స్కూల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు
18 మంది పిల్లలు సహా 21 మంది మృతి
ఉవాల్డే (టెక్సస్/ అమెరికా) : అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నది. ఇటీవల చోటు చేసుంటున్న వరుస ఘటనలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఓ దుండగుడు స్కూల్లో కాల్పులకు తెగబడ్డాడు. అతను విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో మొత్తం 21 మంది మృతి చెందారు. వీరిలో 18 మంది విద్యార్థులు. అధికారులు విడుదల చేసిన ప్రకటనను అనుసరించి, స్థానిక రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడిన 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ అక్కడ ఉన్న విద్యార్థులపై కాల్పు లు ప్రారంభించాడు. పాఠశాలలో విద్యార్థులంతా నాలుగు నుంచి 14 సంవత్సరాల వయసుగల వారు కావడంతో అతనిని ప్రతిఘటించే సాహసం చేయలేకపోయారు. ఆ సమయంలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నట్టు సమాచా రం. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కూడా మృతి చెం దారు. పలువురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకుడు కూడా మృతి చెందాడు. తుపాకీతో స్కూల్‌కు బయలుదేరే ముందు అతను తన తల్లిని కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. అతను ఈ దురాగతానికి ఎందుకు పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదు. కాల్పుల ఘటన వెంటనే స్కూల్‌ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనపై టెక్సస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సమాచారాన్ని దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు అందచేశారు. కాగా, అమెరికాలోనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటూ బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఓ టీనేజర్ కాల్పులకు పాల్పడడం తనను కలిచివేస్తున్నదని అన్నారు. ఈనెల 28వ తేదీ, శనివారం వరకూ సంతాప దినాలుగా ప్రకటించారు. 2018 ఫిబ్రవరిలో ఫ్లొరిడాలోని పార్క్‌లాండ్ స్కూల్‌పై దాడికి దిగిన 20 ఏళ్ల యువకుడు కాల్పులకు దిగడంతో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. ఆ తర్వాత అంతటి ఘోరమైన ఘటనగా తాజా కాల్పులను అధికారులు పేర్కొంటున్నారు.
టెక్సస్‌లో… తుపాకీ మోత
RELATED ARTICLES