అన్ని విభాగాల్లో సమతూకంగా కోహ్లీసేన
కరేబియన్ జట్టుకు అగ్ని పరీక్ష తప్పదు
ప్రజాపక్షం/క్రీడా విభాగం: సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగే టి20, వన్డే సిరీస్‌లో ఆతిథ్య టీమిండియాకే గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడూ పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించినా ప్రస్తుతం ఆ జట్టులో ఆ జోష్ కనిపించడం లేదు. అంతేగాక ఇటీవలే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో విండీస్ క్లీన్‌స్వీప్‌కు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత గడ్డపై జరిగే సిరీస్ విండీస్‌కు సవాలుగా తయారైంది. ఇక, కొంత కాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఈ సిరీస్‌లో కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్‌కు ఎదురు లేకుండా పోయింది. దీపక్ చాహర్ రూపంలో భారత్‌కు మరో పదునైన అస్త్రం లభించింది. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి చేరికతో జట్టు మరింత బలోపేతంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. విండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే, టి20 సిరీస్‌లో భారత్ ఏకపక్ష విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. గతంలో విండీస్‌తో సిరీస్‌లు అంటేనే ఇతర జట్లు ముందే చేతులెత్తేసివి. అలాంటి విండీస్ జట్టు ప్రస్తుతం చిన్న జట్లను సయితం ఓడించలేక పోతోంది. చివరి ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించలేని దుస్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్ వంటి జట్టును ఓడించడం అతి పెద్ద సవాలుగా పరిణమించింది. ఈ సిరీస్ కరీబియన్ జట్టుకు అగ్ని పరీక్షగా మారింది. ఇక, టీమిండియా మాత్రం గెలుపే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరు కూడా మూడు ఫార్మాట్‌లలో పరుగుల వరద పారిస్తున్నారు. విండీస్ సిరీస్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరూ చెలరేగితే భారత్‌కు ఎదురే ఉండదు. ఇక, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్ సవాలుగా తయారైంది. కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పంత్‌కు సంజు శాంసన్ రూపంలో గట్టి పోటీ నెలకొంది. ఈసారి విఫలమైతే మాత్రం పంత్‌కు జట్టులో స్థానం కాపాడు కోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో మెరుగ్గా ఆడాల్సిన ఒత్తిడి అతనిపై ఎంతైన ఉంది. ఇక, మనీష్ పాండే, లోకేశ్ రాహుల్, కేదార్ జాదవ్ తదితరులకు కూడా సిరీస్ కీలకంగా మారింది. జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. కాగా, బౌలింగ్‌లో మాత్రం భారత్‌కు సమస్య లేదనే చెప్పాలి. ప్రతి బౌలర్ కూడా అంది వచ్చిన అవకావాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టి సిరీస్‌లో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, చాహల్‌లు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నారు. అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న టీమిండియా తన ఖాతాలో మరో రెండు సిరీస్‌లు జమ చేసుకోవడం ఖాయమనే చెప్పాలి.
టీమిండియా జోరు
RELATED ARTICLES