ఆదిలాబాద్ అభ్యర్థుల పిటిషన్‌పై స్పందించిన కోర్టు
అన్ని వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్ : పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల నియామక ప్రక్రియ గతితప్పిన మాట వాస్తవమేనని హైకోర్టు సమర్థించింది. ఈ జూనియర్ కార్యదర్శుల నియామకాలపై కోర్టు స్టే విధించింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల పట్ల అన్యాయానికి గురైనట్లుగా చెపుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిఆర్ నియామక బోర్డు ఫైనల్ కీ, మెరిట్ లిస్ట్‌ను కూడా ప్రకటించలేదని ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. నేరుగా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను బోర్డు ప్రకటించింది. అయితే పాసై, ఉద్యోగం వచ్చినట్లుగా పేర్కొన్న కొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా ఈ జాబితాలో లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన తలెత్తింది. వివిధ జిల్లాల నుంచి పంచాయతీ కమిషనరేట్‌కు బాధిత అభ్యర్థులు చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని కలెక్టర్ల వద్దనే తేల్చుకోవాలని పంచాయతీరాజ్ అధికారులు స్పష్టంచేసినప్పటికీ, ఆదిలాబాద్‌కు చెందిన బాధిత అభ్యర్థులు మాత్రం కోర్టులో పిటిషన్ దాకలు చేశారు. అనర్థాలకు దారితీసిన సర్కారు తొందరపాటు చర్యను సరిచేసే క్రమంలో హైకోర్టు ఈ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రక్రియ ఆగబోదని కోర్టు హామీయిచ్చింది. ప్రశ్నావళిలోనే తప్పులు వచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయని,వాటి వివరాలతోపాటు పరీక్ష రాసిన అభ్యర్థులందరి వివరాలను (కులం,రిజర్వేషన్లు తదితరాలు) సమర్పించాలని,తద్వారా తయా రు చేసిన మెరిట్ లిస్ట్‌ను సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై హైకోర్టులో వ్యా జ్యం దాఖలైంది. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ కొంద రు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టంచేసింది. ఎంపిక ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష ప్రశ్నపత్రం,జవాబుపత్రాల (ఓఎంఆర్) నకలు ఇవ్వకుండా, అభ్యర్థుల మార్కుల వివరాలు, కేటగిరీ కటాఫ్, రాష్ట్ర, జిల్లాస్థాయి మెరిట్ జాబితాలు వెల్లడించకుండా నేరుగా నియామక జాబితాలు ప్రకటించారంటూ ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు విమర్శిస్తున్నారు. జిల్లాస్థాయి పోస్టుల ఎంపిక విధానంలోని కనీస ప్రమాణాలు పాటించలేదని వారు మండిపడుతున్నారు. జిల్లాల్లో ప్రకటించిన ఎంపిక జాబితాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు పలువురు అభ్యర్థులు నిన్న ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.