మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి శుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను ప్రకటించిన గులాబీ పార్టీ
ఎంఐఎంకు ఒకస్థానం కేటాయింపు
ప్రజాపక్షం/ హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో ఐదు ఎంఎల్‌సి స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరుపున నలుగురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ప్రకటించారు. మిగిలిన ఒక స్థానాన్ని మిత్రంపక్షం ఎంఐంఎంకు కేటాయిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర కురుమసంఘం అధ్యక్షులు ఎగ్గె మల్లేశం కురుమ, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ సత్యవతి రాథోడ్‌లను టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. అయితే సంఖ్యాబలం ప్రకారం టిఆర్‌ఎస్, ఎంఐఎం కలిస్తే నాలుగు స్థానాలను గెలిచే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ కు టిడిపి తోడైతే ఒక్క స్థానం వస్తుంది. ఒక్క ఎంఎల్‌సి గెలిచేందుకు21 మంది ఎంఎల్‌ఎల ఓట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌కు 19, టిడిపికి రెండు కలిపితే ఆ సంఖ్యను చేరుకుంటుంది. టిడిపి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య టిఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉం టున్నారనే వార్తల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ ద్వారా ఐదవ స్థానాన్ని కూడా గెలివాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. అందుకే ఎంఐఎంతో కలిసి ఐదు స్థానాలలో పోటీకి సిద్ధమైంది. తామూ పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో వచ్చే నెల12వ తేదీన ఎంఎల్‌సి ఎన్నికలకు ఓటింగ్ అనివార్యం కానుం ది. ఈ నెల 28వ తేదీ నామినేషన్‌లు వేసేందుకు తుది గడువు.
హామీ మేరకు ఎంపిక : గతంలో అధినేత హామీ ఇచ్చిన వారి నే టిఆర్‌ఎస్ తమ ఎంఎల్‌సి అభ్యర్థులుగా ప్రకటించింది. ఎగ్గె మల్లేశం, శేరిసుభాష్ రెడ్డిలకు ఎంఎల్‌సి అవకాశం కల్పిస్తామని గతంలోనే సిఎం అధికారికంగా ప్రకటించారు. ఇక మాజీ ఎంఎల్‌ఎ సత్యవతి రాథోడ్‌కు ఎంఎల్‌సి ఇస్తామని శాసనసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. 2014లో ఆమె డోర్నకల్ నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సత్యవతి రాథోడ్‌పై గెలుపొందిన రెడ్యానాయక్ కొంత కాలానికే కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ ఆశించిన సత్యవతి రాథోడ్‌కు ఎంఎల్‌సి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇక రిటైర్ అవుతున్న సిట్టింగ్ ఎంఎల్‌సిలు మహ్మద్ సలీం, ఇటీవల కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన సంతోష్‌కుమార్‌లు తమకు మరోసారి అవకాశం లభిస్తుందని ఆశించారు. అలాగే కరీంనగర్ జెడ్‌పి చైర్మన్ తుల ఉమ కూడా ఎంఎల్‌సి కోసం ప్రయత్నించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా సిఎంను కలిసిన తుల ఉమను ఎంఎల్‌సిగా అవకాశం కల్పిస్తామని కెసిఆర్ హామీనిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎంఎల్‌ఎల కోటాలో తనకు ఎంఎల్‌సిగా అవకాశం కల్పిస్తారని తుల ఉమ ఆశించారు. కానీ ముగ్గురికీ అవకాశం దక్కలేదు. ఇందులో మహ్మద్ సలీం ఇప్పటికే వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఎంఎల్‌సి అభ్యర్థులు మహమూద్‌అలీ, ఎగ్గె మల్లేశం కురుమ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావును కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంఐఎం కృతజ్ఞతలు : ఎంఎల్‌సి కోటా ఎన్నికల్లో ఎంఐఎంకు టిఆర్‌ఎస్ ఒక సీటును కేటాయించడం పట్ల ఎంఐఎం అధ్యక్షులు, ఎంపి అసదుద్దీన్ ఒవైసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం, టిఆర్‌ఎస్ 17 ఎంపి స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.