అనర్థాలకు దారితీసిన సర్కారు తొందరపాటు
ఫైనల్ కీ, మెరిట్ లిస్ట్‌ను కూడా ప్రకటించని పిఆర్ నియామక బోర్డు
నేరుగా పోస్టులకు ఎంపికైన వారి జాబితా ప్రకటన
వివిధ జిల్లాల నుంచి పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు చేరుకున్న బాధిత అభ్యర్థులు
కార్యాలయం ఎదుట ఆందోళన
కలెక్టర్ల వద్దనే తేల్చుకోవాలని స్పష్టం చేసిన పంచాయతీరాజ్ అధికారులు
జూనియర్ కార్యదర్శుల నియామకాల్లో గందరగోళం
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఆగమేఘాల మీద పూర్తి చేయాలని సర్కారు ఆదేశించడంతో పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల నియామకాల పర్వం గతి తప్పింది. ఎందరో అర్హులైన అభ్యర్థులకు తీరని నష్టాన్ని కలిగించింది. నియామకపు ప్రక్రియలోని ఏ ఒక్క నిబంధననూ పాటించడకుండా (పాటించడానికి సమయం లేక) నేరుగా పోస్టులకు ఎంపికైన వారి జాబితానే పంచాయతీరాజ్ రిక్రూట్‌మెంట్ బోర్డు జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లలో మంగళవారం ప్రచురించింది. ఉద్యోగం రానివారిలో ఆందోళన సహజంగా ఉంటుంది, అయితే ఈ ఆదరాబాదరా చర్య కారణంగా ఉద్యోగాలు పొందిన వారిలోనూ ఆందోళన నెలకొనడం గమనార్హం. ఎంపికైన అభ్యర్థుల్లో కూడా చాలా మందికి చెందిన రిజర్వేషన్ కేటగిరీలే మారిపోయాయి. కొందరికి రిజర్వేషన్ కేటగిరీ ఉన్నప్పటికి వర్తింప చేయలేదు. దీంతో ఉద్యోగాలు వచ్చినవారు, రానివారు అని తేడా లేకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. నియామక ప్రక్రియపై అధికారులను నిలదీశారు. అయితే మీ ప్రశ్నలకు సమాధానాలు మావద్ద దొరకవని,ఇదంతా జిల్లాల వారీగా జరిగిన వ్యవహారం కాబట్టి కలెక్టర్ల వద్ద అక్కడే తేల్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులు వారిని తిప్పి పంపారు. అయినప్పటికీ మంగళవారం రాత్రి వరకు వివిధ ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా బాధిత అభ్యర్థులు పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. వీరిలో కొందరు తమకు జరిగిన అన్యాయానికి న్యా యం పొందేందుకు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో తొందరపాటు అసలుకే ఎసరు తెచ్చిపెట్టే విధంగా తయారైంది. కోర్టులో ప్రక్రియపై ప్రతికూల నిర్ణయం వెలువడితే ఈ నియామకపు ప్రక్రియ ముచ్చటగా రెండో సారి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.
