లక్షదీవుల అభివృద్ధిపై రాష్ట్రపతిని అభ్యర్థించిన శాస్త్రవేత్తల బృందం
కొచ్చి: అరేబియా సముద్రంలోని పగడపు దీవుల సమాహారం లక్షదీవుల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్‌డిఎఆర్)2021 వెనక్కి తీసుకునేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కొంతమంది శాస్త్రవేత్తలు లేఖ రాశారు. ప్రతిపాదిత ఎల్‌డిఎఆర్ చాలా సమస్యాత్మకమని ఆ దీవులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసిన వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. లక్షదీవుల పర్యావరణం, జీవితవిధానం, సంస్కృతిని తిరిగి నెలకొల్పేందుకు రక్షణ కల్పించే చట్టబద్ధ నియమాలకు తాజా ప్రతిపాదనలు విరుద్ధంగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. దూరదృష్టిలేని ఎల్‌డిఎఆర్ 2021 నమూనా పత్రాన్ని వెనక్కి తీసుకునేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తాము లేఖ రాసిన విషయాన్ని వెల్లడిస్తూ లక్షద్వీప్ రీసెర్చి కలెక్టివ్, మరో 60 మంది ప్రతినిధులతో కూడిన శాస్త్రవేత్తల బృందం గురువారం ఒక ప్రకటన జారీచేసింది. ఎల్ఎడిఆర్ వల్ల తలెత్తే చిక్కులపై లోతుగా సమీక్ష జరిపినట్లు ఆ బృందం వెల్లడించింది. స్థానిక భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రస్తుతం అమలులో ఉన్న రెగ్యులేషన్ భూమి స్వాధీనం, పునరావాసం, పునఃపరిష్కారం చట్టం 2013, జీవ వైవిధ్య చట్టం 2002, పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 లాంటి చట్టాలతో ఎల్‌డిఎఆర్ పొసగడం లేదని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
అంతేకాకుండా లక్షదీవుల విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ సిఫార్సులకు కూడా ఎల్‌డిఎఆర్ విరుద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పట్ల భారత్ చేసిన వాగ్దానాలకు కూడా ఇది సరిపోవడం లేదని తెలియజేశారు. వాతావరణ మార్పుల కారణంగా పగడపు దీవులైన లక్షదీవులు ఇప్పటికే దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న విషయాన్ని వారు గుర్తుచేశారు. రాజధాని కవరట్టి ప్రాంతం ఇప్పటికే క్షీణిస్తోందని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక లక్షదీవులు పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమే కాకుండా, సామాజికంగా పురోగామితత్వాన్ని కలిగిందని, కాబట్టి సుస్థిరమైన అభివృద్ధి కార్యచట్రం కావాలని విజ్ఞప్తిచేశారు. లక్షదీవుల్లో జరిగే అభివృద్ధి అంతాకూడా చాలా జాగ్రత్తగా జరగాలని సూచించారు. ఈ దీవులు కోలుకునేందుకు ఎంతకాలం పడుతుందో అంచనా వేయలేమని, ప్రతిపాదిత ఎల్‌డిఎఆర్ వినాశనం కంటే తక్కువేమీ కాదని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
జోక్యం చేసుకోండి
RELATED ARTICLES