రైతులకు భూములు దక్కే వరకు పోరాడుతాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
గంగారం అసైన్డ్ భూముల సందర్శన
ప్రజాపక్షం / రంగారెడ్డి జిల్లా ప్రతినిధి రంగారెడ్డి జిల్లా గంగారం రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు దక్కే వరకు పోరాడుతామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా వెనుకాడబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఉపాధి లేని పేద ప్రజలకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ చట్టం కింద రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాలను కేటాయించిందని, ఆ భూములు లా క్కుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అసైన్డ్ భూములను పునరుద్ధరణ చేయకుండా, కొత్తగా పట్టా పాసు బుక్కులు ఇవ్వకుండా, భూములు లాకుంటామని అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నా రు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, సర్వే నెంబర్ 85 లోని గంగారం గ్రామంలో రైతుల భూములను సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి తదితర నేతలతో కలసి చాడ వెంకట్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం రైతుల ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గంగారం గ్రామంలో ఆరు దశాబ్దాల కిందట ప్రభుత్వం కేటయించిన అసైన్డ్ భూముల్లో పేదలు ఇప్పటికీ పంటలు సాగు చేసుకుని తమ పాధిని పొందుతున్నారని, నేడు కొందరు రాజకీయ నాయకులూ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రోత్సాహంతో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బెదిరింపులకు పాల్పడుతూ, పేదల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరాగా చేసుకొని అసైన్డ్ భూములను తృణమో, ఫణమో అప్పచెప్పి కాజేస్తే ఉరుకునేదిలేదని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దళితులు, గిరిజన, పేదల అసైన్డ్ భూములు లాక్కొని ఆ భూములలో సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, పార్కులకు అప్పగించి పేదలకు అన్యాయం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అయన తెలిపారు. స్వాతంత్య్రానంతరం ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు వివిధ రూపాలలో చేసిన పోరాటాల వల్ల పేదలకు ఈ భూములు దక్కాయని చాడ వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. అసైన్డ్ భూములు పేదలకే చెందాలని వారికి భూములపై నిర్దిష్టమైన హక్కులు కల్పించి వెంటనే పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. గంగారం గ్రామ ప్రజల భూ సమస్యలు పరిష్కరించేవరకు సిపిఐ అండగా ఉంటుందని, త్వరలో ముఖ్యమంత్రిని, జిల్లా కలెక్టర్‌ను కలసి అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామస్థులతోపాటు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ అఫ్సర్, పానుగంటి పర్వతాలు, గంగారం భూ సాధన కమిటీ అధ్యక్షులు దత్తు నాయక్, బికెఎంయు జిల్లా అధ్యక్షులు హనుమయ్య, ప్రధాన కార్యదర్శి ఇబుద్ధుల జంగయ్య, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దత్తు నాయక్, సిపిఐ మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్ మండలాల కార్యదర్శులు యాదయ్య, కె.జి.శంకర్, గిరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జైలుకైనా వెనుకాడం
RELATED ARTICLES