పక్క భవనంలోకి వ్యాపించిన మంటలు
ముగ్గురు సజీవదహనం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి మహమూద్ అలీ
ప్రజాపక్షం/చర్లపల్లి హైదరాబాద్‌లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపోలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో టింబర్ డిపో పక్కనే ఉన్న భవనానికి మంటలు అంటుకుని ఒకే కుటుంబంలో ముగ్గురు నల్లగొండ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన నరేష్(35), భార్య సుమ(28), కుమారుడు యశ్వంత్(06) అగ్నికి ఆహుతి అయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో టింబర్ డిపో పక్కన ఇండ్లలోకి మంటలు వ్యాప్తిచెందాయి, దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న హోంశాఖమంత్రి మహమూద్ ఆలీ, నగర మేయర్ విజయలక్ష్మి, ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ రామ్మోహన్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం చాలా బాధకరమని విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటలను పునరావృత్తం కాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. అనంతరం మంటల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొంతుతున్న క్షతగాత్రులను మంత్రి, ఎంఎల్‌ఎ, మాజీ మేయర్ రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవిలు పరామర్శించారు.