జనసంద్రమైన మొతెరా స్టేడియం
ఇరువురు నేతల పరస్పర ప్రశంసల జల్లు
అహ్మదాబాద్: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అహ్మదాబాద్ ఘనస్వాగతం పలికింది. విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల పొడవునా గుజరాత్ ప్రభుత్వం భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం ట్రంప్‌ను ఆకట్టుకుంది. విమానాశ్రయంలో తన ‘మిత్రుడు’ ట్రంప్‌కు ఎర్రతివాచీ స్వాగతం పలికిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్రంప్ దంపతులకు మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రయ దర్శనం చేయించారు. మండుటెండలో వివిధ రంగాల ప్రముఖులతోపాటు లక్షమందికిపైగా ప్రజలతో కిక్కిరిసిన మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ, ట్రంప్‌ను పొగడ్తలతో ప్రస్తుతించగా, అందుకు బదులుగా ట్రంప్, ప్రధాని మోడీ ‘ప్రపంచ నాయకుడంటూ’ కొనియాడారు. అనంతరం ట్రంప్, ఆయన భార్య మెలానియా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ సందర్శించిన అనంతరం ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్‌లో విడిది చేశారు. ట్రంప్ వెంట వచ్చిన అధికారులు బృందంలో ఆయన ముఖ్య సలహాదారులైన కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్ ఉన్నారు.
ట్రంప్ రెండో రోజు (మంగళవారం) పర్యటనలో భాగంగా రేపు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ట్రంప్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం మోడీ, ట్రంప్ సమక్షంలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. పర్యటనలో చివరిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయిన తర్వాత ట్రంప్ రాత్రికి అమెరికాకు తిరుగుపయనం అవుతారు.
ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడుకుంటాం: ట్రంప్
రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించడానికి భారత్, అమెరికాలు కట్టుబడి ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఇరు దేశాలు రక్షణ సంబంధాలను గణనీయంగా విస్తరించుకోవాలని, అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదర్చుకోవాలని తీర్మానించుకున్నాయన్నారు. అమెరికా, భారత్‌ను ప్రేమించే, నమ్మకమైన మిత్రదేశమని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడి మొతెరా స్టేడియంలో భారీ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట పాలన, ప్రతి వ్యక్తికి గౌరవం, వివి ధ మతస్తులు సామరస్యంతో పక్కపక్కనే పూజించడం వంటి భారత గొప్ప సంప్రదాయం గురించి ఆయన మాట్లాడారు. అప్పుడు ఆయన వెంట ఆయన భార్య మెలానియా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. భారత్‌కు తొలి పర్యటనపై వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ ‘అమెరికా, భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంగా ఉండగలదు. దేశం కోసం రాత్రింబవళ్లు పనిచేసే అసాధారణ నాయకుడు ప్రధాని మోడీ’ అని ఆయ న చెప్పారు. ‘ఉగ్రవాదులు, వారి భావజాలంతో పోరాడేందుకు భారత్, అమెరాకాలు కట్టుబడి ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా భారత్‌కు నమ్మకమైన మిత్రదేశంగా ఉండనుంది’ అని ట్రంప్ తన కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్, అతని పరిపాలన ఉన్నతాధికారుల సమక్షంలో చెప్పారు. ‘భారత్‌లో అద్భుతమైన స్వాగతాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు‘ అని కూడా ఆయన చెప్పారు. ‘ఇరు దేశాలు మంగళవారం 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటాయని, అమెరికా…భారతదేశ ప్రధాన రక్షణ భాగస్వామి అవుతుంది’ అని ఆయన ప్రకటించారు. ‘భారత్, అమెరికాలు సహజమైన, శాశ్వతమైన స్నేహాన్ని కలిగి ఉన్నాయి’ అని ఆయన ప్రేక్షకుల ఆనందోత్సవాల మధ్య చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా పొత్తులను మేము త్వరతో పునరుద్ధరించబోతున్నాం’ అని ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు ‘అద్భుత వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయని, మోడీ ‘కఠినమైన సంధానకర్త’ (టఫ్ నెగోషియేటర్) అన్నారు.