పలు చోట్ల సింహం గుర్తుపై రెబెల్స్ పోటీ
రెబెల్స్ వెనుక పెద్ద నేతలు
మాజీ మంత్రి జూపల్లి ఫొటోలతో కొల్లాపూర్‌లో ప్రచారం
ఐజ, ఆలంపూర్‌లో టిఆర్‌ఎస్ ఎంపిపి అనుచరులు
భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ టీమ్
రామగుండంలోనూ రెబెల్స్ సింహ స్వప్నమే
ప్రజాపక్షం/హైదరాబాద్ : పలు మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌కు ‘సింహం’ గుర్తు టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ టిక్కెట్ లభించని పలువురు ఈ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు కొల్లాపూర్, ఐజ, ఆలంపూర్, పెద్దపల్లి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో రెబెల్స్ అంతా ఒక్కతాటిపై వచ్చి సింహం గుర్తు పై పోటీ చేస్తున్నారు. అలాగే భూపాలపల్లిలో టిఆర్‌ఎస్ మాజీ నేత ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నారు. వీరి వెనుక టిఆర్‌ఎస్ నేతలు లేదా ఆ పార్టీని వీడిన బలమైన నాయకులు ఉన్నారు. కొల్లాపూర్‌లో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అండతో పోటీ చేస్తుండగా, ఐజలో ఎంపిపి తిరుమల్‌రెడ్డి, రామగుండంలో ఎంఎల్‌ఎ అనుచరులు ఉన్నారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎన్నికల గుర్తున ‘సింహం’కు రాష్ట్రంలో గుర్తింపు ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఆ గుర్తుపై పోటీ చేసిన వారిలో రామగుండం నుండి కోరుకంటి చందర్ ఎంఎల్‌ఎగా గెలవగా, భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ రెండవ స్థానంలో నిలిచారు. సింహం గుర్తు తొలిసారిగా 1996లో గుర్తింపు పొందింది. లక్ష్మీపార్వతి అధ్యక్షతన ఎన్‌టిఆర్ టిడిపి అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో టిఆర్‌ఎస్ నేత కోరుకంటి చందర్‌కు టిక్కెట్ లభించకపోవడంతో సింహం గుర్తుపై పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. తరువాత 2019లో అదే గుర్తుపై గెలుపొందారు. దీంతో సింహం గుర్తుకు కొంత గుర్తింపు ఉంది. పైగా టిఆర్‌ఎస్ రెబెల్స్ గతంలో పోటీ చేయడంతో ఆ గుర్తుకు క్రేజ్ ఏర్పడింది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ రెబెల్స్ ఆ గుర్తును ఆశ్రయించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు మొత్తం 20 స్థానాల్లో సింహం గుర్తుపై పోటీ చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో జూపల్లిపై గెలిచారు. తరువాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి ఇరువురి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మండల, జెడ్‌పిటిసి ఎన్నికల్లో ఇరు వర్గాలకు చెరి సగం చొప్పున బిఫామ్‌లు ఇచ్చారు. ఈసారి మొత్తం ఎంఎల్‌ఎ వర్గీయులకే బిఫామ్‌లు దక్కడంతో, మాజీ మంత్రి జూపల్లి అనుచరులు సింహం గుర్తుపై పోటీ చేసి, జూపల్లి పోస్టర్‌లతో ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ఆలంపూర్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అబ్రహంకు ఐజ ఎంపిపి తిరమల్‌రెడ్డికి మధ్య వర్గ పోరు నెలకొంది. దీంతో తిరుమల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌కు, తన పదవికి రాజీనామా చేసి, ఆయన వర్గీయులతో ఐజ మున్సిపాలిటీలోని మొత్తం 20 స్థానాల్లో సింహం గుర్తుపై పోటీ చేయిస్తున్నారు. ఆలంపూర్ మున్సిపాలిటీలో కూడా టిఆర్‌ఎస్ రెబెల్స్ పది స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇదే గుర్తుపై బరిలో నిలిచారు. కాగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్ మున్సిపాలిటీలో సైతం రెబెల్స్ 15 వార్డులకు గాను 11 చోట్ల సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో బలమైన టిఆర్‌ఎస్‌నే వెంకటేశం గుప్తా ఆధ్వర్యంలో వీరు పోటీ చేస్తున్నట్లు సమాచారం. మొన్నటి జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఆయనకు, ఆయన అనుచరులకు టిఆర్‌ఎస్ టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వెంకటేశం గుప్తా తన అనుచరులతో సహా ఫార్వర్డ్‌బ్లాక్ గుర్తుపై పోటీ చేశారు. స్వయంగా ఆయన తలకొండపల్లి జెడ్‌పిటిసి సభ్యులుగా గెలవడంతో పాటు, ఆయన అనుచరులు ఆ మండలంలో 12 ఎంపిటిసి స్థానాల్లో పోటీ చేసి ఆరు చోట్ల గెలుపొందారు. కల్వకుర్తి ఎంఎల్‌ఎగా జైపాల్‌యాదవ్ ఉన్నారు. ఆమన్‌గల్‌లో సింహం గుర్తు గట్టి పోటీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. శంషాబాద్‌లో సైతం పెద్ద సంఖ్యలోనే ఆ గుర్తుపై పోటీలో ఉన్నారు. ఇక రామగుండంలో ఫార్వర్డ్‌బ్లాక్ టిక్కెట్‌పై రెండు సార్లు కోరుకంటి పోటీ చేయడంతో సింహం గుర్తు ఆ నియోజకవర్గంలో బాగా ప్రాచుర్యం పొందింది. గత ఎన్నికల్లో గెలిచాక ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, కార్పొరేటర్ టిక్కెట్‌లకు విపరీతంగా పోటీ ఉండడంతో, అక్కడ రెబెల్స్ బెడద తప్పలేదు. అటు టిఆర్‌ఎస్, కాంగ్రెస్ చెందిన రెబెల్స్ 50 డివిజన్‌లకు గాను 43 చోట్ల సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి తన కోడలు మమతారెడ్డిని కౌన్సిలర్‌గా వ్యూహాత్మకంగా ఏకగ్రీవం చేసుకున్నారు. మిగతా వార్డులలో 13 మంది సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు.