ఐఆర్, పిఆర్సి మళ్ళీ వాయిదాకు కుట్ర
ఉద్యోగుల్లో సందేహాలు
మూడేళ్లయినా నెరవేరని ఐఆర్ హామీ
ప్రజాపక్షం / హైదరాబాద్ ప్రభుత్వోద్యోగులకు సంబంధించి ఇప్పట్లో పిఆర్సి ఏమో కానీ.. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) కూడా ఇస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సాకుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటిని సుదీర్ఘకాలం వాయిదా వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా లాక్‌డౌన్‌ను కారణంగా చూపిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వోద్యోగులకు సగం జీతం , పెన్షనర్లకు కూడా పాతిక శాతం కోత వేశారన్న అనుమానాలు ఉద్యోగుల్లో నెలకొంటున్నాయి. ఇప్పటికే కోతలపై హైకోర్టులో కేసు కొనసాగుతుండగా, ప్రభుత్వం దానిని నీరుగార్చే విధంగా కోతలకు సంబంధించి ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం ఆరు నెలల పాటు జీతాల కోతకు వెసులబాటు ఉంటుంది. ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే మాసాలకు సంబంధించి సగం జీతం కట్ చేయగా, మరో మూడు మాసాలు కోత వేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది. అదే సమయంలో ఆరు నెలలలోగా కోత విధించిన మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. మొదట్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌గా ఉన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాల్లో కోత విధించగా, సర్వత్రా విమర్శలు రావడంతో వారిని మినహాయించారు. ఒకవైపు దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి జీతాలు ఇస్తున్నాయి. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో ఇవ్వకపోవడం వెనుక ఐఆర్, పిఆర్సిని ఇప్పట్లో ప్రకటించకూడదనే ఉద్దేశాలు కనపడతున్నాయని ప్రభుత్వోద్యోగ సంఘ నేతలు అనుమానిస్తున్నారు.
ఐఆర్ హామీకే మూడేళ్ళు
వాస్తవానికి పిఆర్సి గడువు ఎప్పుడో తీరిపోయింది. 2018 జూన్‌కు ముందే కొత్త పిఆర్సి అమల్లోకి రావాల్సి ఉంది. అప్పట్లో గడవు సమీపిస్తున్నా పిఆర్సి వేయకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఉద్యోగ సంఘ నేతలను చర్చలకు ప్రగతిభవన్‌కు పిలిపించి, 2018 మే నెలలో పిఆర్సిని ముఖ్యమంత్రి నియమించారు. అదే ఏడాది జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తామని, ఆగస్టు 15న కొత్త పిఆర్సి ఇస్తామని కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన గడువులు దాటుతున్నా ఐఆర్ ఊసే లేదు. 2018లో ఐఆర్ ప్రకటిస్తామని మూడేళ్ళు గడిచిపోయింది. పిఆర్సి అధ్యయనం ఎప్పుడో ముగిసినప్పటికీ, ఇతర అంశాలపై అధ్యయనం పేరుతో మూడు సార్లు గడువు పెంచారు. చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పిఆర్సి గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రకటించారు. దీనిపై అసంతృప్తి రావడంతో త్వరలో ఐఆర్ వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఊరించాయి. అది కూడా అడియాశే అయింది.
కరోనాతో మళ్ళీ పిఆర్సిపై నీలినీడలు
కరోనా రావడంతో ప్రభుత్వానికి ఐఆర్, పిఆర్సిని మళ్ళీ వెనక్కి నెట్టేందుకు మరో సాకు దొరికినట్లయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి వాటిని మరికొద్ది మాసాలు వాయిదా వేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే జీతాల కోత ద్వారా అవే సంకేతాలను ప్రభుత్వం ఇస్తున్నదని చెబుతున్నారు. పిఆర్సి ఏమో కానీ.. కనీసం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. వరుసగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఘోర ఓటమి పాలవుతుండడంతోనే ఉద్యోగుల అంశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నట్లు భావిస్తున్నారు.
జీతాల కోతలు అందుకేనా?
RELATED ARTICLES