పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడిద్దాం
సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌లను గెలిపించండి
వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోసం చేసిన అధికార టిఆర్‌ఎస్‌ను రానున్న పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓడించాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి బి.జయసారథిరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు వారు మద్దతు ప్రకటించారు. వారి విజయానికి కృషి చేస్తామని, గ్రామ గ్రామానా తిరిగి ప్రచారం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.అశోక్ స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, ఎఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్, ఎఐఎస్‌డిఒ రాష్ట్ర కార్యదర్శి ఆర్. గంగాధర్,ఆర్‌ఎస్‌పి నాయకులు గోవింద్, ఎఐడివైఒ నాయకులు రామాంజనేయులు మాట్లాడు తూ ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలను చట్టసభలో తమ వాణిని బలంగా వినిపించే జయసారథిరెడ్డి, కె. నాగేశ్వర్‌రావులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. శివరామకృష్ణ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టి ఆర్‌ఎస్ ప్రభుత్వం తమ హాయంలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ పాలకుల వైఫల్యాలను నిలదీయాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నదన్నారు. మారుపాక అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఇదిగోఉద్యోగాలు,అదిగో అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించా రు. కెసిఆర్ తనకుటుంబంలో నిరుద్యోగిగా ఖాళీ గా ఉన్న కవితను ఇటీవల ఎంఎల్‌సిని చేసి నిరుద్యోగ పోస్టును భర్తీ చేశారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు వస్తాయని లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లలో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదన్నారు. నాగరాజు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పట్టభద్రులు సిద్ధమవ్వాలన్నారు. ఎన్నికల ముందు హామీనిచ్చిన నిరుద్యోగభృతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మహేందర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కుమార్తె కవిత నిరుద్యోగిగా మారి బాధపడి, అనారోగ్యానికి గురవుతే ఆమెకు ఎంఎల్‌సి పదవి ఇచ్చి ఉపాధి కల్పించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అనంతరం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎంఎల్‌సి నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జయసారధిరెడ్డి మఖ్ధూంభవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం, ప్రచార పర్వం తదితర అంశాలపై వారు చర్చించారు.
టిఆర్‌ఎస్ పాలనలో దగాపడ్డ నిరుద్యోగి
RELATED ARTICLES