నేడు పోరు, రాత్రి 8 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయంపై కన్నేసింది. శనివారం సొంతగడ్డపై ముంబయి ఇండియన్స్‌తో పోరుకు ఎస్ఆర్హెచ్ సిద్ధమైంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. హైదరాబాద్, ముంబయి జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబి, యూసుప్ పఠాన్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. ఇక, ముంబైలో కూడా రోహిత్ శర్మ, పొలార్డ్, హార్దిక్ పాండ్య, డికాక్, సూర్యకుమార్ వంటి స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉంది. రెండు జట్లు కూడా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాయి. సన్‌రైజర్స్ సొంత మైదానంలో జరిగిన చివరి రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించింది. ఇక ముంబయి ఇండియన్స్ తమ చివరి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి తమ సత్తేంటో నిరూపించుకుంది. అందుకే శనివారం ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమనిస్తోంది.
రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో..
హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలు భీకర ఫామ్‌లో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో బెయిర్‌స్టో మెరుగైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆడిన తొలి సీజన్లోనే ఇంగ్లాండ్ స్టార్ బెయిర్‌స్టో జట్టుపై తనదైన ముద్ర వేసుకున్నాడు. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుతమైన శతకంతోపాటు మరో ఓపెనర్ వార్నర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇప్పటివరకు అన్ని మ్యాచుల్లో బెయిర్‌స్టో చెలరేగి ఆడాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బెయిర్‌స్టో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు డేవిడ్ వార్నర్ కూడా దూకుడు మీదున్నాడు. ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమైన తనలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. ఈసారి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ విజయం ఖాయమనే చెప్పాలి. మరోవైపు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ సీజన్లో మెరుగ్గా ఆడుతున్నాడు. వచ్చిరావడంతోనే బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందిస్తే వన్ డౌన్ బ్యాట్స్‌మన్ శంకర్ కూడా తనదైన శైలిలో విజృంభించి ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ యువ ఆటగాళ్లు, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్లు కూడా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నారు. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్ జట్టులో ఉండడం సన్‌రైజర్స్ బలాన్ని మరింతగా పెంచుతోంది. అందరూ కలిసి కట్టుగా రాణిస్తే హైదరాబాద్‌కు మరో విజయం ఖాయం. ఇప్పటికే సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలి..
వరుస విజయాలు సాధిస్తున్నా సన్‌రైజర్స్‌ను కొన్ని లోపాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లను చేజార్చుకోవడం జట్టుకు సమస్యగా మారింది. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ నిరాశ పరిచారు. ఓ దశలో 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం ఖాయమని అనిపించగా బ్యాటింగ్ వైఫల్యంతో గెలుపు కోసం తీవ్రంగా పోరాడాల్సి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఈసారైనా వీరు తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక వేగంగా ఆడడంలో కూడా హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారు. కీలక సమయంలో ధాటిగా ఆడలేక పోతున్నారు. దీంతో స్కోరు వేగం మందగిస్తోంది. అంతేగాక సాధించాల్సిన రన్‌రేట్ కూడా పెరిగిపోతూ జట్టు ఒత్తిడికి గురవుతోంది. ఈ మ్యాచ్‌లో ఇటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ సమిష్టిగా రాణిస్తే భారీ పరుగులు చేయడం ఖాయం.