HomeNewsBreaking Newsటియులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌తనిఖీలు

టియులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌తనిఖీలు

హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న అధికారులు
నిజామాబాద్‌ :
తెలంగాణ యూనివర్సిటీలో (టియు) విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు కార్లలో సుమారు పది మంది అధికారులు యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీ పరిపాలన భవనంతో పాటు అకౌంట్‌ సెక్షన్‌ కార్యాలయం, ఖజానా విభాగం, ఆరట్స్‌ కాలేజ్‌ భవనంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పరిపాలన భవనంలో కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిబ్బందిని విచారించారు. యూనివర్సిటీకి చెందిన పలు ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆ యూనివర్సిటీ రిజిస్టర్‌ కనకయ్యను తొలగించడం.. మరో రిజిస్టర్‌ను నియమించడంతో యూనివర్సిటీలో గందర గోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత
వచ్చింది. విద్యార్థులు నిరసనలు తెలిపారు. పరిపాలన భవనంలోని విసి ఛాంబర్‌లో బైఠాయించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రిలకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం టియులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏక కాలంలో దాడులు కొనసాగించడం యూనివర్సిటీ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇది ఇలా ఉండగా.. దాడులు జరిగే కొద్ది క్షణాల్లోనే విసి, రిజిస్ట్రార్‌ పరిపాలన భవనం నుంచి వెళ్లిపోవడం సర్వత్ర ఆసక్తిగా మారింది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని ఉన్న ఈ యూనివర్సిటీ చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి. రిజిస్ట్రార్‌ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు మరింత దిగజారుతోంది. విసిగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు తీసుకుని నిండా రెండేళ్లు కూడా పూర్తి కాకముందే.. ఇప్పటికే తొమ్మిది సార్లు రిజిస్ట్రార్‌లు మారారు. రిజిస్ట్రార్‌ మొదలు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల వరకూ ప్రతి అంశం వివాదాస్పదమవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments