15న చంద్రయాన్ – 2 ప్రయోగం : ఇస్రో
బెంగళూరు: చంద్రుడిపైకి భారత్ రెండో ప్రయోగం.. చంద్రయాన్ ——2ను జులై 15న ప్రయోగించబోతున్నట్లు భారత రోదసి సంస్థ(ఇస్రో) చైర్మన్ కె శివన్ బుధవారం ప్రకటించారు. ఇంతవరకు చంద్రుడిపై ఎవరూ దిగని దక్షిణ ధ్రువంలో సెప్టెంబర్ 6 లేక 7వ తేదిన దిగబోతున్నట్లు ఆయన ఇక్కడ విలేకరులకు చెప్పారు. చాలా సంక్లిష్టమైన ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు. శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్(ఎంకె) 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోదసి వాహకం బరువు 3.8 టన్నులు ఉండనుందని, ఆర్బిటర్, ల్యాండర్(విక్రం), రోవర్(ప్రజ్ఞ) అనే మూడు మాడ్యులర్లను చంద్రుడి మీదికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్బిటర్ ఎనిమిది పేలోడ్స్, ల్యాండర్ మూడు, రోవర్ రెండు పేలోడ్స్ తీసుకెళ్లనున్నట్లు శివన్ చెప్పారు. ఇప్పటి కే ఆలస్యమైనా.. చంద్రయాన్ 2 పూర్తి స్థాయిలో సిద్ధమైందని పేర్కొన్నారు. జులై 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు జిఎస్ఎల్వి మార్క్(ఎంకె)-3 రాకెట్ సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభిస్తామని శివన్ పేర్కొన్నారు. ఆర్బిటర్ సైంటిఫిక్ పేలోడ్స్‌తో చంద్రుడి చుట్టూ పరిభ్రమించనున్నదని, ముందుగా నిర్ధేశించుకున్న ప్రదేశంలో ల్యాండర్ దిగనున్నట్లు, తర్వాత అది రోవర్‌ను చంద్రుడిపై పరిశోధన కోసం బయటకు పంపనున్నట్లు ఇస్రో తెలిపింది. ఉపగ్రహానికి సంబంధించినంత వరకు చంద్రయాన్ 2కు రూ. 603 కోట్లు, జిఎస్ఎల్వి ఎం కె3కి రూ. 375 కోట్లు ఖర్చవుతోందని శివన్ చెప్పారు. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లపై ఉండే సైంటిఫిక్ పేలోడ్స్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజాలు వంటి వాటిపై ప్రాథమిక అధ్యయనాలు చేయనునాయి. రోవర్(ప్రజ్ఞ) ల్యాండర్(విక్రం) నుంచి విడిపోయి చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నది. పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్ 1 కన్నా ఇప్పటి చంద్రయాన్ 2 అత్యాధునిక వర్షన్ అని ఇస్రో తెలిపిం ది. చంద్రయాన్ 1లో 11 పేలోడ్స్ తీసుకెళ్లారు. వా టిలో ఐదు భారత్‌వి, మూడు యూరోప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. చంద్రయాన్ 1 ప్రయో గం చంద్రుడి ఉపరితలంలో నీరున్నట్లు కనుగొంది.
చంద్రయాన్ 2 ఆలస్యానికి యుపిఎ కారణం: మాధవన్ నాయర్
చంద్రయాన్ 2 ప్రయోగం చాలా ఏళ్ల కిందటే చేపట్టి ఉండాల్సిందని, కానీ యుపిఎ ప్రభుత్వం 2014 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ‘మంగళ్యాన్’ ప్రయోగాన్ని ముందుకు తోసిందని ఇస్రో మాజీ చైర్మన్ జి మాధవన్ నాయర్ చెప్పారు. మానవ రహిత మిషన్ చంద్రయాన్ 1ను 2008 అక్టోబర్ 22న ప్రయోగించారు. అప్పుడు ఇస్రో ఛైర్మన్‌గా ఆయనే ఉన్నారు. ఆయన రోదసి శాఖలో సెక్రటరీగా 2003 నుంచి 2009 వరకు పనిచేశారు. చంద్రయాన్ 2 ప్రయోగం 2012 చివరకల్లా సాధ్యమవుతుందని మాధవన్ 2009 ఆగస్టులోనే చె ప్పారు. 2014 ఎన్నికలకు ముందు యుపిఎ ప్రభుత్వం కాస్త పెద్ద ప్రయోగాన్ని చూపెట్టడం కోసం మంగళ్యాన్ ప్రయోగాన్ని చేపట్టిందన్నారు. చంద్రయాన్ 2 పనిలో సగం ఇదివరకే పూర్తయిందని, కానీ ఆ విషయాన్నింటి నుంచి మంగళ్యాన్ ప్రయోగానికి దృష్టి మళ్లించారని, 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని తిరిగి చేపట్టారని మాధవన్ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ఈ మిషన్‌ను సన్నద్ధం చేసినందుకు ఆయన ఇస్రోను అభినందించారు. ‘ఇది చాలా సంక్లిష్టమైన మిషన్. చంద్రయాన్ 2 ప్రయోగానికి ముందు ఇంకా అనేకం అభివృద్ధి చేయాల్సి ఉంది. పరీక్షించాల్సి ఉంది’ అన్నారు.