అభ్యర్థులపై కోట్లలో పందెంకాస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
అప్రమత్తమైన పోలీసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకోవడంతో దానికి తోడుగా బెట్టింగ్‌లు కూడా ఊపందుకున్నాయి. పలా నా నియోజక వర్గంలో పలానా అభ్యర్థి గెలుపోటములపై ఆయా పార్టీల అభిమానులు జోరుగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. హైదరాబాద్ దాని చుట్టుపక్క ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, వ్యాపారులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరి దృష్టి ఎపిలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన పార్టీ అధికారం చేబడుతుందని బెట్టింగ్‌లు పెడుతున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ పార్టీ అభ్యర్థులపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎపిలోని అన్ని జిల్లాలలకు చెందిన వారు తెలంగాణలో నివాసముంటున్న విషయం తెలిసిందే. ఇక్కడ స్థిరపడ్డ వీరు ఎపిలో రోజు రోజుకు నెలకొంటున్న రాజకీయ పరిణామాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ప్రధాన పార్టీల బహిరంగ సభలు, ర్యాలీలను గమనిస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లో తమ పార్టీ నేత గెలుస్తున్నారని ప్రత్యర్థి పార్టీ నేతలతో బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఎల్బినగర్లోని చింతల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున ఆవులు, బర్రెల విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక్కడ ప్రతి రోజు కనీసం రూ.కోటి వరకు వ్యాపారం సాగుతుంది. ఈ వ్యాపారం నిర్వహించేవారిలో అత్యధికులు ఎపికి చెందిన వ్యాపారులే. వీరంతా ఎపి నుంచి ఆవులను తక్కువ ధరకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. వారం రోజుల నుంచి ఇక్కడ వ్యాపారం కుంటు పడింది. వ్యాపారులు తమ డబ్బును బెట్టింగ్‌లలో పెట్టడమే ప్రధాన కారణం. పశువుల వ్యాపారం నిర్వహించే వందలాది మంది వ్యాపారులు ఎపి ఎన్నికలపై బెట్టింగ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీలపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎపిలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుదనే అంశంపై కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ వస్తాడని, కాదు కాదు జగన్ ఈ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బెట్టింగ్‌లు వేసుకుంటున్నారు. ఈ మేరకు మధ్యవర్తితో బాండ్ పేపర్లు కూడా రాయించుకుంటున్నారు. ఇక ఎపిలోని 13 జిల్లాల్లో పలానా జిల్లాలో పలానా పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ఎల్బినగర్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురంలోని లాడ్జీలు, హోటళ్లను కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇక మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి ప్రాంతాలలో నివాసముంటున్న వ్యాపారులు, ప్రజలు కూడా ఎపి ఎన్నికలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. ఇక తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు కూడా ఎపి రాజకీయలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. తెలంగాణలో పలానా పార్లమెంట్ స్థానం పలానా పార్టీ దక్కించుకుంటుదనే అంశంపై కూడా జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ఈ బెట్టింగ్ దందా అంతా బ్యాంక్ చెక్‌బుక్‌లు, బాండ్ పేపర్లతో పాటు మధ్యవర్తి వద్ద ఏకంగా నగదును సైతం జమ చేస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన బెట్టింగ్‌లపై పోలీసులు దృషి సారించి పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11న ఎపిలో అసెంబ్లీతోపాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే బెట్టింగ్ రాయుళ్లు పావులు కదుపుతుండడంపై పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.ముఖ్యంగా లాడ్జిలు, హోటళ్లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్ పెట్టారనే సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేస్తున్నారు.
జోరందుకున్న బెట్టింగ్‌లు
RELATED ARTICLES