ఎంఎల్‌సిల అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన సీట్ల భర్తీపై ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ లీగల్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంఎల్‌సిలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను జూన్ 3వ తేదీ వరకూ వెలువరించరాదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ముగ్గురి శాసనమండలి సభ్యులను అనర్హులుగా చేయడానికి సంబంధించిన ఫైళ్లను అందజేసేందుకు సమయం కావాలని మండలి కోరింది. జూన్ 3 వరకూ విచారణను వాయిదా వేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కోరారు. అందుకు అనుమతించిన హైకోర్టు ధర్మాసనం అప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సం ఘం ఆ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించరాదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాయిదా కోరుతున్న నేపథ్యంలో అప్పటి వరకూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడదంటే అందుకు తమకు అభ్యంతరం లేదని కూడా ప్రభుత్వం తెలిపింది. ఎంఎల్‌సిలుగా అనర్హులని పేర్కొంటూ మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను భూపతిరెడ్డి, యాదవరెడ్డి, ఎస్ రాములు నాయక్‌లు విడివిడిగా దాఖలు చేసిన వ్యాజ్యాలు గురువారం మరోసారి హైకోర్టు విచారించింది. రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ బుధవారం వాదనలు వినిపిస్తూ.. ‘నాయక్‌ను ఎంఎల్‌సిగా గవర్నర్ నియమించారు. పార్టీలకు అతీతంగా ఈ నియామకం జరిగింది. ఇలా నియమితులైన ఎంఎల్‌సి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. నాయక్‌ను అనర్హుడిగా మండలి చైర్మన్ గత జనవరి 16న తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగంలోని 11,10 షెడ్యూళ్లు నాయక్‌కు వర్తించవు. ఫలానా పార్టీలో నాయక్ చేరారని ఫిర్యాదుదారుడు నిరూపించాలి. నాయక్‌కు ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉంటే ఆ విషయం అసెంబ్లీ రికార్డుల్లో ఉంటుంది. వాటిని పరిశీలించాలి అని వాదించారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌సిలు అనర్హత వేటుకు చెందిన రికార్డులతోపాటు వీడియోలను సబ్‌సైటిల్స్ సహా ఇవ్వాలని బుధవారం హైకోర్టు మండలిని ఆదేశించింది. గురువారం జరిగిన విచారణ సమయంలో అదనపు ఎజి వాయిదా కోరడంతో జూన్ 3 వరకూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదని ఇసిని ధర్మాసనం ఆదేశించింది.