ఢిల్లీలో అయిస్సో, ప్రజాసంఘాల నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ అఖిల భారత శాంతి సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమాలు సోమవారంనాడు న్యూఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కార్మికులు, రైతులు, మహిళలు, యువజనులు, విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తూ వందలాదిమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. భారతప్రభుత్వం అమెరికా అధ్యక్షునికి ఏర్పాటు చేసిన అనవసరమైన స్వాగతాన్ని నాయకులు ఖండించారు. అమెరికా, భారత్‌లు ప్రత్యేక సంబంధంలో మునిగితేలుతున్నాయని, ట్రంప్ పర్యటన భారత్‌కు లాభదాయకంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకుగొనిపోతుందని ప్రధాని మోడీ చెబుతున్న మాటలు సత్యదూరమైనవని నాయకులు ఖండించారు. ట్రంప్ పర్యటనకు కొద్ది వారాలముందు, అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాలకిచ్చే ప్రత్యేకమైన, ప్రాధాన్యత ప్రతిపత్తి నుంచి భారత్‌ను తొలగించటాన్ని వారు గుర్తు చేశారు. ట్రంప్ పర్యటన అసలు ఉద్దేశం భారతదేశ మార్కెట్‌పై పట్టు సంపాదించటం, అమెరికా కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము పెడుతున్న షరతులన్నిటినీ అంగీకరించేటట్లు దేశాన్ని ఒత్తిడి చేయటమేనని వారు అన్నారు. రక్షణ ఉత్పత్తుల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసి వంటి ద్రవ్య సంస్థలు ప్రైవేటీకరణ వంటివి అటువంటి చర్యలకు తాజా ఉదాహరణలుగా వారు పేర్కొన్నారు. మైనారిటీలను, వలస ప్రజలను భూతాల్లా చిత్రిస్తూ ట్రంప్ ద్వేషపూరిత, మత వివక్ష రాజకీయాలు నడుపుతున్నారు. మరోవైపున కార్మికుల, పర్యావరణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా కార్పొరేషన్‌ల ఎజండాను ముందుకు తీసుకెళుతున్నారు. ఈ పర్యటన నుంచి భారత్‌కు జరిగే మేలు ఏమీలేకపోగా నష్టపోయేది ఎంతో ఉందని వక్తలు తెలిపారు. మరోవైపున, ట్రంప్ యుద్ధోన్మాద విదేశాంగ విధానం అనేక దేశాలకు పూడ్చలేని వినాశం తెచ్చిపెట్టిందని విమర్శిస్తూ, క్యూబా, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, సిరియా, వెనిజులా, బొలీవియా వంటి దేశాలను ఉదహరించారు. అందువల్ల దేశం నలుమూలలకు చెందిన ప్రజాస్వామిక, ప్రగతిశీల గ్రూపుల కలయిక ట్రంప్ పర్యటనను వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. అమెరికా నుండి దిగుమతులపై సుంకాల తగ్గింపుకై ఒత్తిడి తెస్తున్న ట్రంప్, భారతదేశం తన రక్షణ అవసరాలన్నిటినీ అమెరికా నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా ఒత్తిడి కిందనే మోడీ ప్రభుత్వం రక్షణ పరికరాల ఉత్పత్తిలో 100 శాతం ప్రైవేటు పెట్టుబడిని అనుమతించింది. రష్యానుంచి అత్యంత అధునాతన మిస్సిలీ డిఫెన్స్ వ్యవస్థ కొనాలని భారత్ తలపెట్టినప్పుడు ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత పర్యటనలో కూడా ట్రంప్ తమ దేశ ఆయుధాలను భారత్‌కు విక్రయించాలని, భారత్ అమెరికాపై ఆధారపడటాన్ని పెంపు చేయాలని చూస్తున్నారు. వర్ణ వివక్ష, మైనారిటీలపై దాడులు, జాతి, మత దురహంకారం ఆధారంగా మితవాద శక్తులు ప్రపంచవ్యాప్తంగా బలపడే క్రమంలో ట్రంప్ ముందుపీఠిన ఉన్నాడు. ఈ శక్తులు అనేక దేశాల్లో ఇజ్రాయిల్, బ్రిటన్, భారత్, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, టర్కీ వగైరా దేశాల్లో అధికారంలో ఉండి పరస్పర సంబంధాలు పటిష్టం చేసుకుటున్నాయి. ఈ శక్తులు తమతమ దేశాల్లో సమాజంలోని బలహీన వర్గాలపై దాడి చేస్తున్నాయని వక్తలు విమర్శించారు. ఈ సభలో ప్రసంగించిన వారిలో అయిస్సో ప్రధాన కార్యదర్శులు పల్లబ్‌సేన్ గుప్తా, ఆర్.అరుణ్‌కుమార్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు, ఇంకా సుచేతా డె(సిపిఐ ఆర్.కె.శర్మ (ఎస్‌యుసిఐ పుణ్యవతి (ఐద్వా), జెఎస్ మజుందార్(సిఐటియు), తిరుమలయన్(ఎఐవైఎఫ్), నరేంద్ర శర్మ (ఎఐఎఐఎఫ్), మయూక్ బిశ్వాస్ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రశాంత్ (అయిడ్సో), భీమ్ (కెవైఎస్), సంతోష్‌కుమార్ (ఎంఐసి), నరేంద్ర(ఐసిటియు) ఉన్నారు.
ట్రంప్ పర్యటన దేశానికి చేటు
RELATED ARTICLES