తప్పుడు అంకెలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట సమస్యల పరిష్కార పోరాట సమితి ఆందోళన
ప్రజాపక్షం / హైదరాబాద్/కరీంనగర్ ప్రతినిధి ఇటీవల నిర్వహించిన దేహదారుఢ్య అర్హత పరీక్షలలో అర్హత సాధించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టిఎస్‌ఎల్ పిఆర్‌బి) తప్పుడు అంకెలు ఇవ్వడంపై ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి తీవ్రంగా మండిపడింది. దీనిని నిరసిస్తూ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో సమితి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ వలీ ఉల్లా ఖాద్రీ, నిర్లకంటి శ్రీకాంత్, మహమూద్(ఎఐవైఎఫ్) కోట రమేశ్, అనగంటి వెంకటేష్, జావీద్ (డివైఎఫ్‌ఐ), గ్యార నరేష్, రెహమాన్, లక్ష్మణ్, ఉదయ్ (ఎఐఎస్‌ఎఫ్) తదితరులు పాల్గొన్నారు. గతంలో 87 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పిన బోర్డు, నేడు కేవలం 53.7 శాతం మంది మాత్రమే అర్హత పొందారని చెప్పడం దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఎస్‌ఎల్‌పిఆర్‌బి బోర్డ్ చైర్మన్ ఇప్పటికే ఏకపక్ష నిర్ణయాలతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని వారు విమర్శించారు. ఎన్నో ఆకాంక్షలతో పోలీసు ఉద్యోగాన్ని పొందాలనే అభ్యర్థులకు బోర్డ్ చైర్మన్ ప్రకటన నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. రన్నింగ్ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులకు సివిల్, కమ్యూనికేషన్, ఫైర్, జైల్, ఎక్సైజ్ విభాగాల్లో మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి
ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో, దేహదారుఢ్య పరీక్షలో అనేక తప్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలు తీసుకువచ్చి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని, అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి విమర్శించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయకపోతే హైదరాబాద్‌ను దిగ్భందిస్తామని ఆయన హెచ్చరించారు. ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్, కార్యదర్శి మచ్చ రమేష్, ఆఫీస్ బేరర్స్ కనకం సాగర్, కేశబోయిన రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నాపత్రంలో తప్పిదాలు రావడం వల్ల లక్షలాది మంది అభ్యర్థుల జీవితాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, టిఎస్‌ఎల్‌పిఆర్‌బి బోర్డ్ వైఖరితో అభ్యర్థులు మానసిక ఆవేదనకు గురవుతున్నారన్నారు.