HomeNewsBreaking Newsజోరు వానలతోరాష్ట్రం ఆగమాగం

జోరు వానలతోరాష్ట్రం ఆగమాగం

నిజామాబాద్‌ వేల్పూరులో రికార్డు స్థాయిలో 46.3 సెం.మీ. వర్షం
ప్రజాపక్షం/న్యూస్‌నెట్‌వర్క్‌
జోరుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం ఆగమాగమవుతోంది. భారీ వర్షాలతో జనం అవస్థలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, చెరువు పొంగుతుండటంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి, జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షాలకు పలుప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాల్కొండ ప్రాంతంలోని మోర్తాడ వేల్పూర్‌, ఎర్గట్ల, భీంగల్‌ మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేల్పూరులో 46.3సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వేల్పూర్‌ చెరువు తెగిపోవడంతో రోడ్డుపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆర్మూర్‌-భీంగల్‌ మార్గంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూరు పిఎస్‌, తహసీల్దార్‌ కార్యాలయం, రైతు వేదికలోకి వరద నీరు చేరింది. ఆర్మూరు మండలం పీప్రీ- మంతెన మధ్య రోడ్డుపై వరదనీరు చేరింది. భీంగల్‌లోని అయ్యప్పనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా పడకల్‌ పెద్దచెరువు కట్ట భారీ వరద వల్ల కుంగిపోయింది. దీంతో ముందస్తుగా అధికారులు మత్తడిని పగులగొట్టారు. నిజామాబాద్‌ జిల్లా రామడుగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్‌, సిరికొండ, ధర్‌పల్లి, జక్రాన్‌పల్లిలో వాగులు, వంకలు పొంగుతున్నాయి.సిరికొండలో కప్పలవాగు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. ఆర్మూర్‌ శివారులోని జాతీయ రహదారి 63 కల్వర్టుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చేపూర్‌ శివారులో ర్యాంపులు పక్కకు వాలాయి. సాయిబాబా గుడి సమీపంలో జాతీయ రహదారి కోతకు గురైంది. పెరికిట్‌ శివారులో 44, 63 జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడ్వాయి మండలం కామారెడ్డి నుంచి బ్రహ్మణపల్లి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జి తెగిపోయింది. గాంధారి మండలం నల్లమడుగు- రామలక్ష్మన్‌ పల్లి గ్రామాల మధ్య వాగు పొంగి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఉమ్మడి కరీంనగ్‌ జిల్లాలోనూ ఎడతెరపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రాత్రి భారీ వర్షం కురవగా.. కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ముసురు కమ్ముకుంది. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో పొంటపొలాలు నీటమునిగాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండంల రంగారావుపేట కల్వర్టు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్‌లో కాలనీలు జలమయం
ఏకధాటిగా కురిసిన వర్షం వరంగల్‌లోని లోతట్టు కాలనీలను జలమయం చేసింది. నగర వీధులన్నీ ఏరులుగా తలపించగా.. మోకాల్లోతు పైగా వచ్చిన వరదతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు వీడని ముసురుతో పలు కాలనీల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. సమీప నాలాలు పొంగి ప్రవహించాయి. ఎస్‌ఆర్‌నగర్‌, సాయిగణేష్‌ కాలనీ, వివేకానంద కాలనీ, ఎంహెచ్‌నగర్‌, శివనగర్‌ కాలనీల్లోని ఇళ్లు చెరువయ్యాయి. బియ్యం, పప్పు, ఉప్పు, ఇతర సామగ్రి తడిసిపోవటంతో.. బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. వర్షపునీటిలో చిక్కుకున్న వివేకానందకాలనీ, సుందరయ్యనగర్‌, సాయిగణేశ్‌ కాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న మంత్రి.. పునరావాసానికి తరలించాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి.. రెస్క్యూటీం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. వరంగల్ల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాగులు వంకలూ ఉప్పొంగుతుండగా.. జిల్లాలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. భారీ వర్షంతో పంథిని వద్ద ఊర వాగు ఉప్పొంగడంతో వరంగల్‌ – ఖమ్మం జాతీయ రహదారిపైకి ఆరడగుల మేర వరద నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడిగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట శివారులో ఆకేరు వాగు ఉథృతంగా ప్రవహించగా.. రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని లోతట్లు ప్రాంతాలు జలమయంగా మారాయి. గత రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో తరచూ వరదనీరుతో ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.
బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎడ తెగని వర్షం కురిసింది. వర్షం కారణంగా జన జీవనం స్తంభించింది. బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గోదావరి 40 అడుగుల వద్ద నిలకడగా ఉండగా మున్నేరుకు భారీగా వరద నీరు చేరింది. పలు పట్టణాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దాదాపు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి వర్షం ఆటంకం కలిగించింది. అయితే చాలా రోజుల తర్వాత భారీ వర్షాలు కురవడంతో రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్‌ అతలాకుతలం
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపించాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్‌తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి.. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట కాలనీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరుతో పాటు పాములు రావడంతో.. జిహెచ్‌ఎంసి సిబ్బంది అప్రమత్తమై వాటిని బంధించి తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో వరద బీభత్సం సృష్టించింది . గాజుల రామారంలోని.. వొక్షిత్‌ ఎంక్లేవ్‌, ఆదర్శ నగర్‌, ఇంకా పలు కాలనీలు మళ్లీ నీట మునిగాయి. రామంతాపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, ఘట్‌ కేసర్‌, పోచారం, మేడిపల్లిలలో వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో.. వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.

తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌
తీవ్ర అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం
మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరక్టర్‌ నాగరత్న వెల్లడించారు. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం
రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అటు, రుతుపవన ద్రోణి పశ్చిమ కొన రాగల రెండు మూడు రోజుల్లో ఉత్తర దిశ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాలకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. హైదరాబాద్‌లో సైతం లోతట్టు ప్రాంతాలు జలమయమాయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గుంతలమయమైన రహదారులలో నీరునిలవడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. జిహెచ్‌ఎంసికి చెందిన డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలు నగర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసింది. అధికారులు రౌండ్‌ది క్లాక్‌ పరిస్థితులను సమన్యయం చేస్తూ సహాయ చర్యలు చేపడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments