పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన టిఆర్‌ఎస్
బాధ్యతలు కెటిఆర్‌కు..!
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు టిఆర్‌ఎస్ సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసింది. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలకు కెటిఆర్ హాజరుకానున్నారు. “ఢిల్లీని శాసిద్ధాం-.. తెలంగాణ హక్కులను సాధిద్ధాం” అనే నినాదంతో “టార్గెట్ -16” లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మార్చి మొదటి, లేదా రెం డవ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారశైలి ఎలా ఉండాలి? సిఎం కెసిఆర్ పాల్గొనే సభలు, ఎన్నికల వ్యూహం ఇలా పలు అంశాలపై ఇప్పటికే టిఆర్‌ఎస్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. గత శాసనసభ ఎన్నికల్లో ముందస్తుగా ఎంఎల్‌ఎ అభ్యర్థులను ప్రకటించిన టిఆర్‌ఎస్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాతనే ఎంపి అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంఎల్‌ఎలను ఎంపిగా పంపించే యోచన లేనట్లు ఇటీవల పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత స్పష్టం చేశారు. 16 లోక్‌సభ నియోజకవర్గాల వారిగా జరిగే సన్నాహాక సమావేశాల్లో భాగంగా కెటిఆర్ జిల్లాలలోనే బస చేయనున్నారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాలో నేతల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతానికి చర్యలు, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. సన్నాహాక సమావేశాలకు ఆ జిల్లాకు చెందిన మంత్రి, సిట్టింగ్ ఎంపి, రాజ్యసభ సభ్యు లు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జు కార్యదర్శులు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, పార్టీ మందలాధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు కూడా పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2వేల మంది, అలాగే సమావేశం జరిగే స్థాని క నియోజకవర్గంలో అదనంగా మరో వెయ్యి మంది మొత్తం 15 వేల మంది కార్యకర్తులు,నాయకులు ఈ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణను రూపొందించా రు.కాగా ఆయా జిల్లా మంత్రులే సన్నాహాక సమావేశాల ఏర్పాట్లను పర్య వేక్షిస్తారని మంత్రులు లేని జిల్లాలో కెసిఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నట్లు మండలి విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.