బదిలీ ప్రక్రియ జరుగుతుందని తాను పూర్తి భరోసా ఇస్తూ, ప్రతిజ్ఞ చేస్తున్నానని అన్నారు. క్యాపిటోల్‌పై దాడి చేసినవారు అమెరికా దేశానికి ప్రతినిధులు కాదని ఆయన చెప్పుకొచ్చారు.
మాస్కులు లేని, ఆయుధాలు ధరించిన ట్రంప్ మద్దతుదార్లు అమెరికా చరిత్రలో ఎన్నడూ(1812 తర్వాత) లేనిరీతిలో క్యాపిటోల్ భవనంలోకి ప్రవేశించి అల్లర్లకు పాల్పడ్డారు. ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేసిన వీడియోలు చూసి మద్దతుదార్లు వీధుల్లోకి జొరబడ్డారు. ఈ ఘటనతో ఆ వీడియోను తొలగించి ఆయన ఖాతాను 12 గంటలపాటు స్తంభింపజేసి, ఆ తర్వాత పునరుద్ధరించింది ట్విట్టర్. అయితే ఫేస్ బుక్ మాత్రం మరో రెండు వారాల వరకూ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేది లేదని తెగేసి చెప్పింది. ఈ మేరకు మార్క్ జుకర్‌బెర్గ్ ఒక ప్రకటన చేశారు.
ట్రంప్ మెడకు ఉచ్చు!
RELATED ARTICLES