చెలరేగిన రోహిత్ శర్మ, కోహ్లి.. రాణించిన దినేశ్‌కార్తీక్
ఏడు వికెట్లతో కివీస్‌పై భారత్ విజయం
0-3తో సిరీస్ కైవసం
రాస్‌టేలర్ శ్రమ వృథా
మౌంట్ మాంగనుయ్: భారత క్రికెట్ జట్టు మరోసారి తన సత్తా చూపింది. న్యూజిలాండ్‌తో సోమవారంనాడు జరిగిన మూడో వన్డేలోనూ అద్భుతమైన విజయం సాధించి, విదేశీ గడ్డపై సరికొత్త రికార్డులకు మార్గం సుగమం చేసింది. ఈ విజయంతో చాన్నాళ్ల తర్వాత కివీస్ గడ్డపై సిరీస్ విజయాన్ని సాధించింది. భారత్‌కు ఇక్కడ కేవలం ఇది రెండో సిరీస్ విజయం మాత్రమే. కోహ్లీసేనకు తిరుగులేదని నిరూపించింది. న్యూజిలాండ్‌లో వరుసగా మూడో వన్డే గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ముందు బౌలర్లు.. తర్వాత బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించారు. నిలకడతో అదరగొట్టారు. దెబ్బకు కివీస్ చేసేదేమీ లేక డీలా పడిపోయింది. ఒకప్పుడు ఆసీస్, కివీస్ పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడాలంటే టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు పేస్. మరోవైపు మణికట్టు మాయ. భీకరమైన టాప్, మిడిలార్డర్. అందుకే భారత్ వరుసగా రెండో వన్డే సిరీస్‌ను గెలిచింది. స్మిత్, వార్నర్ లేని ఆసీస్పు సునాయాసంగా గెలిచిందన్న మాటలకు ఘాటు సమాధానం చెప్పింది కోహ్లీసేన. నిలకడకు పేరైన పటిష్ఠ న్యూజిలాండ్ జట్టుపై జైత్రయాత్ర కొనసాగించింది. ఇక విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. 63 వన్డేలకు సారథ్యం వహించగా 47 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. క్లైవ్లాయిడ్, రికీ పాంటింగ్ 50 వన్డే విజయాల రికార్డుకు చేరువలో నిలిచాడు. షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం సిరీస్‌ను కైవసం చేసుకున్న భారతజట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. అయితే వాటి ఫలితాలతో పనిలేకుండా భారత్ సిరీస్‌ను గెల్చుకుంది.
ఉతికేసిన భారత బ్యాట్స్‌మన్లు
భారత బ్యాట్స్‌మన్లు అద్భుతంగా రాణించారు. పూర్తిస్థాయిలో నిలకడగా రాణించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు శుభారంభమే లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (28; 27 బంతుల్లో 6×4), రోహిత్ శర్మ (62; 77 బంతుల్లో 3×4, 2×6) పోటీ పడి ఆడారు. కాగా, జట్టు స్కోరు 39 వద్ద గబ్బర్ను బౌల్ట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (60; 74 బంతుల్లో 6×4) మరోసారి తన అందమైన ఆటను ప్రదర్శించాడు. సమయోచిత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూనే సొగసైన కవర్ డ్రైవ్‌లు ఆడాడు. అతడికి తోడుగా రోహిత్ శర్మ అప్పుడప్పుడు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రోహిత్‌శర్మను ఔట్ చేయడం ద్వారా శాంట్నర్ విడదీశాడు. అప్పుడు స్కోరు 152. మరికాసేపటికే కోహ్లీని బౌల్ట్ పెవిలియన్ పంపించాడు. అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో భారత్ విజయం సాధించేందుకు కష్టపడలేదు. అంబటి రాయుడు (40; 42 బంతుల్లో 5×4, 1×6), దినేశ్ కార్తీక్ (38; 38 బంతుల్లో 5×4, 1×6) పోటీపడి ఆడారు. నువ్వానేనా అన్నట్టు బౌండరీలు బాదేశారు. నాలుగో వికెట్కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దీంతో కోహ్లీసేన 43 ఓవర్లకే ఛేదన పూర్తిచేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నిప్పులు చెరిగిన షమీ
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. నిజానికి కివీస్ మొదట్నించీ తడబడుతూనే ఆడింది. మార్టిన్ గప్తిల్ (13), కొలిన్ మన్రో (7), కేన్ విలియమ్సన్ (28) జట్టు స్కోరు 59 లోపే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో టామ్ లేథమ్ (51; 64 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (93; 106 బంతుల్లో 9×4) చెలరేగాడు. శతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 119 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆచితూచి ఆడుతోనూ చూడచక్కని షాట్లతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లేథమ్‌ను ఔట్ చేయడం ద్వారా చాహల్ విడదీశాడు. అప్పుడు జట్టు స్కోరు 178. ఒక వైపు వికెట్లు పడుతున్న ప్రతిఘటించాడు. 222 పరుగుల వద్ద షమి అతడిని పెవిలియన్ పంపించాడు. కివీస్ 243 పరుగులకు ఆలౌటైంది. షమి 3, భువి, చాహల్, పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ధోనీ దూరం!
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆడలేదు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ వచ్చాడు. రెండు వన్డేలు ఆడిన మహీ మూడో వన్డే మాత్రం ఆడలేదు. ఎందుకంటరా? ప్రస్తుతం అతడు తొడ కండరాలు పట్టేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అందుకే అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ కీపింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. వెస్టిండీస్‌లో 2013లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ధోనీ గాయంతో మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత ఇప్పుడే ఆరేళ్ల తర్వాత గాయంతో మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. మంచి ఫిట్‌నెస్‌తో ఉండే మహీ 14 ఏళ్లలో కేవలం 5 మ్యాచులకు మాత్రమే గైర్హాజరు అయ్యాడు. తొడకండరాల గాయంతో 2013లో మూడు వన్డేలు, వైరల్ జ్వరంతో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో ఒక్కో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇది ఘోర పరాజయమే :
టీమిండియా చేతిలో 3-0తో ఓటమి బాధాకరమని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్టేలర్ అన్నాడు. పటిష్ఠంగా ఉన్న కోహ్లీసేన స్థాయికి తగినట్టు తాము ఆడటం లేదని అంగీకరించాడు. ‘3-0తో ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. భారత జట్టును ప్రశంసించాల్సిందే. మూడు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడారు. మాకన్నా ఎంతో మీద ఉన్నారు. మాపై ఒత్తిడి పెంచి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. మేం ఆధిపత్యం వహించే స్థితిలో పట్టు కోల్పోయాం. మేమెంతో పోరాడాం కానీ ఫలితం లేదు’ అని టేలర్ అన్నాడు. ‘మరో రెండు మ్యాచులున్నాయి. సిరీస్ ఇప్పటికే చేజారినా పరువు నిలుపుకొనేందుకు అవకాశం ఉంది. హామిల్టన్ మాకు అచ్చొచ్చింది. మేం తిరిగి లయ అందుకుంటామని నమ్మకముంది. అన్ని విభాగాల్లోనూ మేం రాణించాల్సి ఉంది. విరాట్ అద్భుతమైన నాయకుడు. హార్దిక్ పాండ్య భారత జట్టుకు సమతూకం తెస్తున్నాడు. కుల్దీప్, చాహల్ను ఎదుర్కోవాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే’ అని టేలర్ వెల్లడించాడు.
టీమిండియా తీన్‌మార్
RELATED ARTICLES