అశ్రునయనాలతో అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు
ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరు
అంతిమ యాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో : భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసారం గ్రామ సమీపంలో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ లాంచనాలతో జరిగాయి. సోమవారం అశువులు భాసిన సంతోష్‌బాబు పార్ధీవదేహం ఆయన స్వస్థలమైన సూర్యాపేటకు బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక వాహనం ద్వారా చేరుకుంది. ప్రజల, బంధువుల సందర్శనార్థం విద్యానగర్‌లోని తన నివాసంలో ఉదయం 9గంటల వరకు ఉంచారు. ప్రజలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఆయన పార్ధీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన తల్లిదండ్రులను, భార్యను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. కల్నల్ సంతోష్‌బాబును స్మరించుకుంటూ దేశ రక్షణకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాని కీర్తించారు. అనంతరం అధికారులు అంత్యక్రియలకు సంబంధించి కుటుంబసభ్యులను సంప్రదించి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధిగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. పట్టణంలో ఆయన అంతిమ యాత్ర నిర్వహించగా అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కడసారి చూసేందుకు వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు కరోనా వైరస్‌ను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు. కల్నల్‌కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్ తన తనయుడికి దహన సంస్కారాలను మనవడు అనిరుద్ తేజను ఎత్తుకొని నిర్వహించారు. మిలటరీ జవాన్లు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. కల్నల్ ఆర్మీ యూనిఫాంను తన సతీమణి సంతోషికి అందజేశారు.
అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రముఖులు
కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలకు సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన ఇంటి వద్ద ఉన్న పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన వారు అంతిమయాత్రలో కూడా ముందు నడిచారు. వీర జవాన్‌కు జోహార్లు అర్పించారు. కాలినడకనే దహన సంస్కారాలు నిర్వహించే కేసారం వద్దకు పార్ధీవదేహంతో పాటు చేరుకున్నారు. మంత్రి జగదీస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాటు టిపిసిసి చీఫ్, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట జెడ్‌పి చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్‌రావు, తుంగతుర్తి, హుజూర్‌నగర్, నకిరేకల్ శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఎస్‌పి ఆర్. భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి, మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజు, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ శాసనసభ సభ్యులు సంకినేని వెంకటేశ్వర్‌రావు, ఉత్తమ్‌పద్మావతి, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంఎల్‌సి చెరుపల్లి సీతారాములు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్‌కుమార్, ఆర్‌డిఒ మోహన్‌రావు, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్‌లు పాల్గొన్నారు.
చౌరస్తా చౌక్‌లో కల్నల్ విగ్రహం ఏర్పాటుతో పాటు నామకరణం
దేశం కోసం ప్రాణాలను వీడిన కల్నల్ సంతోష్‌బాబు విగ్రహన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చౌరస్తా చౌక్ వద్ద ఏర్పాటు చేయడంతో పాటు నామకర ణం చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆయన సంతోష్‌బాబు అంత్యక్రియలో పాల్గొన్నారు. నేను ఉన్నాను అంటూ ముందు ఉండి అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్ కుమారుడి దహన సంస్కారాలు చేస్తుండగా ఆయనను పట్టుకొని ముందుకు నడిపించారు. కొడుకు పోయిన బాధలో పుట్టేడు దుఃఖంలో ఉన్న వారికి కొండంత ధై ర్యం ఇచ్చాడు. అంత్యక్రియలు ముగిసేంత వరకు వారి మధ్యే ఉన్నారు. అ నంతరం మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఆయన త్యాగాన్ని దేశం ఎన్నటికి మరువద్దని అన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా ఆ కుటుంబాని కి అండగా ఉంటానని చెప్పారు.