HomeNewsBreaking Newsజోరుమీదున్నారు..

జోరుమీదున్నారు..

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న టీమిండియా
క్రీడా విభాగం: గత కొంత కాలంగా టీమిండియా వరుస విజయాలతో జోరుమీదుంది. భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్నారు. ఉపఖండంలోనే కాకుండా విదేశీ పర్యటనల్లోనూ టీమిండియా జోరు కనబర్చుతున్నది. ప్రస్తుత భారత జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడ విశ్లేషకులు చేబుతున్నారు. ఇంగ్లాండ్‌ వేదికగ ఈ ఏడది మే చివరి నుంచి వన్డే ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు మరో పెద్ద పరీక్ష ఉంది. అదే ఆస్ట్రేలియాతో దైపాక్షిక సిరీస్‌. ఇటీవలే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టి కరిపించి వచ్చిన టీమిండియాకు మరోసారి ఈ పటిష్ట జట్టుతో పోటీ పడాల్సి వుంది. ఇక తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు వన్డేలు, మరో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 24 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మొదటి టి20 మ్యాచ్‌ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టుపై ఉన్న పేలవమైన రికార్డులను చెరిపేసుకునేందుకు భారత్‌కు ఇదే సువర్ణ అవకాశమని చెప్పాలి. చాలా కాలంగా క్రికెట్‌ శాసించిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై కూడా ఎన్నో విజయాలను సాధించింది. ముఖ్యంగా వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత రికార్డు చాలా పేలవవంగా ఉంది. చాలా కాలంగా టీమిండియాపై ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాని చెలాయిస్తూ వస్తోంది. అయితే ఈసారి భారత్‌కు తన రికార్డును మెరుగు పరుచుకునే మంచి అవకాశం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు ఈసారి కష్టాలు తప్పవని కనిపిస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో భారత్‌కే సిరీస్‌ గెలిచే అవకావాలు అధికంగా ఉన్నాయి. అయితే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే రానున్న ప్రపంచకప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ వన్డే, టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో కంగారూలను ఓడించడం టీమిండియాకు అంత కష్టమేమి కాదు. అయితే దీని కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓపెనర్లు శుభారంభం ఇస్తే..
ఓవరాల్‌గా టీమిండియా పటిష్టంగానే ఉన్నా.. కొన్ని సమస్యలు మాత్రం భారత్‌కు వెంటాడుతున్నాయి. బౌలర్లు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబాటు ఎక్కువగా కనిపిస్తోంది. కీలక సమయంలో వికెట్లను చేజార్చుకోవడం భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఓపెనర్లు కూడా ఆశించిన స్థాయిలో శుభారంభం అందించలేక పోతున్నారు. ఒకప్పుడూ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కళ్లు చెదిరే శుభారంభాలు అందించేవారు. భారత్‌ విజయాల్లో వీరిద్దరూ అందించిన శుభారంభమే చాలా సార్లు కీలక పాత్ర పోషించింది. కానీ, కొంతకాలంగా ధావన్‌, రోహిత్‌లు మెరుగైన భాగస్వామ్యాలు అందించక పోవడంతో దాని ప్రభావం జట్టుపై బాగానే కనిపిస్తోంది. ఓపెనర్లలో ఒకరు రాణిస్తే మరొకరూ విఫలమవుతున్నారు. దీంతో చాలా మ్యాచుల్లో మంచి పార్ట్‌నర్‌షిప్‌లు లభించడం లేదు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో జట్టుకు చాలా కీలకమైన ఓపెనింగ్‌ విభాగం మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, భారత సారథి విరాట్‌ కోహ్లీ కూడా వన్డేల్లో కాస్త తడబడుతున్నాడు. ఈసారి కోహ్లీ కూడా తన బ్యాట్‌ను ఝుళిపించి ఆసీస్‌ సిరీస్‌లో సత్తా చాటుకోవాలని అందరు ఆశిస్తున్నారు. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా టాప్‌ ఆర్డర్‌ సమస్య పూర్తిగా తేలిపోవాల్సిందే. ఓపెనర్లు ఇద్దరూ కూడా కనీసం 20 ఓవర్ల వరకు తమ వికెట్లను కాపాడుకోవాల్సిందేనని, అప్పుడే భారత్‌కు మంచి ఆరంభం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. వీరు శుభారంభం అందిస్తే తర్వాతి బ్యాట్స్‌మెన్స్‌ జట్టును భారీ స్కోరును అందించడంలో ఇబ్బంది పడరు.
నిలకడలేమే ప్రధాన సమస్య..
ఇక టీమిండియాకు వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య నిలకడలేమే. ఈ అంశం భారత్‌ను చాలా కలవర పెడుతోంది. రాణిస్తే అందరూ ఒకేసారి అద్భుతంగా రాణిస్తున్నారు.. లేదంటే అందరూ ఒకేసారి టపటప వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఒక మ్యాచ్‌లో 300 పరుగులు సాధిస్తే తర్వాతి మ్యాచ్‌లో వందలోపే కుప్పకూలడం భారత్‌కు అలవాటుగా మారింది. ఉపఖండంలో మెరుగ్గా ఆడుతున్నా విదేశాల్లో ఇబ్బందలు తప్పడంలేదు. గత ఏడాది మొత్తంలో టీమిండియా ప్రదర్శనలు ఇలానే ఉన్నాయి. తక్కువ స్కోర్లను కూడా ఛేదించలేక టీమిండియా చతికిలపడిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా పర్యటనలో ఇలాంటి సమస్యలు అధికంగానే కనిపించాయి. ఇక ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ఆస్ట్రేలియా సిరీస్‌ కంటే మంచి వేదికగా మరొకటి ఉండదనే చెప్పాలి. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత బలమైన జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే తత్వం కంగారూలలో కనిపిస్తోంది. చివరి బంతి వరకు కూడా ధైర్యం వీడక పోరాడే జట్టు ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా మాత్రమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్‌ ఇటీవల కాలంగా బలమైన జట్టుగా ఎదిగిందనడంలో సందేహం లేదు. విదేశి పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికాలో ఘోరంగా విఫలమైన భారత జట్టు ఇక్కడ సొంత గడ్డపై మాత్రం మంచి ప్రదర్శనలు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఏకపక్షంగా విజయాలు సాధించింది. అనంతరం విదేశి పర్యటనకు వెళ్లి అక్కడ పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను చిత్తుగా ఓడించి మంచి ఫలితాలు రాబట్టింది. ఇప్పుడు అదే జోష్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌కు కోహ్లీసేన సిద్ధమయింది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేని ఆస్ట్రేలియా కొంతగా బలహీన పడినా వారిని తక్కువ అంచనా వేయలేయమనే చెప్పాలి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చివరి వరకు పోరాడుతూ తమ జట్టుకు అండగా ఉంటారు. టాప్‌ బ్యాట్స్‌మెన్స్‌ విఫలమైనా బౌలర్లు మాత్రం అద్భుతంగా పోరాడి ఆసీస్‌ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. భారత జట్టు ఆసీస్‌ సిరీస్‌కు తమ పూర్తి బలబలగాలతో గట్టిపోటీనిచ్చేందుకు రెడీ అయింది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రపంచకప్‌కు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments