HomeNewsBreaking Newsటెస్టు సమరం

టెస్టు సమరం

భారీ ఆశలతో బరిలోకి బంగ్లా
భీకర ఫాంలో భారత్‌
నేటి నుంచి తొలి టెస్టు
పుజారాపైనే అందరి చూపు
తుది జట్టులోకి సారధి కోహ్లీ
ఇండోర్‌ : భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ ముగిసింది. దీంతో ఇరు జట్లు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్న ఇరు జట్ల ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. బంగ్లాతో తొలి టెస్టు గురువారం ప్రారంభమవుతున్నా.. టీమిండియా ఆటగాళ్ల ఆలోచనంతా డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌పైనే ఉంది. కొత్త సవాల్‌కు సిద్ధమయ్యేందుకు సమయం తక్కువగా ఉండటంతో పూర్తిగా దృష్టంతా కోల్‌కతా టెస్టుపైనే పెట్టారు. పింక్‌ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలి.. ఫ్లడ్‌లైట్ల కింద సుదీర్ఘ ఫార్మాట్‌ ఎలా ఉంటుందనే ఉత్సుకతతోనే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. నెట్స్‌లో సైతం భారత జట్టులోని ఆటగాళ్లు పింక్‌ బాల్‌తోనే ప్రాక్టీస్‌ చేయడం విశేషం. డే/నైట్‌ టెస్టు మాట ఎలాగున్నా… సుదీర్ఘ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టీమిండియాపై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గలేదు. దీంతో ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కనీసం ఒక మ్యాచ్‌లోనే గెలవాలని ఊవిళ్లూరుతోంది.
భీకర ఫాంలో టీమిండియా..
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సైతం 240 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ అయితే ఇటీవల ఆడిన టెస్టులో తన కన్నా తక్కువ ర్యాంక్‌ ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓడిపోయింది. పైగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఆల్‌రౌండర్‌ షకీబ్‌ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సైతం లేకపోవడం జట్టుకు ఇబ్బందికర పరిస్థిని తీసుకొచ్చింది. అయినప్పటికీ టీ20 సిరీస్‌లో ఇండియాకు గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్‌ గెలిచిన బంగ్లా.. తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోను ఓడిపోయి, సిరీస్‌ను ఇండియాకు అప్పగించింది. ఒకరిద్దరు ఆడినా.. జట్టుగా ఆడడంలో బంగ్లా విఫలమౌతోంది. ఇండియా విషయానికొస్తే.. కెప్టెన్‌ కోహ్లినే జట్టుకు అదనపు బలం. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ, సహచరులకు స్ఫూర్తినిస్తుంటాడు. ఓపెనర్లు రోహిత్‌, మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన మొదటి సిరీస్‌లోనే రోహిత్‌ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. రెండు సెంచరీలు సహా, డబుల్‌ సెంచరీ సాయంతో సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మయాంక్‌ అయితే రెండు సెంచరీలు బాదాడు. టెస్టు స్పెషలిస్టు పుజారా ఉండనే ఉన్నాడు. వైస్‌ కెప్టెన్‌ రహానే సైతం కీలక సమయాల్లో రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్‌ కీపర్‌గా పంత్‌కు బదులు సాహా కొనసాగనున్నాడు. బౌలర్లలో షమీ, ఇషాంత్‌, ఉమేష్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌ రౌండర్లలో జడేజా లేదా అశ్విన్‌కు చోటు దక్కవచ్చు. మొత్తానికి జట్టుగా చూసుకుంటే, టీమిండియా చాలా బలంగా ఉంది. మరి భీకర ఫామ్‌లో ఉన్న ఇండియాను బంగ్లా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.. ! ఇండియాను సొంతగడ్డపై ఎదుర్కోవడం పెద్ద జట్ల వల్లే కాదు. ఇక బంగ్లా పరిస్థితేంటో చూడాలి.
పుజారా రాణిస్తే…
నయా వాల్‌ అని పిలిపించుకున్న క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతుండడం… టిం మేనేజ్‌ మెంట్‌ ను కలవరానికి గురి చేస్తోంది. అయితే పుజారా విఫలమవుతున్నా మిగతా బ్యాట్స్‌మెన్స్‌ రాణిస్తుండడంతో ప్రస్తుతానికి టింఇండియాకు ఏం ఇబ్బంది లేదు. వెస్టిండీస్‌ పర్యటనలో మొదలైన పుజారా విఫల యాత్ర నేటికి కొనసాగుతోంది. వెస్టిండిస్‌ తో జరిగిన టెస్టు సిరీస్‌ లో రెండు టెస్టుల్లో కలిసి 60 పరుగులే చేసిన ఈ నయావాల్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌ లో సైతం తడబడ్డాడు. చివరి 8 ఇన్నింగ్స్‌ లలో 2, 25, 6, 27, 6, 81, 58, 0 పరుగులు సాధించాడు. పుజారా లాంటి బ్యాట్స్‌ మెన్స్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌ ల ముందు టెస్టుల్లో తన చివరి శతకం బాదాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఏడాది సిడ్ని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో 193 పరుగులు చేశాడు.స్వదేశంలో పరుగుల వరద పారించి విదేశాల్లో విఫలమవడం చూశాం కానీ ఈ నయా వాల్‌ అందుకు భిన్నంగా ఉన్నాడు. విదేశాల్లో రాణిస్తున్న ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌ మెన్స్‌ స్వదేశంలో ఎందుకనో ఇబ్బంది పడుతున్నాడు. స్వదేశంలో సెంచరీ కొట్టీ రెండేళ్లు కావస్తోంది. 2017 నవంబరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ లో పుజారా(143) శతకం చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు స్వదేశంలో ఎనిమిది టెస్టులు ఆడగా చేసిన అత్యధిక పరుగులు 86(రాజ్‌ కోట్‌ లో వెస్టిండీస్‌) మాత్రమే. అర్థశతకాలను శతకాలుగా మలచడంలో విఫలమవుతున్నాడు. మరీ ఈ సిరీస్‌ లోనైనా పుజారా తన ఫామ్‌ ను అందుకుంటాడో లేదో చూడాలి.
