న్యూఢిల్లీ : టీవీ బిల్లులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేబుల్ టీవీ, డిటిహెచ్‌ల ఛార్జీలు తగ్గించేందుకు నిబంధనలను సవరించే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన టారీఫ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కేబుల్ టీవీ, డిటిహెచ్ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ ’ట్రాయ్’ శుభవార్త తెలిపింది. టీవీ ఛానెళ్ల వీక్షణలో ఛార్జీల మోతపై పునరాలోచించనున్నట్లు ప్రకటించింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేబుల్ టీవీ, డిటిహెచ్‌లకు సంబంధించి కొత్త నిబంధనలు ట్రాయ్ తీసుకువచ్చిన విషయం తెల్సిందే. వీటి కారణంగా గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేబుల్ టీవీ, డిటిహెచ్‌ల నెలవారీ చందాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై చాలా మంది ధరలు తగ్గించాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ట్రాయ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. కేబుల్ టీవీ రంగంలో పారదర్శకతే ప్రాథమిక లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ముఖ్యంగా కొత్త నిబంధనలతో నిర్దిష్ట ఎన్‌సిఎఫ్ ఛార్జీలను ట్రాయ్ అమలు చేస్తోంది. ఫలితంగా ప్రతీ వినియోగదారు ఏదైనా పే ఛానల్ చూడాలన్నా రూ.153 ఎన్‌సిఎఫ్ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాలి. ఇంతకుముందు ఇలాంటి నిబంధన లేదు. ఛార్జీలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమైంది. టీవీలు వీడి.. ఒటిటిల వైపు అధిక ఛార్జీల కారణంగా చాలా మంది వినియోగదారులు లైవ్ టీవీ ప్రసారాలు సన్‌నెక్ట్, జి5, హాట్ స్టార్, జియో టీవీ వంటి ఒటిటి ప్లాట్ ఫారాలపై చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులకు ఈ యాప్‌లు సౌలభ్యంగా ఉండటం వల్ల వాటి వినియోగం పెరిగి… డిటిహెచ్, కేబుల్ టీవీల వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ ధరలు నియంత్రించి కేబుట్ టీవీ, డిటిహెచ్‌ల వినియోగం పెంచే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. ట్రాయ్ ప్రకటనతో ఎలాంటి సవరణలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రధానంగా లాంగ్ టర్మ్ ప్లాన్‌లు, మల్టీ టీవీలపై ‘ఎన్‌సిఎఫ్’ ఛార్జీలు తగ్గించే అవకాశముందని వార్తా సంస్థలు అంటున్నాయి. అనవసర ఛానెళ్లు అందించి డిటిహెచ్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ భావిస్తోందనే అంచనాలున్నాయి. అయితే ఈ మార్పులపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియరాలేదు.
టీవీ బిల్లులు తగ్గనున్నాయ్!
RELATED ARTICLES