గెలుపే లక్ష్యంగా భారత్
భారీ ఆశలతో కివీస్
నేటి నుంచి తొలి టెస్టు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే వన్డేల్లో భారత్‌పై క్లీన్‌స్వీప్ సాధించిన న్యూజిలాండ్ కూడా టెస్టు సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. సొంత గడ్డపై ఆడుతుండడం కివీస్‌కు అనుకూలించే అంశంగా చెప్పాలి. అయితే టెస్టు క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న టీమిండియాను ఓడించడం న్యూజిలాండ్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఏడు టెస్టుల్లోనూ టీమిండియా జయభేరి మోగించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక పోయింది. అంతేగాక భారత్‌తో పోల్చితే పాయింట్ల పట్టికలో చాలా వెనుకబడి ఉంది.
ఓపెనర్లే కీలకం..
ఈ సిరీస్‌లో భారత్‌కు ఓపెనర్లు సమస్య ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు. దీంతో సిరీస్‌లో యువ ఓపెనర్లపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్ల స్థానం కోసం పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లకే ఓపెనర్లుగా దించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ, ఇటీవల కాలంలో మయాంక్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. అంతేగాక ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించడం కాస్త ఊరట కలిగించే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మయాంక్ విజృంభిస్తే భారత్‌కు శుభారంభం ఖాయమని చెప్పాలి. మరో ఓపెనర్ పృథ్వీషా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. వన్డే సిరీస్‌లో షా కాస్త బాగానే ఆడాడు. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని భావిస్తున్నాడు.
పుజారా, రహానెలపై ఆశలు
ఇక, ఎప్పటిలాగే ఈసారి కూడా సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న పుజారా, రహానెలు రాణించడంపైనే టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుజారా మెరుగైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అయితే రహానె సాధన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రహానె తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం జట్టుకు ఎంతో ఉంది. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే కివీస్ పిచ్‌లపై రహానె, పుజారాలే జట్టుకు ప్రధాన అస్త్రాలుగా మారారు. వీరిద్దరూ రాణిస్తేనే భారత్ భారీ స్కోరు సాధించగలుగుతుంది. లేకుంటే జట్టు కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.
విరాట్ చెలరేగుతే..
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. కానీ, వన్డే సిరీస్‌లో విరాట్ విఫలమయ్యాడు. దీంతో జట్టుకు వరుస పరాజయాలు తప్పలేదు. కీలకమైన టెస్టు సిరీస్‌లో కోహ్లి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే కివీస్‌ను ఓడించడం ఖారత్‌కు నల్లేరుపై నడకే. అయితే కొంతకాలంగా ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్న కోహ్లి కలిసిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అతని బ్యాటింగ్‌పై పడుతోంది. రోహిత్, ధావన్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైన సమయంలో జట్టు బ్యాటింగ్‌ను మోయాల్సిన బాధ్యత కోహ్లిపైనే ఉంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిపై నెలకొంది. ఇందులో అతను ఎంతవరకు సఫలమవుతాడనే దానిపైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రిషభ్‌ను తప్సిస్తారా?
ఇక, ఈ సిరీస్‌లో రిషబ్‌పంత్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది సందేహమే. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమన్ సాహాపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ కూడా సాహా వైపే మొగ్గుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రిషబ్‌పంత్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. అంతేగాక తెలుగుతేజం హనుమ విహారికి కూడా తుది జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది తేలలేదు. వార్మప్ మ్యాచ్‌లో రవితేజ శతకంతో కదం తొక్కాడు. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌లతో పాటు పుజారా, రహానె, కోహ్లి, సాహాలకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజాలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక, బౌలింగ్‌లో మహ్మద్ షమి, బుమ్రా, ఉమేశ్‌లకు చోటు దాదాపు ఖరారైనట్టే. ఇక, విహారి, జడేజాల మధ్య ఎవరికీ తుది జట్టులో ఛాన్స్ లభిస్తుందో అందరిలోనూ ఆసక్తిగా మారింది. జడేజా కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించే సత్తా కలవాడే కావడంతో ఈసారి విహారికి ఛాన్స్ లేనట్టేనని చెప్పాలి.
విజయంపై విశ్వాసంతో..
వన్డే సిరీస్‌లో అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కెప్టెన్ విలియమ్సన్ రూపంలో ప్రధాన ఆయుధం ఉండనే ఉంది. ఓపెనర్ హెన్రీ నికోల్స్ కూడా ఫామ్‌లో కనిపిస్తున్నాడు. సౌథి, బౌల్ట్, వాగ్నర్, మ్యాట్ హెన్రీ, ఎజాజ్ పటేల్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో కివీస్‌ను ఏమాత్రం తక్కువ అంచన వేసినా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రిషబ్‌పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమి, ఉమేశ్, నవ్‌దీప్ సైని, ఇషాంత్ శర్మ.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టన్), హెన్రీ ని కోల్స్, రాస్ టైలర్, టామ్ లాథమ్, గ్రాండోమ్, డెరీ మిఛెల్, వాట్లింగ్, వాగ్నర్, ఎజాజ్ పటేల్, టామ్ బ్లుండెల్, జెమిసెన్, బౌల్ట్, సౌథి, మాట్ హెన్రీ.
టెస్టు సమరం
RELATED ARTICLES