పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలతో ప్రత్యేక జాబితా తయారు చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఆ నాయకులకు నామినేటెడ్ పదవులు లేనట్టే..!
ప్రజాపక్షం/ హైదరాబాద్: ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి చెక్ పెట్టాలని టిఆర్‌ఎస్ యోచిస్తోంది. నామినేటెడ్ పదవులు, పార్టీలోని ప్రధాన బాధ్యతల నుంచి కొందరు నేతలను దూరంగా పెట్టాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టిఆర్‌ఎస్ ఓడిపోయిన స్థానాలు, అలాగే కొద్ది పాటి ఓట్లతో బయటపడిన నియోజకవర్గాలపై కెటిఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఇలాంటి ప్రాంతాలకు చెందిన ముఖ్యనాయకులకు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు అందించడంతో పాటు, వారిలో కొందరిని బలోపేతం చేసేందుకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, అలాగే వ్యతిరేకంగా పని చేసిన నేతలకు నామినేటెడ్ పదవులలో యమించవద్దని పార్టీ అధ్యక్షులు కెసిఆర్‌కు కెటిఆర్ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొందరు తమకు వ్యతిరేకంగా పని చేశారని, తమ ఓటమికి కారణమయ్యారని కొందరు స్థానిక నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా నియోజకవర్గ సమావేశాల్లోనే సదరు నేతలను నిలదీశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిలు జితేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వివేక్ తమకు సహకరించలేదని నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియమించిన విషయం తెలిసిందే. దీంతో తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ అభ్యర్థుల విజయం, ఓటమికి గల కారణాలు, పని చేయని నేతల వివరాలతో సహా ప్రత్యేకంగా ఒక నివేదికను ఏర్పాటు చేసి, ఆ నివేదికను ఈ మధ్యనే కెటిఆర్‌కు అందజేసినట్లు తెలిసింది.