మొయినాబాద్ వద్ద ఫామ్‌హౌస్‌లలో ప్రలోభాల కలకలం
నలుగురి కొనుగోలుకు ఢిల్లీ బృందం ప్రయత్నం
ప్రజాపక్షం/హైదరాబాద్ అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంపై స్పందించిన పోలీసులు సైబరాబాద్ పరిధిలోని మోయినాబాద్ ప్రాం తం అజీజ్‌నగర్‌లో ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డిలను వీరు సంప్రదించారు. భారీ మొత్తాలను ఎరచూపి, వారిని పార్టీ మార్చేందుకు ప్రోత్సహించడమే వీరి లక్ష్యంగా కనిపిస్తున్నది. పలువురు బిజెపి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో, అందుకు తగిన సమాధానం ఇవ్వడానికే ఈ ఫిరాయింపుల ప్రయత్నాలు కొన్ని రోజులుగా సాగుతున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికను బిజెపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఓటర్లను ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు కూడా జరుగుతున్నాయి. అయితే, అధికార పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం జరగడం సంచలనం సృష్టిస్తున్నది. ఒక్కొక్కరికీ వంద కోట్ల రూపాయల వరకూ ఆశ చూపినట్టు చెబుతున్నారు. కాగా, ఎంఎల్‌ఎలు అందించిన సమాచారం ప్రకారమే ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్టు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఫామ్‌హౌస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపినట్టు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు చెప్పారని అన్నారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహ యాజులు స్వామీజీ, హైదరాబాద్‌కు చెందిన నంద కుమార్ ఈ బేరసారాలు సాగించారని అన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని సిపి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఒక జాతీయ పార్టీకి చెందిన వారన్న వార్త బిజెపిపై అనుమానాలు పెంచుతున్నాయి. ఆ పార్టీ కీలక నాయకుల ఆదేశాల మేరకు ఈ ప్రలోభాల ప్రక్రియ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. రెండుమూడు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగతున్నట్టు సమాచారం. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఆ నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఢిల్లీ బృందానికి మధ్య నందకుమార్ మధ్యవర్తిగా వ్యవహరించారని కూడా తెలుస్తున్నది. ఈ పథకం వెనుక బిజెపి ఉన్నదన్న అనుమానాలు బలపడుతున్నప్పటికీ, అధికారికంగా పోలీసులు ధ్రువీకరించలేదు. దర్యాప్తు జరిపిన తర్వాతే వివరాలు తెలుస్తాయని అంటున్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన కొంత మంది ఎంఎల్‌ఎలు తమతో టచ్‌లో ఉన్నారని బిజెపి నాయకులు గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలకూ, ప్రలోభాల ఘటనకు సంబంధం ఉందనే కోణంలోనూ దర్యాప్తు జరిపే అవకాశాలున్నాయి.
బిజెపి కుట్ర..
మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదన్న భయంతో బిజెపి కుట్రలు పన్నుతున్నదని, అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలకు ఎరవేసిందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బల్క సుమన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఆదరణను పొందలేకపోతున్న బిజెపి, దొడ్డిదారిన గెలిచేందుకు ప్రయత్నించిందని అన్నారు. తమ పార్టీ ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంతోనే బిజెపి చేస్తున్న అప్రజాస్వామిక విధానాలు బయటపడ్డాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలు ఈ ఘటన బట్టబయలు చేస్తున్నదని సుమన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో కాంట్రాక్టులు, వందల కోట్ల రూపాయలు, పదవుల ఎర చూపి ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం అత్యంత హేయమని ఆయన అన్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించిన నలుగురు ఎంఎల్‌ఎలను ఆయన అభినందించారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ప్రలోభాలకు లొంగరని అన్నారు. ఎన్నికల్లో గెలిచే శక్తిలేక, దొడ్డిదారులు వెతుక్కుంటున్నదని ఆయన బిజెపిపై ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని తుక్కుకింద ఓడించడం ద్వారా ఆ పార్టీ అవినీతి, అకృత్యాలకు తగిన సమాధానం చెప్పాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఆయనను అడ్డుకోవడం కూడా బిజెపి పన్నాగమని ఆయన ఆరోపించారు.
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ఎర
RELATED ARTICLES