తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌లలో కోత విధింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, టీచర్ల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్‌లో గరిష్ఠంగా 50 శాతం కోత విధించే అవకాశం ఉన్నది. తగ్గించిన మొత్తాన్ని ఆరు నెలల్లోగా తిరిగి ఆయా వ్యక్తుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుండి మూడు నెలలు గా ప్రభుత్వోద్యోగులకు 50 శాతం వేతనమే ఇస్తున్నారు. అలాగే పెన్షన్‌లలో 25 శాతం కోత పెట్టారు. దీనిపై పెన్షనర్లు హైకోర్టుకు వెళ్ళగా, పెన్షన్‌లకు కోత విధించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి జూన్‌లో చెల్లించిన పెన్షన్‌లో కోతను కొనసాగించారు. ఏ చట్టం ప్రకారం పెన్షన్‌లలో కోత విధించారని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల నుండి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎన్నుకుంది. తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రత్యేక నిబంధనల ఆర్డినెన్స్ 2020 పేరుతో రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదంతో మంగళవారం జారీ చేశారు. ఇది మార్చి 24వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఫలితంగా మరో మూడు నెలల పాటు జీతాలు, పెన్షన్లలో కోత విధించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే కోర్టులు, ట్రిబ్యునల్‌లో జీతాల కోత నిర్ణయాన్ని సవాలు చేసేందుకు వెసులుబాటు లేకుండా ఆర్డినెన్స్‌లో నిబంధనలను చేర్చారు.
జీతాలు, పెన్షన్లలో కోత
RELATED ARTICLES