గందరగోళంగా నియామకపు ప్రక్రియ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకపు ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కారు. టిఎస్‌పిఎస్‌సి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఇలా ఎలాంటి నియామకపు బోర్డు అయినా కొన్ని నిబంధనలను తప్పకుండా పాటిస్తాయి. రాత పరీక్ష అనంతరం తొలుత ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు జవాబులతో ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు కొన్ని రోజులు గడువు ఇస్తారు. వాటిని పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఫైనల్ కీ విడుదల తర్వాత ప్రశ్నపత్రాలు వాల్యువేషన్ చేసి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ప్రకటించాలి. అనంతరం నియామకపు రోస్టర్ పద్ధతిని విడుదల చేయాలి. రిజర్వేషన్ల కేటగిరీల వారీగా కేటాయించాలి. వీటన్నింటికి విధిగా బోర్డు వెబ్‌సైట్‌తో పాటు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో గానీ, జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో గానీ బోర్డుపై డిస్‌ప్లే చేయాలి. ప్రస్తుతం జూనియర్ కార్యదర్శుల నియామకాల్లో ఇవేవి పాటించలేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9355 జూనియర్ కార్యదర్శుల పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఆగస్టు 27 నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో జిల్లాను ఒక యూనిట్‌గా చేసి నియామకపు ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు తొలుత సెప్టెంబర్ 11వ తేదీని ఆఖరు తేదీగా ప్రకటించి మళ్లీ దీనిని సెప్టెంబర్ 15కు పొడిగించారు. అక్టోబర్ 4వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొని మళ్లీ దీనిని కూడా పొడిగించి అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష నిర్వహించి దాదాపు 80 రోజులు దాటింది. పరీక్ష పూర్తయిన అనంతరం దాదాపు నెల రోజులకు అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. నిజానికి కొత్త పంచాయతీలు కొలువుదీరే నాటికే ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ లెక్కన ఆగస్టు ఒకటో తేది నాటికే పూర్తి కావాలి. ఇంత తొందర ఉన్న సర్కారు రాత పరీక్ష అనంతరం ఎన్నికల కోడ్‌కు మధ్య నెలరోజులు వ్యవధి ఉన్నా నియామకపు ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆదరబాదరాగా చేయడం, అందులోనూ లెక్కకు మించిన తప్పిదాలు చోటుచేసుకోవడంతో అభ్యర్థుల్లో తీవ్రమైన వ్యతిరేకతతో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది.
నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు ఎంపికయ్యారు : శ్రీనివాస్, మెదక్
రాత పరీక్షలో నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కార్యదర్శి పోస్టుకు ఎంపికయ్యారు. మార్కుల జాబితా లేదా, మెరిట్ జాబితా ప్రకటించాలి, అలా చేయకపోవడంతో నియామకాల్లో గందరగోళం చోటుచేసుకుందని స్పష్టం అవుతోంది. వెంటనే మెరిట్ జాబితా ప్రకటించాలి.
ఎంపిక ప్రక్రియంతా తప్పుల తడక : రమేష్ , జగిత్యాల
జూనియర్ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియంతా తప్పుల తడక. నియామకపు పర్వంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పాటించలేదు. మెరిట్ జాబితా, రోస్టర్ సిస్టం, ఫైనల్ కీ ఇవన్నీ ప్రకటించాలి. ఇవేమి లేకుండా నేరుగా ఎంపికైన వారి పేర్లనే ప్రకటించడం అన్యాయం. నియామకాలను నిలిపివేసి పద్దతి ప్రకారం మళ్లీ చేపట్టాలి.
ఫలితాల వచ్చాక ఫైనల్ కీ విడుదల
జూనియర్ కార్యదర్శుల ఫైనల్ కీ మంగళవారం విడుదల చేశారు. ఫైనల్ కీ విడుదల చేయకుండానే నేరుగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయమే ఫలితాలను చూసుకున్న అభ్యర్థులు జిల్లాల నుంచి మధ్యాహ్నం లోపే కమిషనరేట్‌కు చేరుకున్నారు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ ఆగమేఘాల మీద పత్రికా ప్రకటనను సాయంత్రం విడుదల చేశారు. జిల్లాలలోని ఖాళీల సంఖ్య, కేటగిరి, మెరిట్, రోస్టర్ ఆధారంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎంపికైన వారి తాత్కాలిక జాబితాను సిద్ధం చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఆగస్టు 30 నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. మొత్తం 5,62,497 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారికి అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించామని తెలిపారు. వీరిలో 4,78,034 మంది అభ్యర్థులు మొదటి పేపర్‌కు హాజరయ్యారని, 4,74,778 మంది రెండవ పేపర్‌కు హాజరయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు కేటగిరీల వారీగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో లభ్యమవుతాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల స్థానికత, కుల, ఆదాయ, విద్యార్హత, పుట్టిన తేది, వయస్సు దృవీకరణ పత్రాల పరిశీలనను బుధవారం నుంచి జిల్లాల్లో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బుధవారం నుంచి మార్కుల వివరాలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా చూడవచ్చన్నారు. ఈనెల 20 నుంచి ఒఎంఆర్ షీట్లను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు. తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు ఏదేని సహాయం కోసం సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.