ముగ్గురు పేసర్లతో బరిలోకి..
ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్‌ కోహ్లీ మాట్లాడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సీమర్లు ఉన్న జట్టు తమదేనని ఈ మ్యాచ్‌ లో ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కోహ్లీ వెల్లడించాడు. ’మీరు నన్ను అడిగితే ఒకటే చెబుతాను. ఈ చాంపియన్‌షిప్‌లో మేమే టాప్‌ స్థానంలో ఉన్నాం. కెప్టెన్‌గా ఇన్నింగ్స్‌ మొదలైనప్పటి నుంచి మన ఫేసర్లు ప్రపంచ క్రికెట్‌ ను శాసించాలనే అనుకున్నా. బ్యాటింగ్‌, స్పిన్‌ అంశాలు ఎప్పుడూ సమస్య కాలేదు. స్టార్‌ క్రికెటర్లంతా వెళ్లిపోయారు. టెస్టు క్రికెట్లో 20వికెట్లు ఎలా పడగొట్టాలని తలెత్తిన ప్రశ్నకు సమాధానమే ఫేస్‌ బౌలింగ్‌’ ’ఎలాంటి పిచ్‌ అయినా, ప్రత్యర్థి జట్టు ఏదైనా ఊహించినదాని కంటే ఎక్కువగానే సాధించాం. ఇప్పటికీ మన ఫేసర్ల ఆకలి తీరలేదు. జట్టుగా పోరాడటానికి ఇష్టపడుతున్నారు. వాళ్లే మన ప్రధాన బలం. పిచ్‌ స్వభావం చూస్తుంటే ఫేస్‌ బౌలింగ్‌ ప్రధాన ఎంపికగా అనిపిస్తుంది. బుమ్రా ఫిట్‌ గా లేకపోవడంతో షమీ, ఉమేశ్‌, ఇషాంత్‌ తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి’ అని కోహ్లీ తెలిపాడు.
బంగ్లాదేశ్‌పై ఐదు మ్యాచ్‌ల్లోనూ..
ఐదు – టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో గెలిస్తే, టెస్టు క్రికెట్‌ చరిత్రలో తమ సుదీర్ఘ విజయ పరంపరను 2013లో వరుసగా ఐదు టెస్టు విజయాలను అధిగమిస్తుంది. భారత్‌-xబంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఇప్పటివరకు తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా ఏడు టెస్టుల్లో విజయం సాధించగా… వర్షం కారణంగా రెండు డ్రాగా ముగిశాయి. ఇందులో భారత గడ్డపై ఈ రెండు జట్లు గతంలో ఒకేసారి టెస్టు మ్యాచ్‌ను ఆడాయి. 2017లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఆడిన ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత్‌ ఇక్కడ ఆడిన ఐదు వన్డేలు, 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌, 2017లో శ్రీలంకతో జరిగిన ట 20 మ్యాచ్‌లో విజయం సాధించింది. భారత్‌పై 50కిపైగా యావరేజిని కలిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లుగా ముష్ఫికర్‌ రహీమ్‌(56.16), మహ్మదుల్లా(55.4)లు ఉన్నారు. భారత్‌పై ముష్ఫికర్‌ రహీమ్‌ 337 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. భారత్‌తో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో మహ్మదుల్లా 277 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
వికెట్‌ దూరంలో అశ్విన్‌..
స్వదేశంలో 41 టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇప్పటివరకు పడగొట్టిన వికెట్ల సంఖ్య. మరో వికెట్‌ తీస్తే సొంతగడ్డపై 250 వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా మరో వికెట్‌ తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 250 వికెట్లు మైలురాయిని అందుకుంటాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు బాదిన సిక్సుల సంఖ్య. మరో రెండు సిక్సులు బాదితే 400 సిక్సుల క్లబ్‌లో చేరిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సృష్టిస్తాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌(534) అగ్రస్థానంలో ఉండగా… షాహిద్‌ అఫ్రిది(476) సిక్సులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ బ్రెండన్‌ మెక్క్‌ల్లమ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు కోహ్లీని కూడా మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. 4968లతో ఉన్న – విరాట్‌ కోహ్లీ మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో 5000 పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా 6వ క్రికెటర్‌ కావడం విశేషం. అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సృష్టిస్తాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 15000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి పుజారాకు కావాల్సిన పరుగులు 66. పుజారా ఇప్పటివరకు 192 మ్యాచ్‌ల్లో 14934 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments