సిఎం కెసిఆర్‌కు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చిన మేరకు 2006 జూనియర్ లైన్‌మెన్‌గా అర్హత (క్వాలిఫై) సాధించి ఉద్యోగాలు రాని అభ్యర్థులకు మానవతా దృక్పథంతో ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని మాజీ ఎంఎల్‌ఎ, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సిఎం కెసిఆర్‌కు సోమవారం ఒక లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2006 సంవత్సరంలో జూనియర్ లైన్‌మెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయగా నిబంధనల ప్రకారం లైన్‌మెన్‌గా అర్హత (క్వాలిఫై) సాధించిన 1800 మందిని విధుల్లోకి తీసుకోలేదని, దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారని ఆయన తన లేఖలో వివరించారు. 2008లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011 సంవత్సరంలో 1175 మంది లైన్‌మెన్స్‌కు ఉద్యోగాలు ఇచ్చారని, మిగతా 650 మందిని ఉద్యోగ ఖాళీలు లేవనే సాకుతో పక్కన్న పెట్టారని తెలిపారు. వారికి భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. పిఆర్‌సి ప్రకటించే క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు కేసులు ఉపసంహరించుకుంటే వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు అభ్యర్థులు సుప్రీంకోర్టు నుండి కేసును ఉపసంహరించుకున్నప్పటికీ వారికి ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, దీంతో వారిలో నిరుత్సాహం, నిరాశ పెరుగుతున్నదని చాడ వెంకట్‌రెడ్డి లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
జూనియర్ లైన్‌మెన్ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చి ఆదుకోండి
RELATED ARTICLES