లాక్‌డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
అన్‌లాక్-1 పేరుతో మార్గదర్శకాలు విడుదల ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం
కర్ఫ్యూ సమయం కుదింపు బఫర్‌జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే
న్యూఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో నెలరోజులపాటు పొడిగించింది. ఈసారి కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే ఆంక్షలు పరిమితం చేస్తూ, జూన్ 30వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. మే 31వ తేదీతో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం హోంశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లాక్‌డౌన్ 5.0కు సంబంధించి అన్‌లాక్ 1 పేరుతో కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ విషయంలోనూ హోంశాఖ సడలింపులు ఇచ్చింది. ఇకపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది. కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ జోన్లను నిర్ణయించే అధికారం జిల్లా అధికార యంత్రాంగానికి ఉంటుందని హోంశాఖ పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లు కాకుండా బఫర్ జోన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలదేనని తెలిపింది. తొలి వారం రోజులపాటు ఆంక్షలు యథావిధిగా కొనసాగించిన మీదట, రెండో వారం నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్, ఆతిథ్య సేవలకు అనుమతినిచ్చింది. అయితే స్కూళ్లు, కాలేజీలు, మెట్రోరైళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాకపోతే విద్యాసంస్థలను తెరిచే విషయంపై జులైలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. తొలి దశ (ఫేజ్-1)సడలింపుల్లో భాగంగా, జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు కేంద్రం అనుమతిచ్చింది. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్‌కు కూడా కేంద్రం అనుమతిచ్చింది. వీటిలో కొవిడ్-19 నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, ఆ కార్యాకలాపాలపై నిషేధం విధించడం జరుగుతుంది. అలాగే రెండో దశ (ఫేజ్-2) సడలింపుల్లో భాగంగా, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచే అంశం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు తల్లిదండ్రులు, యాజమాన్యాలతో చర్చించాల్సి వుంటుందని, వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా విద్యాసంస్థల పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇదిలావుండగా, మెట్రో రైలు సేవలకు అనుమతి లేదని కేంద్రం ప్రకటించింది. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా అనుమతి లేదని తెలిపింది. కేంద్ర హోంశాఖ అనుమతిచ్చిన విమానాలకు మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, సినిమా హాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఫేజ్-3 మినహాయింపులకు సంబంధించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఆ ప్రకటనలో తెలిపింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే, దానిపై పూర్తి నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. లాక్‌డౌన్ 5.0లో భాగంగా అంతర్రాష్ట్ర రవాణాపై కేంద్ర హోంశాఖ నిషేధం ఎత్తివేసింది. ప్రజా రవాణా అనుమతించే విషయంలో ఇరు రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అలాగే, ప్రయాణికుల రైళ్లు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వంటివి యథావిధిగా కొనసాగుతాయని కేంద్రం పేర్కొంది. సరకు రవాణాను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోకూడదని కేంద్రం పేర్కొంది. ఇవికాకుండా, మరికొన్ని సూచనలను కూడా ఈ మార్గదర్శకాల్లో చేర్చింది. 65 ఏళ్లకు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు వారు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా బయటకు రాకపోవడం మంచిదని హితవు పలికింది. బయటకొచ్చేటప్పుడు, ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. భౌతికదూరంలో భాగంగా కనీసం 6 అడుగుల దూరం పాటించాలని, ఆరోగ్యసేతు యాప్‌ను వినియోగించాలని తెలిపింది. వివాహ, ఇతర శుభ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే, 50 మంది వరకే అనుమతిని ఇవ్వాలని, కర్మకాండల విషయంలో 20 మందికి మించరాదని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఇక మూడోదశ సడలింపులను కేంద్రం ఈ నెల రోజుల సమయంలో ఎప్పుడైనా వెల్లడించే అవకాశం వుంది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ప్రభుత్వం ఆదివారంనాడు స్పందించే అవకాశం వుంది.