శరవేగంగా పాలక పార్టీ ఎత్తులు
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు సర్కార్ రంగం సిద్ధం
పాత దరఖాస్తుదారులకే ఇళ్ల కేటాయింపు
లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
ప్రజాపక్షం/హైదరాబాద్ : డబుల్‌బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం రెవెన్యూ శాఖ కు అప్పగించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అయితే కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం చేసుకున్న దరఖాస్తులనే పరిశీలించాలని నిర్ణయించారు. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేసే కార్యక్రమంలో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వచ్చే డిసెంబర్ మాసంలోపు ఇళ్ల కేటాయింపు జరుపుతామని ఇటీవల మున్సిపల్ శాఖమంత్రి కెటిఆర్ ప్రకటించిన విషయం తెల్సిం దే. గ్రేటర్ హైదరాబాద్ లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం హామీనిచ్చిన విషయం విదితమే. అందులో భాగంగా నగరంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. డిసెంబర్ నాటికి 75 వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అలాగే జెఎన్‌ఎన్‌యుఆర్ ఎం కింద మరో 10 వేల ఇళ్లను నిర్మాణం కూడా పూర్తి కానుంది. మొత్తం 85 వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. జిహెచ్‌ఎంసి పాలకమండలి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం పాలక పార్టీ టిఆర్‌ఎస్ వేగంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో నిర్మాణం పూర్తయిన దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్ నెం బర్- 45 ఫ్లుఓవర్‌లను ప్రారంభించనున్నారు. డిసెంబర్ చివరి నాటికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి, జనవరిలో మాసంలో ఎన్నికలకు వెళ్లేందుకు పాలక పార్టీ వ్యూహంగా కనిపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. జిహెచ్‌ఎంసి పరిధిలో 24 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పటాన్‌చెరువు, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన రెండు చొప్పున వార్డులు మాత్రమే వస్తాయి. మిగిలిన 22 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో జిహెచ్‌ఎంసిలో ఉంటాయి. అయితే డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నియోజకవర్గానికి 4 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన స్థానిక ప్రాంతాల వారికి 10 శాతం కేటాయించనున్నారు. మిగిలినవి నగరంలోని ఇతర నియోజకవర్గాల వారికి పంపిణి కేటాయించనున్నారు. ఇళ్లను సమీప నియోజకవర్గాల లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్.బి.నగర్, అంబర్‌పేట్ ప్రాంతాల వారికి రాంపల్లిలో నిర్మిస్తున్న ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలకు కొత్తూరులో నిర్మిస్తున్న ఇళ్లను కేటాయించనున్నారని తెలిసింది. ఇలా సమీప నియోజకవర్గాల వారికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
జిహెచ్‌ఎంసి ఎన్నికలపై కదులుతున్న పావులు
RELATED ARTICLES