బాట్లెత్తేసిన బ్యాట్స్‌మెన్లు
తొలి ఇన్నింగ్స్ 242/ఆలౌట్
తేలిపోయిన బౌలర్లు
న్యూజిలాండ్ 63/0
తొలి రోజు కివీస్‌దే ఆధిపత్యం
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో భారత్ సమష్టిగా విఫలమైంది. వేదిక మారినా.. టీమిండియా ఆట మాత్రం మారలేదు. అదే కథ.. అదే వ్యధ అన్నట్లు కోహ్లీసేన ఆట కొనసాగింది. ప్రత్యర్థి యువ బౌలర్ కైలీ జెమీసన్ 5 వికెట్లతో చెలరేగడంతో టెస్ట్ నెంబర్ వన్ జట్టైన భారత్ బ్యాటింగ్ 63 ఓవరల్లో 242 పరుగులకే ముగిసింది. యువ ఓపెనర్ పృథ్వీషా(54), చతేశ్వర్ పుజారా(54), హనుమ విహారీ (55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందుకుంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలా్‌ండ. ఓపెనర్లు టామ్ లాథమ్ (27 బ్యాటింగ్), టామ్ బండెల్(29 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి 14.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. స్వింగ్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్ధి పేసర్లు చెలరేగగా.. భారత బౌలర్లు మాత్రం శుభారంభాన్నివ్వలేకపోయారు. పచ్చిక పిచ్‌లపై టాస్ చాలా కీలకం. కానీ భారత్ వరుసగా రెండో సారి టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు బ్యాట్స్‌మన్‌ను ముప్పు తిప్పలు పెట్టి ఫలితాన్ని రాబట్టారు.
కోహ్లీ మళ్లీ విఫలం..
ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ( 11 బంతుల్లో ఫోర్ 7)ను బౌల్ట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో భారత్ 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (54)తో కలిసి పృథ్వీ షా (54) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫోర్లు, సిక్సర్లతో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 47 పరుగులు వద్ద ఉన్నప్పుడు వాగ్నెర్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్ మీదుగా సిక్సర్ బాది 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. కానీ అదే జోరులో జేమీసన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్లిప్‌లో ఉన్న లేథమ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 85/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ విరామం అనంతరం టీమ్ సౌథీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కోహ్లీ మరోసారి విఫలమవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 3, 19, 2, 9, 15 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రహానే(7) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. సౌథీ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న విహారీ.. పుజారా
కష్టాల్లో ఉన్న భారత్‌ను విహారీ, పుజారా 81 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. ఓపికగా ఆడుతూ.. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో పుజారా 117 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 25 హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా.. విహారీ వన్డే తరహాలో ధాటిగా ఆడాడు. 67 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే ఇదే జోరును కొనసాగించలేకపోయిన విహారీ.. వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 194/5తో టీ బ్రేక్‌కు వెళ్లింది. టీ విరామం అనంతరం యువ పేసర్ జెమీసన్ చెలరేగాడు. షార్ట్ పిచ్ బంతులతో భారత బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. పుజారాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన జెమీసన్.. తర్వాత పంత్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్(0), జడేజా(9) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అతని దెబ్బకు భారత్ 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివర్లో షమీ(16), బుమ్రా(10) ధాటిగా ఆడటంతో భారత్ 242 పరుగులు చేయగలిగింది.
షా షో రికార్డు..
రెండో టెస్టు మ్యాచ్‌లో అర్థ సెంచరీ పూర్తి చేసిన పృథ్వీ షా మంచి ఊపుమీద ఉన్నట్లు కనిపించాడు. అయితే లంచ్ బ్రేక్ కంటే ముందు కైల్ జేమిసన్ వేసిన వైడ్ బాల్‌ను ఆడబోయి వికెట్ల వెనకాల ఉన్న కీపర్ టామ్ లాథమ్‌కు చిక్కాడు. దీంతో పృథ్వీ షా పెవీలియన్‌కు చేరాడు. అర్థసెంచరీ చేసిన పృథ్వీషాను కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. అయితే పృథ్వీ షా ఈ ఇన్నింగ్స్‌లో ఓ రికార్డు క్రియేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత న్యూజిలాండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అర్థశతకం పూర్తి చేసిన అతి పిన్న వయస్సు కలిగిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, అత్యంత పిన్న వయస్సులో న్యూజిలాండ్‌లో టెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వారిలో 1990లో సచిన్ టెండూల్కర్ : 16 ఏళ్లు 291 రోజులు మొదటి స్థానంలో ఉండగా.. 2020లో పృథ్వీ షా : 20 ఏళ్లు 112 రోజులు రెండో స్థానంలో ఉన్నాడు. 1990లో అతుల్ వాసన్ : 21 ఏళ్లు 336 రోజులు మూడు, 1976లో బ్రిజేష్ పటేల్ : 23 ఏళ్లు 81 రోజులు, 1981లో సందీప్ పాటిల్ : 24 ఏళ్లు 187 రోజులు నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు.
టీమిండియా ఫ్లాప్ షో
RELATED ARTICLES