ప్రజాపక్షం/హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి తీవ్ర నిరనస వ్యక్తం చేసింది. బేగంపేటలోని అమెరికన్ కాన్సులెట్ భవనం వద్ద నిరసనకు తెలిపేందుకు వెళ్లిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్. బాలమల్లేశ్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ తదితరులను అరెస్టు చేశారు. వారిని వచ్చినట్లే పోలీసుల అరెస్టు చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు సిపిఐ నాయకులు అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం సమీపంలో డొనాల్డ్ ట్రంప్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసన కారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్య పద్దతుల్లో తాము నిరసన చేస్తున్నామని, కాన్సులేట్ జనరల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తామని కోరగా పోలీసులు వారిని వారించారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడే రోడ్డుపై బైటాయించి తమ నిరసనను తెలియజేశారు. “ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను విరమించుకుని వెనక్కి వెళ్లి పోవాలి.. గో బ్యాక్ గో బ్యాక్ డోనాల్డ్ ట్రంప్ గో బ్యాక్ ” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం వారిని అరెస్టు చేసి బోయిన్‌పల్లి, తిరుమలగిరి తదితర పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
అడుగడుగునా తనిఖీలు
అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద సిపిఐ అగ్ర నేతలు నిరసన తెలపనున్నారనే సమాచారంతో ఉదయం నుండే పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. అటు సికింద్రాబాద్ నుండి ఇటు సిఎం క్యాంపు కార్యాలయం ముందు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా వేటినీ వదల కుండా తనిఖీలు చేశారు. అంతటితో ఆగకుండా రసూల్ పుర మెట్రో రైల్ స్టేషన్‌మెట్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. మెట్రో దిగి వచ్చే ప్రతి ప్రయాణికుణ్ణి అనుమానంగానే చూశారు. సిపిఐ పార్టీ , అనుబంధ విభాగాల ప్రతినిధులు మెట్రో రైల్‌లో వస్తున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. నేతల వస్తే ఎక్కడికక్కడే అరెస్టు చేయాలంటూ పోలీసులు తమ వాకీ టాకీల్లో మాట్లాడుకోవడం కనిపించింది. అరెస్టు చేసేందుకు తెచ్చిన వాహనాలు ఒక వైపు, నేతలను వాహనాలపైకి ఎక్కించేందుకు తెల్ల డ్రెస్ వేసుకున్న పోలీసులు మరో వైపు రసూల్ పుర వద్ద కొద్ది సేపు ఏం జరగబోతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బేగంపేట అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు వస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలను మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళన చేసేందుకు అనుమతి లేదంటూ వారు వాహనాలను నిలిపేసి అరెస్టు చేశారు. ఇదే సమయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి. సుధాకర్ అమెరికన్‌కాన్సులేట్ సమీపంలోని ఒక హోటల్ వద్దకు చేరుకున్న తెలుసుకుని పోలీసులు హుటా హుటిన అక్కడికి వెళ్లడం కనిపించింది. ఇదే సమయంలో మరి కొందరు సిపిఐ కార్యకర్తలు ఆటోల్లో వచ్చి అక్కడ దిగి పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు, ఫోటో జర్నలిస్టులను పోలీసులు వారించారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతి లేదంటూ మీడియాను అక్కడి నుండి వెళ్లి పోవాలంటూ మౌక్‌లో చెప్పడం గమనార్హం. దీంతో ఫోటో జర్నలిస్టులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రసూల్ పుర మెట్రో స్టేషన్ పరిసరాల్లోనే నేతల కోసం నిరీక్షించారు.