HomeNewsBreaking Newsజోరు కొనసాగించారు..

జోరు కొనసాగించారు..

చెలరేగిన కుల్దీప్‌
రాణించిన రోహిత్‌, ధావన్‌
రెండో వన్డేలోనూ భారత్‌ ఘన విజయం
90 పరుగులతో కివీస్‌ చిత్తు
సిరీస్‌లో 2-0తో ఆధిక్యం
మౌంట్‌ మాంగనూయి: వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీ సేన కివీస్‌ గడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 90 పరుగులతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ సత్తా చాటిన టీమిండియా ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2 ఆధిక్యంలో నిలిచింది. ఇక సోమవారం జరిగే మూడో వన్డేలోనూ కివీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కివీస్‌ జట్టు పేలవమైన ఆటతో భారీ ఓటములను మూటగట్టుకొంటుంది. ప్రపంచకప్‌కు ముందు తమ జట్టు ఇలా వరుస ఓటములను చవిచూడటం అటు అభిమానులు, ఇటు మాజీలు జీర్ణించుకోలేక పోతున్నారు. కివీస్‌ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు భారత జట్టు గణతంత్ర దినోత్సవం రోజున ఘన విజయం సాధించి అభిమానుల సంతో షాన్ని రెట్టింపు చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. టీమిండియాలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (87), శిఖర్‌ ధావన్‌ (66) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. తర్వాత భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ధాటికి 40.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు మరో భారీ విజయం లభించింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించిన రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
ఆరంభంలోనే..
325 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ ఆరంభంలోనే షాకిచ్చాడు. జట్టు స్కోరు 23 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ మార్టిన్‌ గుప్టిల్‌ (15)ను పెవిలియన్‌ పంపాడు. తర్వాత వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చెలరేగి ఆడాడు. కానీ ఇతనిని మహ్మద్‌ షమీ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి కివీస్‌కి మరో పెద్ద షాకిచ్చాడు. విలియమ్సన్‌ 11 బంతుల్లోనే 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు కివీస్‌ 51 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం కుదురుగా ఆడుతున్న మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (41 బంతుల్లో 31)ను చాహల్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేసి కివీస్‌కు మరో ఎదురుదెబ్బేశాడు. తర్వాత డేంజరెస్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (22)ను కేదర్‌ జాదవ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ ధోనీ కళ్లుచెదిరే స్టంపింగ్‌తో ఇంటి దారి చూపెట్టడంతో కివీస్‌ 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇలా భారత బౌలర్ల ధాటికి కివీస్‌ వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోతూ పోయింది.
రోహిత్‌, ధావన్‌ దూకుడు..
అంతకుముందు టాస్‌ గెలిచిన కోహ్లీ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్‌కు శుభారంభాన్ని అందించారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. మొదట్లో స్లోగా ఆడిన వీరు తర్వాత జోరును పెంచారు. చెత్త బంతులను బౌండరీలుగా మార్చుతూ పరుగుల వేగం పెంచారు. ఈ క్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అనంతరం కుదురుగా ఆడుతున్న రోహిత్‌ శర్మ 62 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న శిఖర్‌ ధావన్‌ కూడా 53 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జంటను విడదీయడానికి కివీస్‌ బౌలర్లు ఎంతగానో శ్రమించారు కానీ వారికి ఫలితం దక్కలేదు. రోహిత్‌ కుదురుగా ఆడుతుంటే ధావన్‌ మాత్రం దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 146 బంతుల్లోనే 150 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకొని భారత్‌కు గట్టి పునాది వేశారు. అనంతంరం ధాటిగా ఆడుతున్న ధావన్‌ (66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ను ఔట్‌ చేసిన బౌల్ట్‌ 154 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. ఆ కొద్ది సేపటికే మరో సెట్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ (87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ఫెర్గ్యూసన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 29.3 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
రాణించిన కోహ్లీ, రాయుడు..
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన భారత సారథి విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు భారత్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ జాగ్రత్తగా ఆడారు. కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ కొద్ది సేపటికి ఈ జంటను బౌల్ట్‌ విడగొట్టాడు. దీంతో ధాటిగా ఆడుతున్న కెప్టెన్‌ కోహ్లీ 45 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి రాయుడు భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మొదట్లో కుదురుగా ఆడిన వీరు తర్వాత వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే టీమిండియా 42.1 ఓవర్లలో 250 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. ఈ కొద్ది సేపటికి హాఫ్‌ సెంచరీకి చెరువైన రాయుడు (47) పరుగుల వద్ద ఔటై తృటిలో అర్ధ శతకాన్ని మిస్‌ చేసుకున్నాడు.
ధోనీ, జాదవ్‌ మెరుపులు..
చివర్లో ధోనీ, కేదర్‌ జాదవ్‌లు మెరుపులు మెరిపించారు. కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించారు. చెలరేగి ఆడిన వీరు చివరి వరకు అజేయంగా నిలిచారు. వీరిద్దరూ తమ బ్యాట్‌లను ఝుళిపించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 324/4 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన ధోనీ (48 నాటౌట్‌; 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స్‌), కేదర్‌ జాదవ్‌ (10 బంతుల్లోనే 22) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గ్యూసన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 28న (సోమవారం) మూడో వన్డే జరగనుంది.

విజృంభించిన కుల్దీప్‌..
ఈ సమయంలో టామ్‌ లాథమ్‌, హెన్రీ నికొలాస్‌ న్యూజిలాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కొద్ది సేపటి వరకు మరో వికెట్‌ పడకుండా జగ్రత్తగా ఆడారు. కానీ వీరి భాగస్వామ్యం ఎక్కువసేపు నిలువలేదు. భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విజృంభించడంతో కివీస్‌ వికెట్ల పతనం తిరిగి మొదలైంది. తెలివైన బంతితో 36 పరుగుల ఐదో వికెట్‌ కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో ధాటిగా ఆడుతున్న లాథమ్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు) చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (3)ను సైతం ఔట్‌ చేసి టీమిండియా శిబిరంలో ఆనందాన్ని నింపాడు. అనంతరం కుదురుగా ఆడుతున్న హెన్నీ నికొలాస్‌ (28)ను, ఇష్‌ సోధీ (0)లను వెనువెంటనే పెవిలియన్‌ పంపి కివీస్‌ ఓటమని దాదాపు ఖరారు చేశాడు. దీంతో కివీస్‌ 166 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వచ్చిన బ్రాక్‌వెల్‌ అసాధారాణ పోరాటం చేస్తూ కివీస్‌ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇతను మాత్రం నిలకడగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపిస్తూ 35 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈక్రమంలోనే కివీస్‌ స్కోరు 200 పరుగులు దాటింది. చివర్లో భువనేశ్వర్‌ అద్భుతమైన బంతితో బ్రాక్‌వెల్‌ (57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌)ను ఔట్‌ చేశాడు. తర్వాత ఫెర్గ్యూసన్‌ (12)ను చాహల్‌ ఔట్‌ చేసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో కివీస్‌ 40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments