HomeNewsBreaking News‘టెట్‌' నోటిఫికేషన్‌ విడుదల

‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల

ప్రజాపక్షం /హైదరాబాద్‌ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ముందస్తు అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ర్ట ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు టెట్‌ రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టెట్‌ పరీక్షను జూన్‌ 12వ తేదీన నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్‌ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 నుండి పదవ తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు ఒకటి నుండి ఐదవ తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా కూడా నియమితులు అయ్యే అవకాశం కల్పించారు. దీంతో వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. వారు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు. అలాగే గతంలో టెట్‌ ధృవపత్రం ఏడేళ్ళ పాటు చెల్లుబాటు అయ్యేది. దానిని ఇప్పుడు తొలిగించారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధృవపత్రం ఇప్పుడు కూడా చెల్లుబాటవుతుంది. రాష్ర్టంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
జూన్‌ 30న పాలిసెట్‌ పరీక్ష
ప్రజాపక్షం /హైదరాబాద్‌ : పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌కు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ర్ట సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వంద రూపాయల ఆలస్య రుసుముతో జూన్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పాలిటెక్నిక్‌, వ్యవసాయ, పశుసంవర్ధక, హార్టికల్చర్‌ యూనివర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ సీట్లను కూడా పాలిసెట్‌ మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారని శ్రీనాథ్‌ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments