పశ్చిమబెంగాల్ తరహా రాజకీయాలకు కమలనాథుల ప్రయత్నం
ప్రజాపక్షం / హైదరాబాద్ : అధికార టిఆర్‌ఎస్ పార్టీ చర్యల కారణంగా రాష్ట్రంలో బిజెపి బలోపేతం అయ్యేందుకు ఊతమిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలను చేర్చుకోవడం, శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు ముప్పు తీసుకురావడం వంటి పనులు పరోక్షంగా బిజెపికి కలిసొచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ స్థానంలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని టిఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా కోరుతుండడంతో కూడా కమలం పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఉందని భావిస్తున్నారు. ఇందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పరిణామాలే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ రాష్ట్రంలో దాదాపు పదేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ క్రమంగా ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కిందిస్థాయి శ్రేణులను వెంటాడి, దాడులు చేసి ఆ పార్టీలను వీడేలా చేసింది. దీంతో ఆ రెండు పార్టీలు నామ మాత్రంగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దీనిని అవకాశంగా తీసుకుని బెంగాల్‌లో పాగా వేసేందుకు ఎత్తులు వేసింది. టిఎంసి ప్రధానంగా ఆ రాష్ట్రంలో 25 శాతానికి పైగా ఉన్న మైనారిటీలను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది. ఇదే అంశంపై బిజెపి క్రమంగా ఆ రాష్ట్రం లో రాజకీయాలకు పదునుపెట్టి పట్టు పెంచుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార టిఎంసితో హోరాహోరిగా తలపడిన బిజెపి దాదాపు సగం స్థానాలను కైవసం చేసుకున్నది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బెంగాల్‌లో గద్దెనెక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు తృణమూల్ కాంగ్రెస్ స్వయం కృతాపరాధమే కారణమని భావిస్తున్నారు. బిజెపి వేళ్ళూనుకునేందుకు అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను టిఎంసి భౌతికంగా దాడులు చేసి, భయబ్రాంతులు చేసి బలహీనపరిచింది. దీంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను బిజెపి అవకాశంగా మార్చుకుంది. కేంద్రంలో అధికారం సాయంతో అక్కడ బలపడగలిగింది. అంతేనా?ః తెలంగాణలో పరిస్థితులు కూడా బెంగాల్‌ను తలపిస్తున్నాయి. సిఎం కెసిఆర్ మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి ప్రతిపక్షంలో ఒక్కో పార్టీని కబళిస్తూ వచ్చారు. తొలి శాసనసభలో టిడిపి, వైసిపి, సిపిఐ, బిఎస్‌పి ఎంఎల్‌ఏలను టిఆర్‌ఎస్‌లో కలుపుకున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చీ రాగానే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏలపై దృష్టి సారించారు. దీంతో ఇప్పటికే మండలిలో సిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో కలుపుకోగా, తాజాగా శాసనసభలో మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏలను కూడా కలిపేసుకున్నారు. ఒకరకంగా తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే తలంపుతో ఈ చర్యలకు టిఆర్‌ఎస్ పాల్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో గెలుపొంది ద్వితీయ స్థానంలో నిలిచింది. కర్నాటక మినహా దక్షిణాదిలో ఎక్కడా పెద్దగా బలం లేని బిజెపి తెలంగాణ ఫలితాలతో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డి.కె.అరుణ, సోయం బాపూరావులను తమ వైపు తిప్పుకుని ఎంపి టిక్కెట్లు ఇవ్వగా, బాపూరావు గెలుపొందగా, అరుణ రెండవస్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ను కింది వరకు టిఆర్‌ఎస్ దెబ్బతీస్తుండడంతో భవిష్యత్తులో ఏర్పడే రాజకీయ శూన్యతను ఉపయోగించుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖ ఇచ్చి అందుకు సంకేతాలు పంపింది. తాజాగా ఎంఐఎం ప్రతిపక్ష హోదా కోరుతుండడాన్ని కూడా బిజెపి సానుకూలంగా ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. తద్వారా బెంగాల్ ప్రయోగాన్నే తెలంగాణలో చేసేందుకు బిజెపి సన్నద్ధమవుతోంది.