హిందూ రక్షాదళ్ ప్రకటన
సంస్థ నేత పంకీ చౌదరి వ్యాఖ్యలు వైరల్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) క్యాంపస్‌లో ఈనెల 5న (ఆదివారం) జరిగిన ముసుగు దుండగుల భీకర దాడి తమ పనేనని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జాతి విద్రో హ, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందునే ఆదివారం సాయంత్రం జెఎన్‌యు క్యాంపస్‌లోకి హిం దూ రక్షా దళ్ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారని ఆ సంస్థ నేత భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి చెబుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘గత కొన్నేళ్లుగా జెఎన్‌యు కమ్యూనిస్టులకు హబ్‌లా మారింది.. ఇలాంటి హబ్‌లను మేం సహించం.. వారు మా దేశాన్ని, మతాన్ని దూషిస్తూన్నా’రని తోమర్ ఈ వీడియోలో వ్యా ఖ్యానించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు తలపెడితే ఇతర యూనివర్సిటీల్లోనూ ఇవే చర్యలు పునరావృతమవుతాయని ఆయన హెచ్చరించారు. జెఎన్‌యు విద్యార్ధులు ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ వర్సిటీలో చదువుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెఎన్‌యు దాడి ఘటనలో పాల్గొన్నది తమ కార్యకర్తలేనని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉం టామని స్పష్టం చేశారు. కాగా, పింకీ చౌదరి వ్యాఖ్యలపై పోలీసులు ఇంత వరకు స్పందించలేదు. జెఎన్‌యు క్యాంపస్‌లోకి ఆదివారం సాయంత్రం చొచ్చుకువచ్చిన ముసుగు దుండగులు విచక్షణారహితంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో 34 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీకి చెందిన ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఎబివిపి కార్యకర్తలే విద్యార్థులపై దాడి పాల్పడ్డారని జెఎన్‌యు విద్యార్థి యూనియన్ ఆరోంచింది.
ముసుగు దుండగుల గుర్తింపు పనిలో పోలీసులు
మరోవైపు తోమర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముసుగు దుండగులను గుర్తించేందుకు వీడియో ఫుటేజీలు, ముఖ గుర్తింపు వ్యవస్థ సహాయాన్ని పోలీసులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసులు కూడా థోమర్ వ్యాఖ్యలపై విచారణ చేపడుతున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
జెఎన్‌యు సర్వర్ రూమ్‌లో విధ్వంసంపై ఎఫ్‌ఐఆర్
జెఎన్‌యులోని సర్వర్‌రూమ్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను న మోదు చేశారు. ఈనెల 5న జెఎన్‌యు అధికార యం త్రాంగం చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విధ్వంసంలో విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా యూనియన్ ఆఫీస్ బేరర్లకు సంబంధముందంటూ జెఎన్‌యు అధికార యంత్రాంగం వారి పేర్లను పోలీసులకు అందజేసింది. జనవరి 3న సర్వర్‌ను స్విచ్చాఫ్ చేశారంటూ ఒక ఫిర్యాదు నమోదు కాగా, జనవరి 4న సర్వర్ రూమ్‌లో విధ్వంసం జరిగిందని మరో ఫిర్యాదు దాఖలైందని పోలీసులు చెప్పారు. కాగా, యూనివర్సిటీ అధికార యంత్రాంగం ప్రత్యేకించి కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేసిందని జెఎన్‌యుఎస్‌యు ఉపాధ్యక్షుడు సాకెత్ మూన్ ఆరోపించారు. సర్వీర్ రూమ్‌లో జరిగిన విధ్వంసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
గాయపడిన విద్యార్థులపై కేసులు
గత ఆదివారం దుండగుల దాడిలో గాయపడిన జెఎన్ యు విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు జనవరి 4న వర్సిటీ సర్వస్ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్, మరో 19 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారని జెఎన్‌యు అడ్మినిస్ట్రేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక, సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు మేరకు అయిషీ ఘోష్, మరో 19 మందిపై జనవరి 5న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
జెఎన్‌యులో దాడి అనాగరిక చర్య
జెఎన్‌యులో ఆదివారం జరిగిన హింసాత్మక దాడిని అనాగరిక చర్యగా నార్త్‌ఈస్ట్ స్టూటెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఇఎస్‌ఒ) అభివర్ణించింది. ప్రఖ్యాత విద్యాసంస్థలో అమాయక విద్యార్థులకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించింది. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా తక్షణమే హింసకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని ఎన్‌ఇఎస్‌ఒ సలహాదారు సముజ్జల్ కుమార్ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు విద్యా సంస్థల్లో ఆమోదనీయం కాదన్నారు.
జెఎన్‌యు ప్రొఫెసర్ సుచరితా సేన్ ఫిర్యాదు
జెఎన్‌యులో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడిలో గాయపడిన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుచరితా సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్రలు, ఇనుపరాడ్లు, మారణాయుధాలతో యూనివర్సిటీ క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదటగా తన భుజం పై పెద్ద రాయితో దాడి చేశారని, తరువాత తలపై దాడిచేసినట్లు ఆమె చెప్పారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయానన్నారు.