ప్రజాపక్షం/హైదరాబాద్ అధికార టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో టిడిపి శాసనభాపక్షం విలీనమైంది. ఆ పార్టీకి చెంది న ఏకైక ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు బుధవారం నాడు టిఆర్‌ఎస్ అధ్యక్షులు, సిఎం కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా గతంలో టిఆర్‌ఎస్‌లో చేరిన మరో టిడిపి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్యతో కలిసి టిడిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేసుకోవాలని అభ్యర్థిస్తూ కెసిఆర్‌కు లేఖను అందజేశారు. అనంతరం వారిరువురు కలిసి శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారిక నివాసానికి వెళ్ళారు. తాము టిఆర్‌ఎస్‌లో చేరామని, రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు, నాలుగవ పేరాను అనుసరించి టిడిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ అందజేశారు. దీంతో టిడిపి శాసనసభా పక్షాన్ని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేస్తున్నట్లు, వారిరువురికి టిఆర్‌ఎస్ సభ్యులతో పాటు వారికి శాసనసభలో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ బులెటిన్‌ను సెక్రెటరీ డాక్టర్ వి.నర్సింహాచార్యులు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. శాసనసభా పక్షాల విలీనానికి సంబంధించి అటు టిడిపి సభ్యుల నుండి అభ్యర్థన, ఇటు విలీనానికి అంగీకరిస్తూ టిఆర్‌ఎస్‌ఎల్‌పి నుండి లేఖ అందడంతో రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు నాలుగవ పేరాకు అనుగణంగా ప్రక్రియకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిడిపి తరపున సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి(ఎస్‌సి)), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వరావుపేట(ఎస్‌టి) నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అయితే, మొదట్లోనే సండ్ర టిఆర్‌ఎస్‌లో చేరారు. మెచ్చా నాగేశ్వరరావును అనేక మార్లు ఆహ్వానించినప్పటికీ టిఆర్‌ఎస్‌లో చేరకపోవడంతో ఇద్దరే సభ్యులు కలిగిన టిడిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేయడం సాధ్యం కాలేదు. చివరకు దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత మెచ్చా నాగేశ్వరరావు బుధవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ను మెచ్చా, సండ్ర కలిసినప్పుడు శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఆయన వారిరువురితో పాటు స్పీకర్‌ను కలిసారు. స్పీకర్‌కు టిడిపిఎల్‌పిని విలీనం చేసుకునేందుకు అంగీకారం తెలుపుతూ టిఆర్‌ఎస్‌ఎల్‌పి రాసిన లేఖను స్పీకర్‌కు మంత్రి వేముల అందజేశారు. అందుకు స్పీకర్ విలీన నిర్ణయాన్ని ప్రకటిస్తూ బులెటిన్ జారీ అయింది. దీంతో టిఆర్‌ఎస్ బలం శాసనసభలో 101కు చేరింది.
టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో టిడిపిఎల్‌పి విలీనం
RELATED ARTICLES