మిడిలార్డర్‌లో కోహ్లీ లేకపోవడం కష్టమే
బంగ్లాకు కలిసి రానున్న సమస్య
న్యూ ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో భారత టీ20 జట్టు మిడిల్ ఆర్డర్‌లో అనుభవలేమి కనబడుతోందని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశమని కూడా లక్ష్మణ్ అన్నాడు. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘టీమిండియాను సొంతగడ్డపై ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశం. బంగ్లాదేశ్ బ్యాటింగ్ బలంగా ఉంది‘ అని చెప్పాడు. ‘బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో రాణిస్తే భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. బంగ్లాదేశ్‌కు బలహీనం ఏదైనా ఉందంటే అది బౌలింగ్‌లోనే. బంగ్లా బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే స్పిన్ విభాగంలో ఆ జట్టు బలంగా లేదు కాబట్టి… ముస్తాఫిజుర్ కొత్త బంతితో ఆరంభంలో వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది‘ అని లక్ష్మణ్ అన్నాడు. ‘భారత జట్టులో విరాట్ కోహ్లీ లేడు. దీంతో మిడిల్ ఆర్డర్‌లో భారత్ జట్టు అనుభవ లేమి కనబడుతోంది. ఇక భారత్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలి. వాషింగ్టన్ సుందర్, చహల్‌లు భారత బౌలింగ్ యూనిట్‌లో కీలకం కానున్నారు. టీ20 సిరీస్‌కు సన్నద్ధమైన వేదికలు స్పిన్‌కు ఎక్కువ అనుకూలించే అవకాశాలున్నాయి‘ అని లక్ష్మణ్ తెలిపాడు.
అనుభవ లేమితో కుర్రాళ్లు..
‘ప్రస్తుతం బౌలింగ్ లైనప్‌లో చాలా అనుభవరాహిత్యం ఉంది కాబట్టి యుజువేంద్ర చాహల్ మూడు మ్యాచ్‌లు ఆడతారని ఆశిస్తున్నాను. కృనాల్ పాండ్యా వంటి యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం. భారత్ 2-1 తేడాతో గెలుస్తుందనే అనుకుంటున్నా‘ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. ‘భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు తప్పిస్తే మిగతా వారంతా దాదాపు యువ క్రికెటర్లే. సిరీస్ గెలవడానికి నేను భారత బ్యాటింగ్ పవర్‌కే మద్దతు ఇస్తున్నాను‘ అని లక్ష్మణ్ అన్నాడు. ఈ సిరీస్‌లో పలువురు సీనియర్ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు.
ముక్కులకు మాస్క్‌లు ధరించి..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అసలు, ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్న సమయంలో గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం డిల్లీలో వాయు కాలుష్య స్థాయి మరింత పెరిగి గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. అయితే మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో కాలుష్య స్థాయి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ముఖానికి మాస్క్‌లు ధరించి.. ప్లేయర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకు ఎటువంటి మ్యాచ్‌లను నిర్వహించరాదని టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాలుష్య నియంత్రణకు ఆ రాష్ట్ర సిఎం కేజ్రీవాల్ ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తొలి టీ20 వేదికను చివరి దశలో మార్చాలని చూశారు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గంగూలీ వివరణతో ఢిల్లీ టీ20 మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.