ఒక భారతీయుడు కష్టపడి ఏదైనా సాధించగలడనేందుకు సజీవ సాక్ష్యం…ఓ టీ అమ్ముకునే వ్యక్తి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధాని కావడమేనని మోడీ నేపథ్యాన్ని ఆయన వినయపూర్వకంగా ప్రస్తావించారు. మోడీ తన వంతుగా ట్రంప్‌ను స్వాగతిస్తూ ‘కొత్త చరిత్ర’ సృష్టించబోతున్నామన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ట్రంప్ పాత్రను కూడా మోడీ కొనియాడారు. భారత్ ఆర్థిక దిగ్గజంగా మారడమేకాక, సమస్త మానవాళికి ఆశాకిరణంగా మారిందన్నారు. ‘బలవంతంతో ఎదిగే దేశానికి, ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ఎదిగే దేశానికి మధ్య తేడా ఉంది. భారత్ ఈ రెండో కోవకు చెందిన దేశం. అమెరికా, భారత్ సహజమైన, శాశ్వతమైన స్నేహాన్ని కలిగి ఉన్నాయి’ అని చెప్పారు. ట్రంప్ భారత్ వైవిధ్యం గురించి ప్రస్తావిస్తూ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి క్రీడాకారుల గురించి మాట్లాడారు. తన అధ్యక్షతన అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిఢవిల్లిందన్నారు. ‘భారత్ రాబోయే పదేళ్లలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించి అతిపెద్ద మధ్యతరగతి దేశంగా విరాజిల్లబోతుంది’ అన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరో భాగస్వామ్యం మేరకే పరిమితం కాక, చాలా ఎత్తులను తాకినట్లు మోడీ పొగిడారు. ట్రంప్‌ను స్వాగతిస్తూ, రెండు దేశాల సంబంధాలు ‘కొత్త చరిత్ర’ సృష్టించబడుతోందని అన్నారు.అధ్యక్షుడు ట్రంప్ తన కుటుంబంతో కలిసి భారతదేశం సందర్శించడం… భారత్, అమెరికా మధ్య బలమైన సంబంధాలను చాటుతోందని కూడా మోడీ చెప్పారు.
ట్రంప్ సందర్శన భారత్, అమెరికా సంబంధాల్లో ‘కొత్త అధ్యాయం’ : మోడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సందర్శన, భారత్ సంబంధాల చరిత్రలో ఓ కొత్త అధ్యాయం అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్‌లో ఆయన ట్రంప్‌ను స్వాగతిస్తూ ‘ఇదేదో మరో భాగస్వామ్యం మాత్రమే కాదు. అంతకు మించి సన్నిహిత, గొప్ప సంబంధం’ అన్నారు. 21వ శతాబ్ది పోకడను భారత్, అమెరికా సహకార, సంబంధాలే నిర్దేశించనున్నాయన్నారు. ‘నా దృష్టిలో భారత్, అమెరికాలు సహజమైన మిత్రదేశాలు’ అని కూడా మోడీ చెప్పారు. దాంతో స్టేడియంలోని లక్షమంది ప్రేక్షకులు హర్షానందాలు వ్యక్తం చేశారు. అమెరికా, భారత్‌లో మధ్య సంబంధాలు బలపడ్డాయని మోడీ చెప్పారు. ఇప్పుడు వాణిజ్యంలో భారత్‌కు అమెరికా అతిపెద్ద భాగస్వామి అన్నారు. భారత సైన్యం, అమెరికాతో కలిసి అతిపెద్ద యుద్ధ విన్యాసం కూడా చేసిందన్నారు. ట్రంప్ భారత సందర్శన కొత్త దశాబ్దిలో పెద్ద అవకాశాలనే కల్పించగలదన్నారు. ఇరు దేశాలు షేర్ చేసుకునే విషయాలు అనేకం ఉన్నాయని కూడా మోడీ చెప్పారు. ఆరోగ్య రంగంలో ట్రంప్ పరిపాలన కృషిని మోడీ ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఉన్న పెద్ద బలం ఇరు దేశాల ప్రజల నమ్మకమన్నారు. ‘నమ్మకం చెక్కుచెదరని చోటే స్నేహం ఉంటుంది’ అని పాత నానుడిని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ‘మీరు ఆరోగ్యకరమైన అమెరికా కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం. సమాజంలో బాలల కోసం చేస్తున్నది హర్షనీయం’ అని మోడీ చెప్పారు. భారత్‌లోని 130 కోట్ల జనాభా ‘నవ భారత్’ను నిర్మిస్తున్నారని చెప్పారు. ‘మా యువత నిండు శక్తిసామర్థ్యాలతో ఉంది. లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది. సాధిస్తోంది’ అన్నారు. గరిష్ఠ సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపి భారత్ రికార్డును సాధించడమేకాదు, ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థ కలిగిన దేశం అని చెప్పారు.
ట్రంప్‌కు ‘నమో’స్తుతి
RELATED ARTICLES